Friday, May 19, 2023

రోగాలు లేని జీవితం ఉంటుందా

రోగములు లేని జీవితక్రమంలో ధ్యానం కూడా ఒకటి. మనసు స్థిరంగా ఉండాలంటే అనగా ఆలోచనలు సక్రమంగా ఉండాలంటే ధ్యానము అత్యవసరము. మనసులోని ఆలోచనలకు కళ్లెం వేయగలిగేది ధ్యానం మాత్రమే. 

వివిధ ధ్యాన పద్ధతులతో పాటు కొందరు మంత్రజపమును ఎన్నుకుంటారు. మంత్ర జపం నామస్మరణ ద్వారా చేసిన బీజాక్షరములతో కోరికల సిద్ధి కొరకు చేసిన జపము పూర్తి అయిన తర్వాత జపసంఖ్యలో కొంత శాతం తర్పణము, హోమము, అన్నదానము చేయాలని పండితులు చెబుతారు. 

రోగము వచ్చినప్పుడు ప్రపంచంలో ఇందరున్నారు, నాకే ఎందుకు రావాలని ఆలోచించడం వృధా. దానివలన ఆ రోగం తగ్గదు. సరైన వైద్య సేవతో పాటు సక్రమమైన ఆహార పద్ధతులు పాటిస్తూ రోగ నియంత్రణకు ప్రయత్నం చేయాలి. ఈనాడు అందుబాటులో ఉన్న అనేక వైద్య విధానములలో రోగ మూలమునకు ఎవరు వెళ్ళరు. తాత్కాలికంగా మందులు వాడి రోగ నిర్మూలనము కొరకు కాక రోగ తీవ్రత తగ్గటం కొరకు మాత్రలు మందులు అందుతున్నాయని అందరూ తెలుసుకోవలసినటువంటి విషయం.

శరీర పుట్టుక: ఒక కారు తయారు చేయుటకు ఎన్నో భాగములు తయారుచేసి దాని నిర్మాణము పూర్తి చేస్తారు. అలాగే బిడ్డ తల్లి గర్భంలో 9 లేక 10 నెలల కాలము గర్భమునందు వివిధ శరీర భాగములు ప్రకృతి ధర్మమును అనుసరించి ఏర్పడుట జరుగుతుంది. మానవ శరీరంలోని అనేక భాగాలు ఇప్పటికీ తయారు చేయబడటం లేదు. కొన్ని తయారు చేయబద్దప్పటికీ, వాటికి స్పర్శ జ్ఞానం ఉండదు. మానవ శరీరం ఒక చిన్న బీజముతో వృద్ధి చెంది, చిన్న సైజు పరిమాణంలో బహిర్గతమై, భూమి మీద పుట్టి కాలక్రమేణా పెరిగి పెద్దదై ఈ సమాజమునకు కావలసిన మంచి చెడులు వారి ద్వారా జరుగుట సామాన్యునికి అంతుబట్టని అతిపెద్ద సృష్టి రహస్యం. 

శరీరమునకు రోగం వచ్చినప్పుడు ఆసుపత్రిలో చేర్చబడిన రోగికి ఆ ఆసుపత్రిలోని చిరునవ్వుతో కూడిన డ్యూటీ మైండ్ ఫుల్ కల నర్సింగ్ సేవలు స్వర్గములో ఉన్నట్లు తాత్కాలికంగా భ్రమ కలిగించినప్పటికీ, రోగం తగ్గిన తర్వాత వచ్చిన ఆసుపత్రి బిల్లు వలన జేబుకు పడిన చిల్లి ఆ భ్రమను తొలగిస్తుంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన బ్లడ్ గ్రూపు రక్తము చాలాచోట్ల ఉచితంగా సేకరించబడినప్పటికీ, డబ్బుకి దొరకక, పూర్తి వస్తుమార్పిడి విధానంలో అనగా ఇతర గ్రూపుల రక్తమునకు మార్పిడికి దొరకటం రోగి బంధు మిత్రులకు బంధువులకు విపత్కర పరిస్థితిని కలిగిస్తుంది. 

మందుల, వైద్యరంగము అభివృద్ధితోపాటు సహజ నిర్మాణం జరిగిన శరీరములో వచ్చే రోగములకు రోగమూలమునకు తగిన ప్రకృతి పద్ధతుల అన్వేషణ, నివారణ పద్ధతులపై ఆధునిక శాస్త్రవేత్తలు దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది. రోగములు పూర్వజన్మ పాప ఫలితములను బట్టి వస్తాయని అనేకమంది భావిస్తారు. అయితే పాపపుణ్యములు చేయుట మానవ జన్మలో సహజ పరిణామం. తెలిసీ తెలియక పాప పుణ్యములు చేయుట మానవజాతి లక్షణం. రోగములు గత జన్మ పాపపుణ్యం ఫలితములు అనే నమ్మకంలోనే కొనసాగక, ఈ జన్మలో వచ్చిన రోగం ఈ జన్మలో చేసినవాటి ఫలితంగానే భావించాలి. ఉదాహరణకు ఒక తాగుబోతు తను తాగినందువలన కాలేయము చెడిపోవడం,  ఒక ధూమపాన ప్రియునకు ఊపిరితిత్తులు లేక ఇతర అవయవములలో సమస్యలు, ప్లాస్టిక్ వస్తువులు లేదా క్యాన్సర్ కారకాలతో పనిచేసే వారు ఆ వృత్తిలోని వ్యర్థముల వలన రోగముల బారిన పడటం, అన్నీ స్వయంకృతమని గ్రహించవలసిన సమయం వచ్చింది. దీని వలన వారు రోగ నివారణకు తగిన కృషి చేస్తారు.

ఆహారము: శ్రేష్టమైన దంపుడు ధాన్యమును వదిలేసి తెల్లగా నిగనిగలాడే బియ్యం తినటం వలన విటమిన్ల లోపము, బలము లేని తిండి తినటం జరుగుతోంది. కంటికి నదురుగా కనపడే తెల్లని బియ్యం తినటం వలన దృష్టిలోపము, పంటి వ్యాధులు, అనేక ఇతర వ్యాధులు వస్తాయి. పూర్తిగా తెల్ల బియ్యంపై ఆధారపడినప్పుడు అనేక శరీర బలహీనతలు సర్వసామాన్యము. శరీర శ్రమ, వ్యాయామమునకు తగిన కృషి లేదు. శబ్ద కాలుష్యంతో చెవులకు హాని. ఆధునిక గాడ్జెట్లతో కళ్ళకు హాని. వాతావరణ కాలుష్యంతో ముక్కుకు హాని. పాతకాలపు పద్ధతులు అలవాటు లేని, ఆధునిక షాంపూలు వాడకం వలన తలకు, వెంట్రుకలకు కనపడని హాని. అనేక రసాయనాలతో తయారైన ధాన్యములు, పదార్థాలు వాడినందువలన నోటి ద్వారా పొట్టకు రోగహాని.

మనకు తెలియకుండా తీసుకున్న అనేక రసాయనాలతో శరీరంలోని అనేక భాగములకు రోగ ప్రాప్తి. ఫాస్ట్ ఫుడ్స్ వలన కనపడని జీర్ణకోశానికి హాని. ఇవి చదివిన పాఠకులకు వచ్చే  సందేహము ఈ ఆధునిక యుగంలో ఎన్నో సుఖములు అనుభవిస్తూ, ప్రతి రంగంలోని కల్తీల మధ్య శుభ్రమైన ఆహారపు అలవాట్లు సాధ్యమేనా అని. నిజంగా చెప్పాలంటే కచ్చితంగా సాధ్యం కాదు. మనసుపెట్టి ఆలోచించి తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించగలిగితే, కొంతమటుకు రోగాల బారిన పడకుండా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యము. ఎన్ని సుఖములు ఉన్నా ఆరోగ్యము లేని జీవితము మనకు సహాయపడదని గుర్తుంచుకోవాలి. ఆరోగ్య ప్రదాత ధన్వంతరి, అశ్వినీ దేవతలకు ఇష్టులైన దేవాలయంలో వారిని స్మరించి, ఆరోగ్యమును కోరుకొనాలి.                                                                                                 (సశేషం)

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...