మానవ జీవితంలో ప్రకృతితో మమేకమైన ఈ వృక్షములు రెందూ మనని ప్రభావితము చేసేవే. ఒకటి వేప చెట్టు, రెండవది చింత చెట్టు.
వేప చెట్టు :
దేవతా వృక్షముగా
పరిగణించబడే వేప చెట్టు ఆక్సిజన్ వదులుతుంది. కనక చెట్టు కిందా, చుట్టుపక్కల ఉన్నవారికి కావలసినంత
ఆక్సిజన్ దొరుకుతుంది. వేప పుల్లలు పళ్ళు తోముకోవడానికి ఉపయోగపడితే, వేప గింజలతో తీసిన వేప నూనె
చర్మవ్యాధులకు నివారణగా ఉపయోగపడుతుంది. ఈ నూనెను సబ్బుల్లో ఉపయోగిస్తారు.
వేపచిగుళ్ళు, వేపాకు
తినేవారికి కడుపులో నులిపురుగులు ఉండవు. వేపపూత ఉగాది పచ్చడిలో కలిపి
తిన్నవారికి కడుపులోని క్రిములు నశిస్తాయి. వేపాకుని దేవతా పూజలలో ఉపయోగిస్తారు.
వేప చెట్టును మహాలక్ష్మి అవతారంగా భావిస్తారు. వేపచెక్కను సాన మీద అరగదీసి ఒంటికి రాసుకుంటే, చల్లగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది చెమటపొక్కుల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
చింత చెట్టు :
చింతపండు చెట్లు విషపూరితమైన ఆవిరిని వెదజల్లుతాయని, వాటి ఆకులు ఆమ్లాన్ని కలిగి ఉండి, రాత్రి సమయంలో ముడుచుకుని ఉంటాయని, అవి అనారోగ్యహేతువని నమ్ముతారు. ఆ చెట్టు కింద ఉంటే ఆ గాలి పీల్చి అనవసరమైన రోగాలు వస్తాయని అంటారు. అందుకే మన పెద్దవాళ్ళు చింత చెట్టుపై దెయ్యాలు ఉంటాయని, దాని దగ్గరకు వెళ్ళవద్దని చెప్పేవారు. అలా అయినా దాని దగ్గరికి వెళ్లడం మానుతారని అలా చెప్పేవారు.
చింత గింజల పొడిలో శరీరంలోని అన్ని నొప్పులను తగ్గించే గుణం ఉన్నది. చింత చిగురు, కందిపప్పుతో చేసిన వంటకం శాకాహారంలో ఒక వంట. పులుసులో చింతపండు వాడినందువలన విరోచన కారిగా పనిచేస్తుంది. చింతకాయలతో చేసిన ఊరగాయ పచ్చడి ఏడాది పొడవునా నిలవ ఉండి జబ్బు పడి లేచిన వారికి పథ్యముగా ఉపయోగపడుతుంది.
ఈ రెండు వృక్షముల మానులు కలపగా ఉపయోగపడతాయి మరియు దాని ఎండిన ఆకులు ప్రకృతి ఎరువుగాను ఉపయోగపడతాయి. ఈ రెండు వృక్షములు మానవ జీవితంతో పెన వేసుకుని ఎన్నో విధాల నిత్యజీవితంలో ఉపయోగపడతాయి.
No comments:
Post a Comment