బంగారము భూగర్భంలో దొరికే నిధి నిక్షేపాలలో ఒకటి. బంగారం విలువ ఎప్పటికీ తగ్గదు. బంగారము, వెండి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో వేల మందికి జీవనోపాధి కల్పిస్తాయి.
బంగారం, వెండి వస్తువుల అమ్మకము కోట్లలో జరిగినప్పటికీ, దానిమీద పన్నుల ద్వారా అనేక కారణాలచేత ఆశించిన ఆదాయం రాదు. దేవునికి కూడా బంగారు, వెండి వస్తువులపై మోజు ఉందని భావిస్తే, కొన్ని వర్గముల ఆచారం ప్రకారం బంగారు వస్తువుల కొనుగోలు నిషేధం పాటిస్తారు.
కాంతా కనకములపై మోజు తగ్గించుకోవాలని జ్ఞానులు ప్రబోధిస్తే, కాంతలకు కనకంపై మోజు సమాజ సంపదను పెంచుతుంది. డబ్బుతో పాటు బంగారము, వెండి కొనుగోలు కూడా పొదుపులో భాగమే.
పూర్వం సంచార జాతుల వారు తమ ఆచారములలో భాగంగా వెండి వస్తువులను సంచుల్లో తీసుకెళ్లడం మనకు తెలిసిన విషయమే.
ద్రవ్యోల్బణం వలన బంగారం రేటు బాగా పెరిగిపోయింది. దాని వలన పూర్వం బంగారం కొని పెట్టుకున్న వారికి దాని విలువ బాగా పెరిగింది.
ఈ సందర్భంలో నా చిన్నప్పటి కథ ఒకటి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఒక ఊరిలో భార్యాభర్తలు ఉండేవారు. ఇల్లాలు వంట పాత్రలను కూడా సరిగా మోయలేకపోయేది, కానీ భర్తను మాత్రం బంగారు నగలను చేయించమని కోరేది. భార్య బాధ భరించలేని భర్త ఒకనాడు బాగా ఆలోచించి ఒక గుండ్రాయికి బంగారు పూత పూయించి, దానిని ధరించటానికి అనువుగా చేయించి, భార్యకి ఇచ్చాడు. ఆ ఇల్లాలు దానిని కొద్దిపాటి బరువైనప్పటికీ ఆపసోపాలు పడుతూ ధరించేది. అలా ఆనందంగా నడిచేది.
ఇంటి ఇల్లాలు ముందు చూపుతో బంగారం, వెండి వస్తువులను కొనటం మంచిదే. వీటిని ఏ విధమైన అవసరం వచ్చినా తేలికగా తాకట్టుపెట్టే సౌకర్యం ఉంది. దానితో సులువుగా డబ్బు తెచ్చుకోవచ్చు. కానీ దొంగల భయం. ఒంటరి ప్రయాణంలో భద్రత తక్కువ. అంతే కాకుండా బంగారం కొనేటప్పుడు నాణ్యతను పరిశీలించాలి. ఇంకా, దుకాణదారులు వేసే తరుగు, అదనపు ఛార్జీలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే మోసపోతారు.
ఎక్కువమంది కోరిక ఇల్లు అమర్చుకోవటం. సొంత ఇల్లు ఏర్పడే లోపల కొంత బంగారం ఏర్పరచుకోవచ్చు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకుని కొంటే, బంగారము కొనుగోలు మంచిదే.
No comments:
Post a Comment