Monday, February 5, 2024

జీవితములో జాగ్రత్తలు

జీవితం చాలా విలువైనది. అడుగడుగునా తగు జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఎక్స్పైరీ డేట్ తెలియని జీవితం మనది. అయినా సమయస్ఫూర్తి, విచక్షణ చాలా ముఖ్యం. 

అవి అడుగడుగునా మనల్ని కాపాడతాయి. ప్రతి వాడే వస్తువుకు ఎక్స్పైరీ డేటు ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయరాదు.

నిద్ర లేవగానే భగవంతుని నమ్మేవారు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆయనను తలుచుకోవాలి. ఆరోజు ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. భగవంతుని నమ్మనివారు మన చుట్టూ ఉన్న అదృశ్య శక్తిని మనకు అన్ని విధాలుగా సాయంగా ఉండాలని కోరుకోవచ్చు. తరువాత తమ నిత్య కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ కార్యక్రమంలో వాడే వస్తువుల ఎక్స్పైరీ డేట్ను జాగ్రత్తగా గమనించుకోవాలి. 

ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు ప్రాణాయామము, ఇతర వ్యాయామములు చేసుకున్న తరువాత కాలకృత్యములు, స్నానము చేసుకొని, అల్పాహారం పూర్తిచేసుకుని తగిన వస్త్రములు ధరించి బయటకు జీవనోపాధి నిమిత్తము వాహనము పైన కానీ లేక ఇతర వాహనముల ద్వారా గాని బయలుదేరాలి. రోడ్డుమీదకు బయలుదేరే వారు తమ వాహనములకు అవసరమైన అన్ని పత్రములు ఉండేలా చూసుకోవాలి అలాగే వాహనమును కండిషన్‌లో ఉంచుకోవాలి.

రోడ్డుమీద వాహనములు వాడినప్పుడు లేక దాటినప్పుడు రోడ్డు మీద గల ఇతర అడ్డంకులు గమనిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలి. రోడ్డు దాటుతున్నప్పుడు ఇతర ఆలోచనలు లేకుండా జాగ్రత్తగా పోవాలి. జీవనోపాధి స్థానములకు చేరిన తరువాత నోటి జాగ్రత్త పాటించాలి. అనవసరమైన వాదనలు చేయక అవతల వారికి మనపై అసూయ కలగని ప్రవర్తనతో గడపాలి. మనకి పని ఉన్న వారితో జాగ్రత్తగా ప్రవర్తించాలి. మన పని నిమిత్తము అవతలి వారి నుండి ఆర్థిక ప్రయోజనమును ఆశిస్తుంటే సమస్యను జాగ్రత్తగా పూర్తి చేసుకోవాలి.

రోడ్డు పక్కన కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కొందరు సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి కాలక్షేపం చేస్తారు. ఏ విధమైన సహాయ చర్యలు చేయరు. ఉదాహరణగా కొన్ని ఏళ్ళ క్రితం టీవీ మరియు వార్తల్లో వచ్చిన ఒక విషయం గుర్తు చేసుకుందాం. ఒక ఊరిలో రోడ్డు పక్కన ఒక వ్యక్తి గడ్డమును గుర్రం ఒకటి పట్టుకున్న సంఘటన. ఆ సంఘటన జరిగినప్పుడు కొందరు ఫోన్‌లో ఫోటోలు తీసి కాలక్షేపం చేశారు. ఎవరూ అతన్ని రక్షించలేదు. 

అలాగే రోడ్డు పక్కన ప్రయాణంలో ప్రమాదం జరిగినప్పుడు పోగైన గుంపులో ఎక్కువమంది ప్రమాదమునకు గురైన వారికి సహాయం చేయరు. కాలం వృధా చేసి గడుపుతారు. ఆందోళనలు జరిగినప్పుడు కొంతమంది అమాయకులు గుంపులో చేరి గుంపు మనస్తత్వంతో హింసలో పాల్గొన్నప్పుడు నేరం చేసినవారు తప్పుకొని అమాయకులు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి సందర్భములలో విచక్షణ, జాగ్రత్త, ఆలోచన అవసరము.

వెనుకటి రోజుల్లో రైలు పట్టాలపై నడిచి, కిందకు దూరి అవతల పక్కకు వెళ్ళుట, ప్లాట్‌ఫామ్‌లు దాటుటకు బదులు పట్టాలపై నడుచుట వలన కొన్ని ప్రమాదములు జరిగేవి. ఈ విధముగా చేయకపోవటమే సరియైన జాగ్రత్తగా చెప్పవచ్చు. కదిలే బస్సులో, రైళ్లలో ఎక్కి దిగటం చేయకపోవడమే సరైన జాగ్రత్త. ప్రమాదములు జరిగినప్పుడు వింతగా చూడకుండా సహాయ చర్యల్లో పాల్గొనుట మానవత్వ జాగ్రత్తగా చెప్పవచ్చు. అన్నిటికన్నా గొప్ప జాగ్రత్త నోటి జాగ్రత్త. అనవసరముగా మాట్లాడరాదు. కొన్ని సమయములలో ఆవిధంగా మాట్లాడుట చిక్కుల్లో పడవేస్తుంది. 

పిల్లల పెంపకం, విద్యను మరొక జాగ్రతగా చెప్పుకోవాలి. పిల్లల ఆకాంక్షను గౌరవిస్తూ మంచి స్కూల్లో విద్యను చెప్పించుట, వారి స్నేహితులను గమనించుట, యుక్త వయసులో చెడు అలవాట్లు, మాదకద్రవ్యాలు వాడకుండా గమనించడం ఒక జాగ్రత్త. అన్నిటికంటే ముఖ్యము ఆరోగ్య, ఆహార జాగ్రత్తలు. అవసరం లేని యెడల ఖర్చులు చేస్తే పొదుపు అదుపులో ఉండక మనశ్శాంతి లోపిస్తుంది. ఆరోగ్య విషయంలో మంచి వైద్యుణ్ని కలవడం, రోగములు వచ్చినప్పుడు తినకూడని ఆహారమును మానడం, నిత్యజీవితంలో పాడైపోయిన, పనికిరాని, వాసన వచ్చే పచ్చళ్ళు, కూరలు ఇతర రకములు వాడకపోవటం వంటివి చాలా ముఖ్యం.

నలుగురిలో ఉన్నప్పుడు అవతలి వారిని మాటలతో కించపరచడం, తీసి పారేయడం, హేళన చేయటము చేయరాదు. మాటలను పొదుపుగా వాడాలి. మంచి లేక తీయటి మాటలు మనకు గౌరవమును, మిత్రులను సంపాదించి పెడితే, పరుషమైన మాటలు లేక విమర్శలు శత్రువులను పెంచుతాయి. మాటల చేత మహిలో మన్ననలు పొందవచ్చు అని ఒక శతక కారుడు చెప్పిన మాట నిజము. కాలచక్రంలో ఎవరు పైనుంటారో, ఎవరు కింద ఉంటారో తెలియని పరిస్థితులలో నోటి మాట, జాగ్రత్త అవసరము. నోరు జారితే వెనుకకు తీసుకోవటము కుదరదు. ఇది చాలా ముఖ్య జాగ్రత్త.

సంగీతము కూడా మాటలతో కూడినది అనుకుంటే ఒక యదార్థగాథను జ్ఞాపకం చేసుకుందాం. ఆంధ్ర దేశంలో పేరు పొందిన సంగీత విద్వాంసుడు ఒకడు తన మిత్రులతో కలకత్తా వెళ్లాడు. కలకత్తాలో మిత్రులతో దారితప్పాడు. ఒక్క క్షణం గాబరాపడ్డాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. కొత్త చోటు, కొత్త భాష. వెంటనే తన సంగీత ప్రావీణ్యంతో సంకీర్తనలు మొదలుపెట్టాడు. అతని సంగీతమునకు మెచ్చుకున్న చుట్టూ చేరిన జనం డబ్బులు కానుకగా వేశారు. కథ సుఖాంతం అయింది.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.