Thursday, April 20, 2023

భయము

భయము అనగా ఏదో చెడు జరగబోతుందని ఆలోచనతో కూడిన ఆందోళనగా అనుకుంటే, ఆ భయములో ప్రాణముపోతుంది అనే ఆలోచన ఉంటే ప్రాణభయము కలుగుతుంది. 

ఆ భయము మనని ఒక చోట కూర్చోనివ్వదు. నుంచోనివ్వదు. ఏ పనీ చేయలేము. భయములో అనేక రకాలున్నాయి. ప్రాణభయము, ఆర్థిక మూలముల దెబ్బ, అధికార భ్రష్టత భయము - ఇలా ఎన్నో. 

ఇలాంటి ఘటనల గురించి తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక కుటుంబము ఉండేది. ప్రస్తుతం ఉన్న ఊర్లో వారు కొన్ని ఏళ్ళుగా నివాసం ఉంటున్నారు. 

ఒక సాయంత్రం చీకటి వేళ ఆ కుటుంబ యజమాని నడుచుకుంటూ ఇంటికి వస్తున్నాడు. చీకట్లో కాలికి ఏదో మెత్తగా తగిలింది. ఇంటి యజమాని భయపడ్డాడు. ఏమన్నా విష జంతువు ఏమో అని అనుమానం కలిగింది. క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలోచించాడు. వారికి ఏమన్నా స్థిరాస్తులు ఉన్నాయేమో తెలీదు. 

తనకున్న మిగిలిన ఆస్తి విషయములు సర్దుకుని, పాముని తొక్కానని, దాని విషపు కాటుకు భయపడి నది ఒడ్డునున్న  ఊరు నుండి, నాటు పడవలో నది దాటి అవతల ఒడ్డున ఊరికి చేరాడు. 

అక్కడ నివాసం ఏర్పరుచుకుని జీవనోపాధి వెతుక్కున్నాడు. ఇది ప్రాణభయంతో చేసినా వారికి తోచిన పరిష్కారము. పాత ఊరిలో తన తరతరాల జ్ఞాపకాలు మర్చిపోవటమే. ఔరా! ప్రాణభయము ఎంత పని చేసింది.

ఇంకొక సంఘటనలో అది జిల్లాలోని వెనుకబడిన ఊరు. మెయిన్ రోడ్ కి దూరంగా ఉంటుంది. బస్సు దిగిన తర్వాత ఊర్లోకి రావాలంటే రెండు కిలోమీటర్లు నడిచి రావాలి. ఒక మిట్ట మధ్యాహ్నం వేళ సైకిల్ మీద ఇద్దరు వ్యక్తులు ఊరి బయట నుండి ఊరి లోపలకి వెళ్తున్నారు. 

కొంత దూరంలో ఎండ నీడ ఒకచోట నుండి మెరిసింది. ఏమిటా అని చూస్తే పెద్ద పాము రోడ్డు దాటుతూ ఉన్నది. సైకిల్ కి బ్రేక్ వేసి ఆపటము, పాము రోడ్డు దాటిన తర్వాత ఊర్లోకి బయలుదేరడం జరిగింది. ఇది పగలు జరిగింది. రాత్రిపూట అయినా రోడ్లమీద లైట్లు లేవు కనుక ఏ ప్రమాదము జరిగినా కష్టమే. సరైన వైద్య సౌకర్యం ఉండదు. 

ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నవారికి, తప్పిపోయిన ప్రమాదమును ఊహించుకుంటే, భయంతో నాలుక పిడచగట్టుకుపోతుంది. అక్కడే ఉన్నవారికి, చూసినవారికి గుండె జల్లుమంటుంది.

ఇంకొక సంఘటనలో ఇంకో పల్లెటూరులో జరిగిన విషయం. అర్ధరాత్రి దాటిన తర్వాత ఊరి బయట నుండి రెండు కిలోమీటర్ల లోపలకి ఒక పోలీసు అధికారి మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు.  ఊరు చేరే లోపల ఒక పాముల పుట్ట ఉంది. దాని నుండి ఒక పాము బయటకు వచ్చింది. రోడ్డు మీద జనము లేరు. ఒంటరిగా వెళ్తున్నాడు.

తన రివాల్వర్ తో పామును కాల్చాడు. పాము చనిపోయిందో, లేదో తెలీదు. ఊర్లోకి వచ్చేదాకా ఆదుర్దా. ఆ తర్వాత సంగతి తెలియదు. భయంతో ఉన్నప్పుడు మనసు ఒక చోట నిలవదు.

ఇంకొక సంఘటనలో ఇంకొక ఊరిలో అర్ధరాత్రి ఇంటికి మోటార్ సైకిల్ మీద వెళుతున్న ఒక అధికారి కుక్కలు వెంట పడగా భయముతో అదుపు తప్పి కిందపడి గాయములై మరణించడం జరిగింది.

స్మశానములో భయము

నాకు 13, 14 ఏళ్ళ వయసులో ఒంటరిగా స్మశానమునకు వెళ్ళవలసిన పని పడింది. వెళ్లిన తరువాత వర్షం మొదలైంది. చీకట్లు కమ్ముకున్నాయి. స్మశానములో ఒంటరిగా ఉండటం జరిగింది. ఎలా బయటపడతానోనని ఎంతో ఆదుర్దా చెందాను. రెండోరోజు భయంతో జ్వరం కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత నుండి శవాలను చూసి భయపడటం మానేశాను.

పనిలో పనిగా పరీక్షిత్తు మహారాజు జీవితంలో జరిగిన సంఘటన గురించి జ్ఞాపకం చేసుకుందాం. మహారాజు వంశంలోనివారు అడవికి పోయి, వేటలో అలసి ఒక ముని ఆశ్రమునకు పోయి, అక్కడ తపస్సు చేస్తున్న ముని తనను ఆదరించలేదనే కోపంతో పక్కన చచ్చిపడి ఉన్న పాముని ముని మెడలో వేసి రాజ్యానికి వెళ్ళిపోయాడు. 

ముని కుమారుడు వచ్చి తండ్రికి జరిగిన అవమానానికి కారణమైన రాజుని పాము కాటుతో మరణించుతాడని శపించాడు. ఇందులోని సూక్ష్మము ఏమిటంటే అవమానము సర్ప జాతితో జరుగుట, అదే జాతితో రాజు మరణించుట, దీనిని ప్రకృతి ధర్మముగా భావించాలి. రాజు ప్రాణ భయంతో సముద్రం మధ్యలో నివాసం ఉండి భగవన్నామ స్మరణలో ఉండి పాము కాటుకు మరణించటం జరిగింది.

చరిత్రలో అధికార పార్టీ వారు అధికారం కోల్పోగానే, కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు అవతల వారి ఆర్థిక మూలములపై బెదిరించి, పార్టీలు మార్పించడము భయము యెక్క ఒక పరిణామముగా కొన్నిచోట్ల జరుగుతుంది. 

కరోనా నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు భయం. ఆస్తిపరుల కంటే పూర్తిగా ఉద్యోగం మీద ఆధారపడిన వారు పడే భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి. 

ఒకసారి, మా మేనమామ ఉద్యోగం కోల్పోయి ఏడేళ్ళు ఇబ్బంది పడినప్పుడు బెంగాల్ కు చెందిన ఒక మహాత్ముడు కుసుమ హరినాథ్ బాబా దయతో బంధువుల ఆదరణ, బాధ్యతల నిర్వహణ నెట్టుకొచ్చిన వైనం నా జీవితంలో మరపురాని విషయముగా మిగిలింది. 

ఇలాంటి పరిస్థితులలో కొందరు మహాత్ములు లేక దైవ స్వరూపుల అభయము, 'భయమేలా నేను మీకు అండగా ఉన్నాను' అన్నమాట మనకు కొండంత ధైర్యం ఇస్తుంది.

            భయమా జిందాబాద్!

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...