Friday, May 19, 2023

రోగాలు లేని జీవితం ఉంటుందా - 2

మధుమేహ రోగులకు జాగ్రత్తలు: ఈరోజులలో మధుమేహల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అంటువ్యాధికాని ఈ రోగము మానవజాతికి అతిపెద్ద హానికరంగా పరిణమించింది. దీనివలన మానవజాతి నిర్వీర్యం అయిపోతోంది. దీనికి ప్రస్తుతానికి నివారణ లేదు, నియంత్రణ మాత్రమే ఉంది.

మార్కెట్లో దొరికే అనేక రకములైన మందులు కొన్ని వారములలో మన జేబుకు చిల్లి పెడతాయి. ఈ రోగమును ఏ మందు ఎంత మటుకు తగ్గిస్తుందో రోగికి తెలియని పరిస్థితి. ఖరీదైన వైద్మమే కానీ, దీనికి పూర్తిగా నయం చేసే మందు లేదు. దీనికోసం ఎక్కువమంది అల్లోపతి వైద్యము మీదా, ఇన్సులిన్ మీద ఆధారపడవలసిందే. క్లోమగ్రంధి తిన్న ఆహారమునకు తగిన జీర్ణక్రియలో దోహదపడే పరిస్థితులకు తగినట్లు ఇన్సులిన్ ను విడుదల చేయనందున ఈ రోగం వస్తుందని చెప్తారు. 

ఇన్సులిన్ బయటనుండి తీసుకున్నంతకాలము క్లోమగ్రంధి పనిచేయదు. ఇది ఎలాగంటే మన ఇంటిని ఎవరన్నా కాపాదుతుంటే వారి భరోసాతో, మనము దానిని పట్టించుకోకుండా ఉండటం లాంటిది. బయటనుండి తీసుకునే ఇన్సులిన్ దానిని తగినంత ఉత్పత్తి చేస్తుందనే ఆలోచనలో క్లోమ గ్రంధి బద్దకిస్తుంది లేక పూర్తిగా పని మానేస్తుంది అనే వాదన కూడా ఉంది.

రాకెట్లు అన్ని గ్రహములకు వదిలి విశ్వమును జయించే ప్రయత్నం చేస్తున్న శాస్త్రవేత్తలు,  జాతి నిర్వీర్యానికి కారణమవుతున్న మధుమేహ రోగాన్ని నయం చేయటానికి ప్రయత్నించాలి. ఆ వ్యాధి పీడితులకు సహాయంగా ఉండే విధంగా క్లోమ గ్రంధిని పనిచేయించటాన్ని సవాలుగా స్వీకరించి విజయం సాధించటానికి నడుము కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మందులతో రోగము నయం చేయటమే కాక, మధుమేహ కారక గ్రంధిని పనిచేయించుటను సవాలుగా స్వీకరించాలి

ప్రకృతి ప్రసాదించిన అవయవములు పనిచేయనప్పుడు, ప్రకృతి ధర్మములతో కాపాడుట, ఎక్కడ లోపం జరిగిందనే పూర్తి విశ్లేషణ అవసరం. పూర్తిగా నిర్వచించబడలేని ప్రకృతి ధర్మం ప్రకారం ఈ సృష్టి నిర్వహణ జరుగుతుంది. దానిలో భాగమే మానవ అభివృద్ధి. మన శాస్త్ర ప్రమాణముల ప్రకారం శిశువు వృద్ధిలో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క గ్రహధర్మం ద్వారా జరుగుతుంది

ఏ దశలోనూ రోగి నోరు కట్టుకోలేకపోవడం మధుమేహవ్యాధి ప్రత్యేకత. నోరు కట్టుకోలేకపోతే దీనిని నియంత్రించలేము. పాల పదార్థములు మరియు కాఫీ, టీలు కూడా దీని నిషేధిత జాబితాలోకి వస్తాయి. అయితే సమృద్ధిగా పాడిపంటలు గల రాష్ట్రంలో ఉండటం వలన పాలు, పాల పదార్థములు, కాఫీ, టీల నిషేధం ఎంతవరకు వర్తిస్తుందదో తెలియదు. ఈ రోజుల్లో నిస్పృహతో ఉన్న మనసు తీపి పదార్థములపై, ఐస్ క్రీములపైకి మళ్ళుతుంది. ఇక ఎంతవరకు తీపి పదార్థములు తినకుండా అదుపు చేయగలరు? 

ఉద్యోగ ధర్మంలో భాగంగా వేరే చోట్లకు వెళ్ళినప్పటికీ, నిషేధిత ఆహారము, పద్ధతులు మానాలి. ఎక్కడకు వెళ్ళినా, నియమబద్ద జీవితం గడపండి. రోగము ఏదైనా ఆరోగ్యము పట్ల శ్రద్ధ వహించి, నియమిత ఆహార వేళలు పాటిస్తూ, మందులు వేసుకోవాలి. రోగము, విధి నిర్వహణ, కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి. రోగమును పెద్దగా ఊహించుకోవద్దు. రోగములకు వైద్య ఖర్చులు పెట్టి, నలుగురికి జీవనోపాధి కలిగిస్తాను అనే భావన కలిగితే, కచ్చితంగా తప్పనిసరిగా కఠిన నియమాలు పాటించటం జరుగుతుంది.

బయట తిండి తినటం తగ్గించాలి. ఇంటిలోని ఆరోగ్య వంటలు తినాలి. ఉప్పు,  నిల్వ పచ్చళ్ళు తగ్గించాలి. లేక మానేసినా మంచిదే. చిరుతిళ్ళు వద్దు. విందులకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు మానవద్దు. తిండి ప్రలోభములకు లోను కావొద్దు. ఈ సూత్రములను మర్చిపోవద్దు. మన ఆరోగ్యమును మనమే కాపాడుకోవాలి. వేరెవ్వరూ కాపాడరు. మధుమేహ వ్యాధిగ్రస్తులు బతకటానికి తినాలి, తినటానికే బ్రతకకూడదని మర్చిపోకపోతే విజయం మీదే. మూడు నిమిషాల ప్రాణాయామం, 12 నిమిషాలు ముఖ్య ధ్యానం, మొత్తం 15 నిమిషాలు మానసిక బలం కోసం వ్యాయామం ప్రారంభించండి. జీవితకాల పర్యవేక్షణ అవసరమైన ఈ రోగమును వైద్యుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. మీ అనుభవంలో స్వీయ నియమములు లేక ఇతరములు ఉంటే, వాటిని కూడా పాటించండి. అతి జాగ్రత్తలతో షుగర్ లెవెల్స్  పడిపోతే, ఏమి చేయాలో మీ ఇంటిలోని వారికి తెలియజేయండి.

ఈ సందర్భంలో ఆరోగ్య జాగ్రత్తలో భాగంగా 60 ఏళ్ళ క్రితం పేపర్లో పడిన యదార్థ సంఘటన గురించి ఒక విషయం చూద్దాం. ఒక పట్టణంలో ఊరి బయట ఉన్న పరిశ్రమపై దాడి జరిగినప్పుడు ఒక దురాశపరుడు బియ్యంలో సన్నటిపలుగురాళ్ళని  కలుపు యంత్రము వాడుతున్నాడనే వార్త పాఠకులకు విస్మయమును కలిగించింది. ఆ రాళ్ళు కలిపితే ఆ వ్యక్తికి ఎంత లాభం వస్తుందో తెలియదు, కానీ ఆ బియ్యంలో కలిపిన రాళ్ళు తిన్న తరువాత శరీరంలో కలిగే హాని ఎంతో ఎప్పుడైనా ఎవరైనా ఊహించారా? ఒకవేళ అతని పిల్లలే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అలాంటి ఆహార పదార్ధములు తింటే ఏమవుతుందని అతడు ఆలోచించి ఉంటే, ఇలా చేసేవాడా?  ఇలాంటి విషయాలు ప్రజాస్వామ్య దేశంలో కాక నియంతృత్వ దేశంలో జరిగితే ఆ వ్యక్తికి పడే శిక్ష ఏమిటి? ఇలాంటి ఎన్నో  సమాధానం లేని ప్రశ్నలు. 

కనుక జీవిత విధానమే మీదైన శరీరమునకు తగిన శ్రమ,  కల్తీ లేని ఆహారము, నీరు, గాలి సంతృప్త జీవనం అవసరం. కల్తీలు చేసి బతకటం ఇతరుల జీవనానికి భంగం కలిగించటమే. మన బ్రతుకు ప్రకృతి ధర్మమును గౌరవించేలా ఉండాలి. ఆరోగ్యంగా ఉండండి. ఇతరుల ఆరోగ్యానికి హాని కలిగించకండి.

No comments:

Post a Comment

స్వర్గీయ ఎంవిఎస్ ప్రసాద్ గారికి అశ్రునివాళి

మా అన్నయ్య గారైన (పెద్దమ్మ కొడుకు) శ్రీ ఎంవిఎస్ ప్రసాద్ గారు గురువారంనాడు హైదరాబాదులో పరమపదించారు. ఆయన ఉద్యోగంలో వివిధ పదవులు నిర్వర్తించి అ...