సహనముతో కూడిన చిరునవ్వు మనలో ఆకర్షణను పెంచుతుంది. సహనము ఒక బంగారు ఆభరణం వంటిది. దాని ధర మార్కెట్లో పెరిగినా మనం భయపడనక్కర్లేని బంగారు ఆభరణం. దానిని ఢరించితే ఆనందం పొందవచ్చు.
సహనము అనే ఆభరణమును ధరించినవారికి కోపం తగ్గుతుంది. ఎప్పుడూ అలసటను, విసుగును దగ్గరకు రానీయవద్దు. అలసిపోయినప్పుడు ఐదు నిమిషములు విశ్రాంతి తీసుకోండి. దీనికోసం కళ్ళు మూసుకుని మంచి ఆలోచనలు చేయండి, లేదా మీ జీవితంలో జరిగిన సంతోషకరమైన సంఘటనలు జ్ఞాపకం తెచ్చుకోండి. ఎక్కువసేపు విశ్రాంతి తీసుకుంటే బద్దకం వస్తుంది.
సహనమునకు కోపమును సహజ శత్రువుగా భావించవచ్చు. కోపము లేనివాడు లేడు కానీ దానిని అదుపులో ఉంచుకొనుటను అలవాటు చేసుకోవాలి. మధుమేహవ్యాధి మరికొన్ని ఇతర వ్యాధులు ఉన్నవారు ఆ రోగం తగ్గదని, దానిని అదుపులో ఉంచుకోవడం ముఖ్యము అని ఎలా తెలుసుకుంటారో, అదేవిధంగా కోపమును బయటకు రాకుండా ప్రయత్నించాలి.
కోపకారణము బయటకు రాకుండా ఉన్న పరిస్థితులలో మౌనము మేలు చేస్తుంది. ఐదు నిమిషముల పాటు ఉచ్ఛ్వాస, నిశ్వాసములు కూడా మేలు చేస్తాయి. ప్రయత్నించి లాభం పొందండి.
కొంతమంది దైవానుభూతి, మంత్రసిద్ధి పొందినవారు కూడా కోపమును అదుపులో ఉంచుకోలేక పోయారనే విషయము కొన్ని పురాణాల ద్వారా తెలుస్తుంది. పురాణ కథల ప్రకారం భృగు మహర్షి శ్రీమహావిష్ణువు తనను గుర్తించలేదనే కోపముతో ఆయనను కాలితో తన్నడము, అతికోపదారిగా పేరుపడ్డ దుర్వాసముని కోపంతో చేసిన పనులు గమనిస్తే ఆయన అంబరీషుని మీద కోపంతో అతడి మీదకు ఒక రాక్షసిని పంపగా, అతడు శ్రీమహావిష్ణువును వేడుకొనటం, ఆయన సుదర్శన చక్రమును పంపి అతడిని రక్షించటం మనకు తెలిసిందే. ఆ తర్వాత సుదర్శన చక్రమునుండి రక్షించుకోవటానికి దుర్వాసముని అంబరీషుని శరణు కోరవలసి వచ్చింది. దుర్వాసముని అంబరీషునికి ఇచ్చిన శాపం ఆ తర్వాత కాలక్రమంలో తదుపరి సంఘటనలకు దారి తీయడం అనగా అనేక అవతారములు క్రమంలో జన్మించడం తర్వాతి పరిణామం.
No comments:
Post a Comment