Thursday, April 20, 2023

ఇంటింటి పద్ధతులు

ఇంటింటికి పద్ధతులు వేరుగా ఉంటాయి. అలా మా మేనమామ గారింటిలోని, వారి చుట్టుపక్కల కొన్ని ఇళ్ళ వారి పద్ధతులను గురించి మీతో పంచుకుంటున్నాను.

కొన్ని ఏళ్ళ క్రితం నాటి మాట. మా మేనమామ పని చేస్తున్న ప్రైవేటు ఫ్యాక్టరీలో, ఉద్యోగరీత్యా డబ్బుతో కూడిన పని. డబ్బు స్వయంగా తీసుకెళ్లాల్సిన విధులు. దానికి తోడు ఊరికి దూరంగా ఉన్న ఇంట్లో ఉండడం. దొంగల భయం ఎక్కువగా ఉండేది. అందుకని ఒక తుపాకీకి లైసెన్స్ తీసుకున్నారు. 

ఆ తుపాకీని ఎక్కడ పెట్టాలని ఆలోచించి, దానికోసం ఒక మందపాటి ఇనుప పెట్టె కొన్నారు. దానిలో డబ్బులు, విలువైన వస్తువులు పెట్టుకోవచ్చు. తుపాకీతో సహా ముఖ్యమైనవన్నీ దానిలోనే పెట్టేవారు. ఇక్కడే ఒక గమ్మత్తు చేసేవారు. 

ఇనుప పెట్టెలో ఒక డూప్లికేట్ తాళం పెట్టేవారు. ఒకటి బయట ఉండేది. మొదటి తాళం కనబడనప్పుడు దొంగ వస్తే తుపాకీ కోసం ఇనుప పెట్టె ఎలా తీస్తారు? డూప్లికేట్ తాళము పెట్టెలో ఉంది. ఈ ప్రశ్న నా మనసును ఎప్పుడూ తొలిచేది. 

అలానే కొందరు పొరుగూరు వెళ్ళేటప్పుడు ఇంటి బీరువా తాళములు అటక పైన వేసేవారు. కొన్ని సందర్భములలో దొంగలు తమ తెలివితేటలు ఉపయోగించి అటక పైన తాళములు తీసుకుని పని పూర్తి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఆతిథ్యము

ప్రతి కార్తీక మాసంలో తెలిసిన వారందరినీ పిలిచి వనసమారాధన చేసుకునేవారు. ఎండాకాలంలో మామిడిపళ్ళ సీజన్లో మామిడిపళ్ళ రసాన్ని పచ్చిపాలతో కలిపి చుట్టుపక్కల వారికి ఇచ్చేవారు. 

ఇంటిలోని పెద్ద ఆవిడ పాడి గేదెని నడిపేది. ఇంటిలో పాల వాడకం అయిన తర్వాత కొద్దిపాటి పాలు అవసరం ఉన్నవారికి ఇచ్చేది. అంటే ఎవరైనా అవసరపడి అడిగితే వారికి ఇచ్చేది. ప్రతి రోజూ కనీసం అయిదారుగురు వచ్చి తీసుకుని వెళ్ళేవారు. 

పెరడులో అనేక కూరగాయలు, పళ్ళ మొక్కలు పెంచేవారు. వాటిని కూడా చుట్టుపక్కల వారికి ఉచితంగా ఇచ్చేవారు.

ఇలాంటి మంచి పనులు చేసినప్పటికీ, జీవిత క్రమంలో వారు మధుమేహం బారిన పడ్డారు. ఎంత మంచి మనసు ఉన్నా , ఎవరూ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలకు అతీతులు కారని నాకు అర్థం అయింది.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...