Friday, June 16, 2023

మనిషికి జీవితంలో కావాల్సిందేమిటి

జన్మించిన తర్వాత విద్యాభ్యాసం పూర్తి చేసుకుని, తనకు దొరికిన ఉద్యోగం, వ్యాపారం, వృత్తులలో ఏదో ఒక దానిని నిర్ణయించుకుని, ధన సంపాదన మొదలుపెట్టాలి. తర్వాత వివాహం చేసుకుని కుటుంబ బాధ్యత నిర్వర్తించాలి. 

స్వార్ధము తగుపాళ్ళలో ఉంటే, తనవారికి ధన సహాయము, అక్కచెల్లెళ్ల అభివృద్ధికి సహాయం చేయాలి. తన కుటుంబ సభ్యుల ఆరోగ్యము కొరకు కూడా ఆలోచించాలి. పిల్లలు పుట్టిన తర్వాత ప్రథమ బాధ్యత సంతానమే. వారి విద్యకు తగిన ఏర్పాట్లు చేయాలి. 

ఆధ్యాత్మిక, చారిత్రాత్మక, విహారయాత్రలు చేస్తూ, చేయిస్తూ పిల్లలకు బాల్యస్మృతులు ఏర్పరచాలి. మధ్యమధ్య బాల్య మిత్రులను కూడా సందర్శించాలి. వారి ఇళ్లలో జరిగే అన్ని కార్యక్రమములకు కుదిరితే సకుటుంబంగా హాజరవ్వాలి. తన కర్తవ్యంగా భావించి, తల్లిదండ్రులు బాగోగులు చూడాలి.

మనం చేసే ప్రతి పని ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఎంతో కొంత మందికి మంచిగా జీవనోపాధి కలిగిస్తుందని జీవన సత్యం. అందుబాటులో కల విజ్ఞాన, వినోద సాధనముల ద్వారా శారీరక, మానసిక ఆనందం పొందడం కూడా జీవితంలో ఒక భాగమే.

తర్వాత అన్ని విషయములకు తగిన సమయం కేటాయించాలి. అప్పుడప్పుడు పిల్లలకు విజ్ఞాన ప్రదర్శనలు, వినోదములు ఇలాంటి విషయాలను నేర్పించాలి. మనము తీసుకునే ఆహారం, అలవాట్లు, సాంగత్యము మన ఆలోచనపై ప్రభావం చూపుతాయి.

జీవితంలో సుఖములు అనుభవిస్తూ దాన్లో కొంత సంతృప్తి లభించిన తర్వాత లేక కష్టాలు అనుభవిస్తూ మన ఆలోచనలో వైరాగ్య భావం ప్రవేశిస్తే కొంత ఆధ్యాత్మికత వైపు ఆలోచించడం కూడా ఒక పరిణామమే. అన్నింటితో పాటు ఆధ్యాత్మికతకు చోటు ఇవ్వటం కొంతమంది జీవితంలో జరుగుతుంది.

అన్నీ క్రోడీకరించినప్పుడు ధన సంపాదనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యము అతి ముఖ్యం. బాధ్యతల నిర్వహణలో తోటి వారికి సహాయపడటం, మంచి మనసుతో సేవా భావం కూడా మన మనసుకు సంతోషము సంతృప్తి కలగజేసే విషయాలు.

మనము బ్రతుకుతూ నలుగురు బ్రతకటానికి మన వంతు సహాయం చేయగలిగిన వారిని, ఈ లోకంలో ధన్యులుగా చెప్పవచ్చు. కుటుంబ బాధ్యత, సమాజ బాధ్యత రెంటినీ మనము అతి ముఖ్యంగా భావించాలి.

మీ విజయములకు మీ చుట్టూ ఉన్నవారు అంతగా సంతోషించకపోవచ్చు. వారిలో కొందరు ఈర్ష్యాపరులు ఉండవచ్చు. అలాంటి వారిని మీరు గుర్తిస్తే మీరు వారితో దూరం పాటించండి. వారితో మీ భావములు తక్కువగా పంచుకోండి. 

ఒకవేళ మీ ఆలోచనలు నలుగురికి సహాయం చేసే విధంగా ఉంటే, మీ ఆరోగ్యం, ఖర్చు చేయుటకు అధికారము, మానవ వనరులు ఉంటే తోటి వారికి మేలు చేయడానికి కృషి చేయండి. అది మీవంతు సమాజమునకు చేయగల అత్యుత్తమ మానవ సేవగా చెప్పవచ్చు. ఈనాటి పరిస్థితుల్లో మానవ వనరులు ఎంత అవసరమో, ఎంత కష్టమో మీకు తెలుసు. సహాయం చేసే మనస్తత్వం దాచుకోవద్దు. దానిని సద్వినియోగం చేయండి. అయితే దీనిలో విచక్షణ కూడా చాలా ముఖ్యం.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.