Sunday, April 30, 2023

మాటే మంత్రము

మనం నిద్రలేచినప్పటి నుండి మన జీవితము మాటలతోనే ప్రారంభమవుతుంది. మాటకున్న శక్తి అనంతము. ఎవరినన్నా మంచి చేసుకోవాలన్నా, చెడు చేసుకోవాలన్నా మాటలకు మించిన ఆయుధం లేదు. 

మాటలకు పూర్తి వ్యతిరేకము మౌనము. మాటకన్నా మౌనమునకు ఎక్కువ శక్తి ఉన్నది. మౌనదారులు కళ్ళతోనే శాసిస్తారు. ఆగ్రహానుగ్రహాల కలగలుపు మాట. 

మాటకున్న శక్తి మంచి కన్నా చెడు చేసిన సంఘటనలనుగూర్చి ముందుగా తెలుసుకుందాము. విమర్శలతో కూడిన మాటలు చెడు చేయుటలో బాగా పని చేస్తాయి.

 1. ఒక జ్యోతిష్యుడు విదేశములలోని ఎలక్షన్ లో ఒక వ్యక్తి ఓడిపోతాడు అని చెప్పిన భవిష్య విషయము అతడు గెలిచినప్పుడు చట్టపరమైన చర్యలకు మాట జారిన వ్యక్తిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.

 2. కొన్ని ఏళ్ల క్రితం ఒక ప్రజా ప్రతినిధిగా నిలబడిన వ్యక్తిని అతని వ్యతిరేకవర్గము ఒక మాట అన్నాడని చేసిన ప్రచారము అతని విజయవకాశములు తగ్గించిన విషయము చెప్పుకుందాము. నిలబడ్డ వ్యక్తి అతని అభిమాన వర్గములోని ఇతర కులముల వారిని గూర్చి ఒక మాట అన్నట్లుగా ప్రచారం చేయడం జరిగింది. నేను గెలవడం ఖాయం. ఎక్స్ వర్గం వారిని రూపాయికి ఇద్దరిని కొంటాను అన్నట్టుగా చేసిన ప్రచారము ఎక్స్ వర్గం వారికి కోపం తెప్పించటం వలన అతనికి పడే ఓట్లు తగ్గినాయి.

 3. ఒక మధ్య తరగతి అమ్మాయి ఉద్యోగములో చేరి అవతలి వ్యక్తి చాటింగ్ లోని మాటలకు మోసపోయి అప్పు చేసి డబ్బు సర్ది కొన్ని ఏళ్ల పాటు ఆర్థిక ఇబ్బందులు పడిన విషయము.

 4. కంప్యూటర్ చాటింగ్ లో ప్రొఫైల్ లోని మాటల గారడీకి మోసపోయి అప్పు చేసి ఆర్థిక ఇబ్బందులు, ఇతర ఇబ్బందులు పడిన వయసులోని వారు వెలుగు చూడని లెక్కకు మించిన సంఘటనలు ఎన్నో.

 5. వయస్సులో ఉండి మంద్ర స్వరముతో కూడిన మాటల వలన ఇబ్బందులు పడినవారు కొందరు.

6. మార్కెటింగ్ లో మాటే పెట్టుబడి. ఈ ఆయుధముతో మార్కెట్లో విజయం సాధించిన వారు కొందరైతే మోసగించడానికి ప్రయత్నించేవారు కొందరు ఉంటారు. 

 7. అధికారంలో ఉన్న నాయకులు మాట జారి వ్యతిరేక వర్గము బలం పెరిగి పదవి కోల్పోయినవారు కొందరు ఉంటే, మంచి మాటలతో జనమును ఆకర్షించి పదవిని స్థిరము చేసుకునేవారు కొందరు. 

 8. అన్నిరంగములలో విస్తరించి ఉన్న దళారీ వ్యవస్థ లేక మధ్యవర్తుల వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు తమ పనులను చెక్కపెట్టుకొనుటకు ఇతర ప్రయోజనములు పొందుతుంటే మరికొందరు అవతలి వారిని మాటలతో మోసగిస్తారు. మోసపోవటానికి, లాభపడడానికి మాటే ఆధారము. మాటలు బాగా చెప్పగలిగితే నాయకుడు అవుతారు. మాటలు వినేవాడు మంచి అనుచరుడు అవుతాడు. 

9. మాటలలో మంచిని గ్రహించి బాగు పడినవారు కొందరైతే, మాటలతో మోసపోయి నష్టపోయినవారు కొందరు ఉంటారు. 

10. పై అధికారులని మాటలతో మంచి చేసుకుని కొందరు అభివృద్ధి చెందితే, మాటలతో పైవారిని శత్రువులు చేసుకున్న వారు కొందరు. ప్రతి పనికి మాటల నేర్పు అవసరమవుతుంది. 

11. ఇక దేవుళ్ళ విషయానికి వస్తే మాటలతో స్తోత్రము, బీజాక్షరముతో కూడిన మాటలతో మంత్రము జోడించి సిద్ధి పొంది ప్రయోజనము సాధించుకుంటారు. అయితే మాటలతో కూడిన మంత్ర జపం చేసినప్పుడు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు తర్పణము, హోమము, అన్నదానము చేసి తీరాలని దానికి కొంత డబ్బు ఖర్చు అవుతుందని పండితులు చెబుతారు. 

12. మాటలతో శత్రువుల్ని కూడా మిత్రులుగా మార్చుకునే వాళ్ళు కొందరైతే తమ విమర్శలతో కూడిన మాటలతో శత్రువుల్ని చేసుకునే వారు కొందరు ఉంటారు. 

13. మాటలేనిది మనుగడలేదు. జీవితంలో ప్రతిక్షణం మాట మన వెనువెంటే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మాటలేనిది మనిషి లేడు. మాటే మనము, మనమే మాట. 

14. రకరకముల వృత్తి, ఉద్యోగ, వ్యాపారముల వారు తమ దగ్గరికి వచ్చిన వారిని మాటల నేర్పుతో పడికట్టు మాటలతో ఆకర్షించి తమ జీవనోపాధి నడుపుకుంటారు. 

మంచి మాటలతో మనము మనల్ని సృష్టించిన భగవంతుని అనుగ్రహము సంపాదించుకోగలిగినప్పుడు భగవంతుని సృష్టిగా భావించే మనుషులను శత్రుభావంతో  కాక మిత్రభావంతో గెలవలేమా? మంచి మాటలతో ముందుకు పోండి. మిత్రులను పెంచుకోండి. ఈనాటి సమాజంలో పీడించే అనేక రుగ్మతలకు మంచి మాటలు, స్నేహ హస్తము పరిష్కారము. ఈ "మహిలో మాటల చేత మన్నన పొందవచ్చున్" అన్న వాక్యమును నిజం చేయండి. 

సమాజ హిత సూచన:

మంచి మనసు గల పెద్దవారి ఆశీర్వచనముల మాటలతో మనకు మంచి జరిగినప్పుడు మనము కూడా పనికివచ్చే మాటలను ఆశ్రయిద్దాము. అలసత్వం, బద్ధకము వదిలి విధి నిర్వహణలో ఎక్కువ ఫలితము కనబరుద్దాం. దేశ సంపద పెంచడంలో భాగస్వామ్యులు అవుదాం. విజయోస్తు!

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.