Saturday, May 28, 2022

జీవితంలో డబ్బు సంపాదన పాత్ర ఎంత?

మానవుడు కుటుంబ జీవి. కుటుంబము లేనప్పటికీ, ఒంటరివారైనా బ్రతకటానికి కనీస అవసరాలైన నివాసము, బట్ట, ఆహారము, ఇతర అవసరముల నిమిత్తము ఎవరి మీదా ఆధారపడని జీవితం కొరకు సంపాదన అవసరం అవుతుంది. 

కుటుంబ జీవుల సంగతి ఆలోచిస్తే భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల అవసరముల నిమిత్తము సంపాదన ముఖ్యము. పిల్లల చదువులు, ఆరోగ్యము కాపాడుకునే నిమిత్తము ఖర్చులు, సాంఘిక అవసరములు, వినోద ఖర్చులు, ఇతర యాత్రలు కలుపుకుని డబ్బు అవసరం చాలా ఉంటుంది. చెల్లించవలసిన పన్నులు, సమాజ సంపద పెంచుట, ధర్మ కార్యక్రమాలకు ఇచ్చే అండ కూడా లెక్కించాలి. ఈ అవసరములను గమనిస్తే డబ్బు సంపాదన మానవునికి మనుగడతోపాటు, తోటి సమాజాభివృద్ధికి కూడా ముఖ్యం అని అర్థమవుతుంది.

ప్రపంచ ధర్మము ననుసరించి జీవితంలో డబ్బు సంపాదన విషయమై తృప్తి పడరాదు. తన ఆలోచనలతో పాటు వయసు, శరీర ఆరోగ్యము సహకరించినంతవరకు డబ్బు సంపాదనతో తృప్తి లేక రాజీ పడరాదు. అలా అని అక్రమ మార్గముల ద్వారా తక్కువ కాలంలో అధిక సంపాదన కొరకు చట్ట విరుద్ధమైన పనులు చేసి చిక్కులు తెచ్చుకొని శిక్షార్హులవరాదు. డబ్బు సంపాదనలో పూర్తి యాంత్రిక జీవనం గడుపక, అందుబాటులోని న్యాయమైన సుఖములు పొందుటలో వెనుకబడరాదు. యాంత్రిక జీవనంలో మధ్య మధ్య ధార్మిక ఆలోచనలు మనసును ఆనందంగా ఉంచుతాయి. శిక్షార్హమైన సంపాదన మార్గములు చట్టపరిధికి దొరికినప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చెప్పలేని పరిస్థితి.

ఒక పరిమితికి మించి సంపాదించిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి అధికార మార్గము అందుకొనుటకు ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఎక్కువవుతుంది. సంపాదించేటప్పుడు దాచిన నల్లధనము మనపై దృష్టి పెట్టినవారికి, ప్రత్యర్థులకు అసూయ కలిగించే విషయమని మర్చిపోరాదు. 

డబ్బు సంపాదన పెరుగుతూ ఉంటే మనశ్శాంతి లోపిస్తుందని ఇతర కుటుంబ సభ్యులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కొందరిలో జరుగుతుంది. మన సక్రమమైన డబ్బు సంపాదన మార్గంలో మంచి ఆలోచనలు, మన ఆదాయ వినియోగంలో కొంత మంచి లేదా నలుగురికి ఉపయోగపడేపనులు చేసినప్పుడు వ్యక్తిగత సంతోషము పెరిగి, రెట్టించిన ఉత్సాహంతో మనస్సు పని చేస్తుంది.

పాపభయము, పుణ్యము సంపాదన ఆలోచనలను పక్కనపెట్టి, ప్రతివారు తమ సంపాదనలో 1 నుండి 5 శాతం కేటాయించి దానిని వ్యక్తిగత దానంగా కాక ఒక సేవా సంస్థ ద్వారా (జిల్లాకు ఒక సంస్థ) కేటాయించాలి. తమకంటే తక్కువ సౌకర్యములు పొందు వ్యక్తులకు వ్యక్తిగత దానముగాకాక, జీవన పరిస్థితి పెంచుకునే విధంగా, సమాజం మొత్తం ఉపయోగపడే విధముగా చేయగలిగితే మంచి ప్రయోజనములు కలుగుతాయి.

ఉదాహరణకు రవాణా సౌకర్యములు టిక్కెట్టు 20 రూపాయలు అయితే 10 రూపాయలతో వెళ్ళటం. వ్యక్తిగత సహాయము వలన ఇచ్చిన ధనం దుర్వినియోగము అయి, వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలా అని వ్యక్తిగత సహాయమునకు పూర్తి వ్యతిరేకం కాకుండా మినహాయింపులు ఇవ్వవచ్చు. చాలా సందర్భములలో వ్యక్తిగత సహాయమునకు end use సక్రమంగా ఉండదు. మనము పొందే సౌకర్యములు తక్కువ ఖర్చుతో పొందకలిగినప్పుడు సహాయం పొందిన వారి ఆలోచనలు మంచి మార్గంలో ఉండి, దాని ప్రభావము నేరప్రవృత్తిపై చూపి, వాటిని తగ్గించటంలో సహాయపడుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే నాయకులు చెప్పే ఆదర్శ రాజ్యం తక్కువ ఖర్చుతో మనిషి బ్రతకగలిగినప్పుడు దానంతట అదే వస్తుంది. నెలకు లక్ష రూపాయలు సంపాదించేవారికి వచ్చే తృప్తి కంటే, తక్కువ ఖర్చుతో బ్రతకగల్గిన వారు పొందే తృప్తి చాలా ఎక్కువ.

సేవా భావములు పెరిగినప్పుడు మాత్రమే నిజమైన శాంతి, సంపాదనకు పరమార్థము అని నమ్మేవారి సంఖ్య పెరిగినప్పుడు అది అందరూ కోరుకునే ఆదర్శ సమాజం అనుకోవచ్చు. అప్పుడే అశాంతిపరుల సంఖ్య తగ్గి, శాంతితో ఉండే వారి సంఖ్య పెరిగి, అనేక మానసిక రుగ్మతలు తగ్గుతాయి. సంపాదన అంటే డబ్బు సంపాదన ఒకటే కాదు, ఖర్చును తగ్గించుట కూడా అని అనుకోవాలి. ఆహార పదార్థాలను వృధా చేయటం అరికట్టుట, వ్యర్ధములను తిరిగి ఉపయోగించే మార్గంలో ఆలోచించుట కూడా దేశ సంపదను పెంచే మార్గంగా ఎక్కువ మంది గ్రహించుట ముఖ్యము.

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.