Monday, February 5, 2024

మధుమేహ వ్యాధి పీడితులూ బహుపరాక్

ప్రతిరోజూ పెరిగిపోయే మధుమేహ వ్యాధి పీడితుల సంఖ్య తప్పక ఆందోళన కలిగించే విషయమే. ప్రభుత్వ, వ్యాపార, వృత్తి పనివార్లతో పాటు మనము కూడా వేల మందికి జీవనోపాధి కలిగిస్తున్న పరోక్ష సేవ ఆనందదాయకమే అయినా అది ఆరోగ్య సమాజమునకు మంచిది కాదు. 

అల్లోపతి మందులతో పాటు కుప్పలు తిప్పలుగా వచ్చి పడే ఆయుర్వేద మందులు, ఇతరపొడులు ఈ రోగ నియంత్రణకు లభించినప్పటికీ, దీని నియంత్రణకు ఇతర కారణములు అన్వేషించ వలసిన సమయము. సైలెంట్ కిల్లర్ అనబడే ఈ నిశ్శబ్ద హంతక వ్యాధి శరీర అవయవములకు కలిగించే దుష్ట పరిణామములు ఊహించలేము.

దీనికి ప్రమముగా నోటి నియంత్రణ, అనగా తినే ఆహార పదార్ధములపై అదుపు ముఖ్యముగా కావాలి. ఆరోగ్యం కాపాడుకోవడంలో ప్రథమ బాధ్యత - ఎవరి ఆరోగ్యం వారే కాపాడుకోవాలి. మన చుట్టూ ఉన్న బంధుమిత్రులు సలహాలు ఇచ్చి సహాయము చేయగలరేమో గాని జిహ్వ చాపల్యమును అదుపులో ఉంచుకొనుట మన చేతిలో పనే. 

బ్లడ్ షుగర్ పెంచుటలో స్వీట్లు, స్నాక్స్ పాత్ర చాలా ఉంటుంది. మన పక్కన ఉన్నవారు కరకరలాడే వేపుళ్ళు, బంగాళదుంప, ఇతర దుంప కూరలు తింటున్నప్పుడు నోరు కట్టుకోవడం చాలావరకు సాధ్యం కాదు. ఈ మధ్యకాలంలో పాలు, పాల పదార్థముల నిషేధము ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ఐస్ క్రీము, బాదంపాలు, జున్ను, కూల్ డ్రింకుల ఆకర్షణ, వేసవిలో మామిడిపళ్ళ ఆకర్షణ వ్యాధిగ్రస్తుల జిహ్వను పరీక్షిస్తాయి.

అంతవరకు స్వీట్లు తినని వారు కూడా వ్యాధి వచ్చిన తరువాత వాటి పట్ల ఆకర్షింపబడతారు. వివాహ విందు భోజనాలలో నిషిద్ధ వంటకములు నోరు ఊరిస్తాయి. ఒకరోజు నోరు కట్టుకుంటే అవుతుందా? జీవితాంతం ఈ రోగంతో బాధపడాలి అనుకున్నప్పుడు, క్రమశిక్షణ పాటించకపోతే వ్యాధికి సంబంధించిన లక్షణములు, బ్లడ్ షుగర్‌లో మార్పులు శరీర అవయవములకు కలిగించే దుష్ట పరిణామముల ద్వారా కలిగే అవయవ నష్టము ఊహించలేనిది. కొన్ని బాగు చేయలేనివైనా, మరికొన్ని చేయగలిగినవైనా వాటి కోసం అయ్యే వైద్య ఖర్చులు తట్టుకోలేని విధముగా ఉంటాయి. 

ప్రస్తుత వైద్య విధానములో మధుమేహ వ్యాధికి నియంత్రణ మాత్రమే ఉన్నది, పూర్తిగా తగ్గుటకు మందులు లేవు. వైద్య పరిశోధనలు జరిగి మంచి మందులు వచ్చేవరకు జిహ్వ చాపల్యమునకు హద్దులు ఏర్పరచుకోలేక పోతే జీవన పరిస్థితులలో అనేక చెడు పరిణామములు వచ్చే అవకాశం ఉంది. స్వీట్స్ మీద వ్యామోహం చంపుకోలేకపోతే ఆవగింజంత తీసుకోవడం మంచి పద్ధతే. తిరుపతి లడ్డూలు చూసి ఆశపడ్డా, దేవుడి తీర్థం అయినా మోతాదు మించి తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవచ్చు.

వ్యాధిగ్రస్తులు వారి జీవితంలో బ్లడ్ షుగర్ మార్పుల వలన శరీర అవయవముల నష్టము తగ్గించుటకు మందులతో పాటు తిండి మీద నియంత్రణను కూడా పాటిస్తే వారి జీవితకాలంలో సంతోషంగా ఉండే అవకాశం ఉంది. వయసులో ఉన్నవారు అనేక కారణముల వలన జిహ్వచాపల్యమును అదుపులో పెట్టుకోలేకపోయినా, కనీసము 60 ఏళ్లు దాటిన వారు జిహ్వచాపల్యమును అదుపులో పెట్టుకుంటే ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్య జాగ్రత్తగా వారిని కాపాడుతుంది.

బ్లడ్ షుగర్‌లో మార్పులు చూసి వైద్యుని సలహాతో ఇన్సులిన్ కోటా పెంచుకొని, వ్యాధి అదుపులో ఉంది అని తృప్తి పడే కంటే తినకూడని ఆహార పదార్థములను తగ్గించుకొని రోగ నియంత్రణ చేసుకునే విధమును నిజమైన వ్యాధి నియంత్రణగా భావించాలి.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.