ఈ భూమి మీద ఎన్నో మహిమలు ఉన్నాయి. మహిమలు మానవ జాతికి మేలు చేస్తాయి. మహిమలను తక్కువ చేయరాదు.
మనుషులలో మంచివారు, చెడ్డవారు ఉన్నట్టు మహిమలు ప్రదర్శించే మహాత్ములలో కూడా కొందరు స్వార్ధపరులు ఉంటారు. వారు తమ విద్యలను ధన సంపాదనకు, ఇతర ప్రయోజనములకు వాడుకుని అవతల వారికి ఆర్థిక, ఇతర నష్టములు కలగజేస్తారు.
ఎవరు ఏ మహిమ ప్రదర్శించినా మన సమస్యలు తీరటంలో వాటిని ఆహ్వానించొచ్చు. ప్రయోజనం పొందవచ్చు. ప్రతివారు తమ విచక్షణలు ఉపయోగించటం అవసరము. గుడ్డిగా అవతల వారిని నమ్మవద్దు. మోసపోవద్దు. మహాత్ముల జీవిత చరిత్ర చదివినప్పుడు వారి శిష్యులలో ఒకరో ఇద్దరో డబ్బుకి ఆశ పడ్డట్టు, స్వామి వారు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది.
మన దేశ సంపద, వారసత్వము మహాత్ములు, సిద్ధ పురుషులలో ఉంది. భారత జాతి గౌరవించదగిన ఎందరో మహాత్ములు ప్రతి యుగములో, ప్రతి కాలములో అనేక అవతారములలో జన్మించి జాతిని ఉద్ధరించారు. వారిని మనసారా స్మరించుకుందాము. వారికి మనసారా వందనం చేద్దాము. చాలామంది మహాత్ములు (కొద్దిమంది మినహా) అందరూ నడయాడే దేవుళ్ళని మర్చిపోరాదు.
చాలా మహిమలు సైన్స్ కి అందవు. మనకు కనపడని ప్రకృతి సూత్రములకు కట్టుబడి అవి పని చేస్తాయని మనం అనుకోవాలి. గుంటూరు జిల్లాలో మంగళగిరి దగ్గర పానకాల స్వామి గుడిలో తయారు చేయబడిన బెల్లపు పానకము చీమలు పట్టక పోవటం ఇందులో ఒకటి. అందుకు కారణం అక్కడ కొండలో గంధకం అని, అది కూడా ప్రకృతి శక్తుల దైవ లీల ప్రకటితంగా మరియు కేదార్నాథ్, బద్రీనాథ్ లో గల ఉష్ణ గుండం దైవ శక్తి ప్రకృతి శక్తుల ద్వారా ప్రకటితమైనట్టు భక్తులు నమ్ముతారు.
మహిమలు ప్రదర్శించేవారు ధన వ్యామోహంలో పడితే వారిని ఆశ్రయించిన భక్తుల జేబులు ఖాళీ అవుతాయి. నిజముగా మహిమలు ఉన్న మహాత్ముల స్వభావం వేరుగా ఉంటుంది. మహిమలు చేసే మహాత్ములు ఎక్కువ ప్రచారం కోరుకోరు.
మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి మానవులు తప్పొప్పులు చేసినట్లు మహిమలు ప్రదర్శించేవారు కూడా చేసే అవకాశం ఉంది. మానవ సహజమైన కోపతాపములకు, ఈర్ష్యాద్వేషములకు, ధన వ్యామోహమునకు, అధికార ప్రాపకమునకు అతీతులు కావాలని లేదు. మనకున్న సమస్యలు వారికి కూడా ఉండవచ్చు. ప్రజలలోకి వచ్చేవారు కీర్తి , ప్రతిష్టలు అధికార మన్ననలకు అతీతులు కారు. ఏ మహాత్ముల దగ్గరకు మనం వెళ్లినా విచక్షణ కోల్పోరాదు. అవసరమైనప్పుడు మైకం వదిలించుకోవాలి.
శుభం
No comments:
Post a Comment