Thursday, March 2, 2023

అప్పు చాలా సుఖమా

జీవితంలో మానవ జన్మ ఎత్తడం ఋణాల బంధం అని, ఏ ఋణము లేనిది బంధుమిత్రులు ఏర్పడరని చాలామంది నమ్ముతారు. 

సాక్షాత్తూ కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామి తన వివాహ నిమిత్తం కుబేరుని వద్ద అప్పు తీసుకున్నట్టు పురాణములు చెప్తున్నాయి. ఇక మానవులమైన మనమెంత అని అనుకోవచ్చు. సగటు జీవిత సౌకర్యముల కొరకు, ఎక్కువ మొత్తంతో స్థిర చరాస్తులు ఏర్పరచుకొనుటకు పెద్ద మొత్తంలో అప్పులు చేయాలి. 

తమ దగ్గర పెద్ద మొత్తం ఉన్నప్పటికీ అది ఖర్చు పెట్టడం కుదరదు అని భావించేవారు కొందరు, ఆర్థిక వనరులు లేక అప్పులు చేసేవారు కొందరు. జీవితంలో కొన్ని  అప్పులతో ప్రభుత్వ రాయితీలు పొందవచ్చు. లక్షల్లో ఖర్చు అయ్యే ఇల్లు, పొలాలు అప్పులతో కొనవల్సిందే. 

తోటివారి అధిక సౌకర్యములతో పోల్చుకుని సగటు జీవి వాటి కోసం, ఇతర గృహ అవసరములకు అప్పులు చేయవలసిందే. మన చుట్టూ ఉన్న ఆకర్షణలచే అన్ని సౌకర్యాలు పొందటానికి కొన్ని లక్షలు ఖర్చు అయితే అప్పు చేయక తప్పదు. ఊదరగొట్టే బ్యాంకులు వారి మాటల చాతుర్యముతో అప్పుల ఊబిలోకి లాగుతాయి. కొన్ని కార్డుల ఆఫర్లు అయితే ప్రత్యేకం. వాటి మాయలో పడి ఉక్కిరిబిక్కిరి అవ్వద్దు. 

ఇక కొన్ని సూపర్ మార్కెట్లలో వాటి ప్రత్యేక అమరిక చూడగానే అవసరం లేకపోయినా కొనాలనిపిస్తుంది. వాటి కొరకు క్రెడిట్ కార్డులు పెట్టి వాయిదాలలో కొని వడ్డీ ఉన్నా, లేకపోయినా ఇరుక్కుపోయి ఇబ్బందులు పడవద్దు. అప్పులు తీసుకోగానే సరికాదు, కొన్ని ఆర్థిక సంస్థలు వారి మొండి బాకీల వసూలు కోసం కండ బలము, అండ బలము కలవారిని రికవరీ ఏజెంట్లుగా నియమించుకొని బాకీదారులని ఇబ్బంది పెడతారు. వారి పద్ధతులకి కొన్ని ఆత్మహత్యలు కూడా జరిగాయి. తస్మాత్ జాగ్రత్త. 

మీరు అప్పుకిపోయే ముందు మీ వాయిదా శక్తిని మాత్రమే అంచనా వేసుకుని ముందుకు పోండి. వైద్య అవసరాలకి, రోగ నివారణకు అప్పు చేయడం తప్పనిసరి. అప్పు ఎక్కువ చేసిన తర్వాత జీవితంలో మీకు మనశ్శాంతి ఉండదు. చెప్పలేని ఇబ్బందులు ఏర్పడుతాయి.

కొన్ని ఆర్థిక సంస్థలు తమ తిరిగిరాని అప్పులను లేక ఒత్తిడితో వసూలయ్యే అప్పులుగా విభజిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లాలో తిరిగిరాని అప్పులను జనం ముద్దుగా x ఊరి అప్పులుగా వ్యవహరిస్తారు.

సలహా: అప్పు లేని జీవితం లేదు‌. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సౌకర్యార్థము అప్పులు చేస్తాయి. వారికి ఆబాకీలు తీర్చడానికి పన్నులు పెంచే వనరులు ఉంటాయి. మరి మనకు ఏముంటాయి? ఎదగాలంటే అప్పు చేసి ఆర్థిక వనరులు పెంచుకునే కొందరు ఉంటారు. ఉదాహరణకి  తక్కువ వడ్డీకి డబ్బు తెచ్చి, ఎక్కువ వడ్డీకి ఇచ్చుకునే వాళ్ళు. అలా కాకుండా మీరు తీసుకున్న అప్పు తిరిగి ఉపయోగం లేని ఖర్చుల కైతే ఇబ్బందులు పడతారు.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.