ఈరోజు మనం వారసత్వం అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మానవుడు, తను జీవించిన తర్వాత, తను చేస్తున్న వృత్తిని వ్యాపకమును, తన పిల్లలు ముందుకు నడిపించాలని, అది నడిపి జీవనోపాధితోపాటు వృత్తి నైపుణ్యం కూడా అలవర్చుకుంటారని ఆశించడంలో తప్పులేదు.
ఉద్యోగంలో మృతి చెందినవారు తమ పిల్లలకు ఆ ఉద్యోగం ఇవ్వాలని, దానిని మరణానంతర ఉపశమన ఉద్యోగం అని ఆశిస్తారు. అర్చకులు, రాజకీయ నాయకులు, సినీ తారలు తమ తమ స్థానములను పిల్లలు భర్తీ చేయాలని కోరుకుంటారు.
అదేవిధంగా తాత్కాలికంగా ఉద్యోగం చేస్తున్నవారు పర్మనెంట్ ఉద్యోగములు కొత్తవారికి ఇవ్వకుండా, తమతోనే భర్తీ చేయాలని కోరుకుంటారు. ఈ వారసత్వం ఉద్యోగమునకే కాకుండా మన సంస్కృతి, ఆచారములకు కూడా వర్తిస్తుంది. వాటిని తమ తర్వాత తమ వారసులు భద్రంగా కాపాడాలని కోరుకుంటారు. ఇది చాలా అవసరం.
ఉదాహరణకు తాజ్ మహల్ ఒక సమాధి. దానిని సమాధిగా చూడకుండా ఒక దేశ సంపద, సంస్కృతిగా చూసినప్పుడు దానిని కాపాడుకోవాల్సిన వారసత్వ బాధ్యత దేశ పౌరులందరి పైన ఉంటుంది.
వారసత్వ పరిరక్షణ అన్ని సంపదలను కాపాడుకోవడంలో నిండి ఉంది. అది కాపాడుకోనప్పుడు మన సంస్కృతి మనకు తెలియదు. కాలక్రమంలో మరుగున పడిపోతుంది. అది ఉన్నట్లే మనకి తెలియదు. మంచికైనా, చెడుకైనా వారసత్వమును కాపాడుకోవడం మన అందరి బాధ్యత.
No comments:
Post a Comment