Monday, February 20, 2023

చిన్న గీత - పెద్ద గీత

మానవులు తమకు కష్టం వచ్చినప్పుడు నాకే ఈ కష్టం ఎందుకు రావాలి అని అనుకుంటారు. సాక్షాత్తూ దైవ స్వరూపులైనవారికి కూడా మానవ జన్మలో కష్టములు ఉన్నాయి, ఉంటాయి. కష్టమొచ్చినప్పుడు బాధపడితే, సుఖము వచ్చినప్పుడు మైమరపు వస్తాయి.

ప్రపంచంలో కష్టాలలో అనేక రకములుగా ఉంటాయి. పిల్లల ఆటపాటలతో బాల్యంలో వారి ముద్దు ముచ్చట్లలో సంతోషము, ఆనందము కలిగితే వారికి అనారోగ్యం కలిగినప్పుడు బాధ కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇతర రకములు ఉంటాయి. ప్రతివారూ తనకు వచ్చిన కష్టము పెద్దది అనుకుంటారు.

ఆరోగ్య సమస్యలకు సంబంధించి వచ్చే విచిత్ర రోగాలు శరీరమును ఇబ్బంది పెడతాయి. వైద్యులకు కొన్ని రోగములు అర్థం కావు. కొన్ని వైద్యులకు అంతుచిక్కని రోగాలు ఉండవచ్చు. అలాంటి రోగము వచ్చినప్పుడు రోగికి అందులో మానసిక ఉపశమనం అవసరము.

మానసిక ఉపశమమునకు ఈ క్రింది విధంగా చేయవచ్చు. వైద్యనిపుణులు కౌన్సిలింగ్ తో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలోని రోగులకు పళ్ళు, ఇతర వస్తువులు పంచేలా ఈ రోగులను ప్రోత్సహిస్తే, వారికి కొంత ఓదార్పు లభిస్తుంది. 

అక్కడి రోగులతో వీరు సంభాషించినప్పుడు ఇద్దరి రోగ తీవ్రతలోని తేడాలు తెలుసుకోవచ్చు. అప్పుడు అలా వెళ్ళినవారికి తనకంటే తీవ్ర రోగ పీడితులు ఉన్నారని కొంత అర్థం అవుతుంది. అప్పుడు ఆ రోగములు తనకే కాదు, అందరికీ వస్తాయి అని అర్థం అవుతుంది. రోగం వచ్చిన వారు తనది చిన్న గీత, దాని పక్కన చూస్తే పెద్ద గీత కూడా ఉన్నాయి అని అనుకుంటారు. దీనివలన రోగ భయం తగ్గి, రోగ పరిస్థితులకు అలవాటు పడతారు.

సుఖము వచ్చినప్పుడు చిన్న గీత, పెద్ద గీతను గూర్చి ఎవరూ ఆలోచించరు, దాని అవసరం ఉండదు. నాకే ఈ సుఖము ఎందుకు వచ్చింది అని ఎవరూ అనుకోరు. సుఖ దుఃఖములు గత జన్మల కర్మ ఫలము అని ఎక్కువ మంది నమ్ముతారు. ప్రత్యేక దీర్ఘరోగ పీడితులు, బాధితులలో మంచి, చెడుల ఆలోచన, అంతర్మధనము మొదలవుతుంది. ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఇంత భయంకర రోగం వచ్చిందని కొందరు అనుకోవచ్చు.

పాపము చేసినా, పుణ్యం చేసినా మనిషి చేయక ఎవరు చేస్తారు? పాపపుణ్యాలు ఎవరు చేసినా భగవంతుని సంకల్పమే అని కొందరు అనుకుంటారు. ఆ పని చేసేటప్పుడు అది పాపము అని తెలియకపోవచ్చు. తెలిసినా, స్వార్థ ప్రయోజనముల కొరకు ఆ పని జరగవచ్చు. అందుకనే పెద్దలు చెప్పారు మంచి ఆలోచనలు చేయాలి, మంచి పనులకు పునాది పడుతుంది అని. 

రోగాల బారిన పడినవారు గత జన్మల పాపములు కారణమని ఆలోచించకుండా వారికున్న ఆర్థిక వనరులతో పాటు, వారి బంధుమిత్రులు సన్నిహితుల సహకారంతో మంచి పనులు అనగా నలుగురికి ఉపయోగపడే కార్యక్రమములు మొదలు పెట్టవచ్చు. అంటే సామాజిక సేవా కార్యక్రమాలలాంటివి. అలా చేయలేని వారు సేవా కార్యక్రమాలు నిర్వర్తించే సంస్థలకు తమ శక్తి కొలదీ ఆర్థిక, సహాయక సేవలను  తమ పరపతి ద్వారా చేయవచ్చు.

మనము చేసే పని ఎంత చిన్నదైనా భవిష్యత్తులో విస్తరించి నలుగురికి సహాయపడుతుంది. అది ఎలాగంటే ఒక విత్తనము నాటిన తర్వాత, అది వృక్షమై విస్తరించి, అందరికీ ఉపయోగపడుతుంది. ఆలోచనా పరిధి పెంచుకొని, ఏకరూప ఆలోచనలు కలిగిన వారి కలయిక ద్వారా కలిసి ముందుకుపోండి. సమాజమునకు మీరు సహాయం చేయండి.

ప్రతి వ్యవహారం డబ్బుతో ఎంత ముడిపడి ఉన్నప్పటికీ, ఏ కార్యక్రమమునకు అయినా ఆర్థిక వనరులతో పాటు మానవ సహాయ సహకారాలు, ఇతర విషయాలు అవసరమని మరువరాదు. పూర్తి దైవ భారంతో కాక, మనలను మనము నమ్ముకొని, సంతృప్తితో గడిపే జీవన విధానం అలవాటు చేసుకుని, ప్రతి పనిలో విజయం సాధించే దిశగా ముందుకు అడుగు వేయండి. విజయము కూడా మన వెంటే ఉంటుంది. 

దీని గురించి ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఒక రాష్ట్రంలో అనాథలకు పునర్నివాసము కొరకు చేసిన ఆశ్రమ నిర్వహణ ఒక టీవీ మాధ్యమం ద్వారా అందరికీ తెలిసి, దాని ఉనికికి ఒక గుర్తింపు,  ఆదరణ లభిస్తున్నదని మనకు తెలిసినదే.

ఆశించినది దొరకనప్పుడు, అసంతృప్తి పెరిగి తప్పులు చేయవచ్చు. పూర్వజన్మ కర్మ ఫలము వలన సుఖదుఃఖములు లభిస్తాయని అనుకున్నప్పటికీ, దానిని గూర్చి పెద్దగా ఆలోచించకుండా, మనకున్న పరిమిత జీవిత కాలంలో మన ఆర్థిక స్థోమతను బట్టి, అప్పు చేయక మన వంతు మంచి పనులు చేయడానికి అవకాశం ఉన్నది. దానిని సద్వినియోగం చేసుకొనండి. 

గతమును గూర్చి ఆలోచించవద్దు. మంచి పనులలో ముందు ఉండండి. మన తోటి వారికి మనము చేసే సేవలు అన్నీ ఉచితముగా ఉండాలని అన్నివేళలా భావించరాదు. మనము మన మనసుకున్న ఆలోచనా శక్తితో నలుగురికి ఉపయోగపడే ఏ పని అయినా చేయవచ్చు.

మనము బతకటానికి ఇతరులను దోచాలని అనుకోకుండా, మనకు అందుబాటులో ఉన్న అనేక సేవలను స్వల్ప లాభాపేక్షతో అందించవచ్చు. తద్వారా మనము బతికి, మరికొందరికి జీవనోపాధి కలిగించవచ్చు. లేదా కొత్త సేవలు కనుగొనవచ్చు. ఇది జరిగినప్పుడు సమాజ హితం కోరే వారి సంఖ్య పెరిగి, మనము ఉన్న సమాజంలో మేలు జరుగుతుంది.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.