Tuesday, June 27, 2023

ఉద్యోగం విరమణ తర్వాత ఎలా గడపాలి?

ఉద్యోగ, వృత్తి, వ్యాపారములలో 60 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి చాలామంది అలసిపోయి విసిగిపోతారు. ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ వృత్తి, ఉద్యోగ విరమణ తర్వాత, సరి అయిన ఆదాయం కొరకు ప్రణాళికలు వేసుకోవాలి.

మనసు విశ్రాంతి కోరుకున్నా శరీరం అలసిపోయి సహకరించదు. జీవితములో కుటుంబ బాధ్యతలు, ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. మీ జీవనోపాధి ఏదైనా, విరమణ తరువాత మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. విరమణ తర్వాత వచ్చే పొదుపు సొమ్మును అసలుకి డోకా లేని ఆదాయము ఇచ్చే పథకములో పెట్టుబడి పెట్టాలి. మోసపూరిత ఆదాయ ప్రకటనల ఆకర్షణలకు లోను కావద్దు. 

మీకు సొంత ఇల్లు లేకపోతే సొంత ఇంటి కోసము కొంత సొమ్ము కేటాయించాలి. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఉద్యోగములు పిల్లల బాధ్యతలు ఉద్యోగ విరమణనాటికి అయిపోతే అదృష్టవంతుల కింద లెక్క. మీ  బంధుమిత్రులు, పరిచయస్తులలో మీ విరమణ సొమ్ము కోసం ఎవరైనా అడిగితే విచక్షణతో వ్యవహరించాలి. మీ కష్టార్జితం సొమ్ము జారితే రాదు. డబ్బు వసూలుకి ప్రత్యేక కళ ఉండాలి. అది లేకపోతే మీ సొమ్ము గోవిందా. 

మీ వృత్తి ఏదైనా రిటైర్ అయిన తరువాత ఒక వృత్తి విద్య లేక మెకానిజం నేర్చుకుంటే మీకు క్రమబద్ధమైన ఆదాయం వస్తుంది. కొందరికి అయితే కొన్ని విద్యలు నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది. అది నెరవేరని వారు రిటైర్ అయిన తరువాత ఆ విద్యలు నేర్చుకోవచ్చు.  

మనం ఉద్యోగంలో ఉన్నంతకాలము తోటి సమాజం గురించి పట్టించుకోము. ప్రతివారూ విరమణ తరువాత వారమునకు ఒక నాలుగు గంటల చొప్పున మానవ సేవకు కేటాయించవచ్చు. కొందరు తమకు ఇష్టమైన కళలు, క్రీడల్లో పాల్గొంటారు. మన జీవితంలో తీరని కోరికలు కొందరు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో ఉన్నప్పటి కంటే విరమణ తరువాత కుటుంబ సభ్యులతో ఎక్కువకాలం గడపాలి. 

ఎవరు ఎన్ని చెప్పినా డబ్బు పాత్ర కొట్టి పారేయలేము. అది ఇచ్చే భరోసా చాలా ముఖ్యము. వయసు పెరిగినా మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కొందరు ఆధ్యాత్మికముపై ఆసక్తి చూపుతారు. కానీ ఏ మాధవసేవైనా మానవ సేవతోనే పూర్తి సార్ధకం అని గమనించాలి.

స్థూలముగా:

1. క్రమబద్ధమైన ఆదాయం ఏర్పర్చుకోవాలి.

2. ఆరోగ్య జాగ్రత్తలు, మెడికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.

3. తోటి వారికి ఉపయోగపడేటందుకు సమయం కేటాయించుట.

4. ప్రశాంత జీవనము.

5. ఆహారపు అలవాటులలో మితం పాటించాలి.

6. మనసు ఆరోగ్యంగా ఉంచుకోవాలి.

7. మాధవసేవ మానవసేవ కలిసి ఉండాలి.

8. మీలోని జ్ఞానము, అనుభవము దాచుకోవద్దు. నలుగురికి పంచాలి.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.