Saturday, January 7, 2023

బాంధవ్యములు - అన్న, వదిన

ఉమ్మడి కుటుంబాలలో తల్లి, తండ్రి బాధ్యతల నిర్వహణ తర్వాత కష్టసుఖాలు పంచుకోవడానికి అన్న, అతడితోపాటు కష్టసుఖాలు పంచుకోవటానికి వచ్చిన సహజన్మచారిణి అయిన వదిన పాత్ర ఎంతో ఉంది. 

ఆవిడ సహకారం లేనిదే చిన్నవారైన తమ్ముళ్ళు, చెల్లెళ్ళ బాధ్యతలు, వారి చదువు, వివాహము, ఉద్యోగము, పురుళ్ళు, పుణ్యకార్యములు నెరవేరవు. అసలు ఏ వ్యవస్థ మనుగడకైనా ఆడవారి సహకారం ముఖ్యం. ఉమ్మడి కుటుంబమునకు ఒక ఆధారం బాధ్యతలు పంచుకోవడం. దానిని అన్న, వదిన తీనుకుంటే ఆ కుటుంబము ఫలవంతమై, తల్లిదండ్రుల ఆశలు నెరవేరుతాయి.

అయితే ఈక్రమంలో అన్నా వదినలు తమ పిల్లల బాధ్యతలు నెరవేర్చలేని సందర్భములు కొన్ని ఉండవచ్చు. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలలో తమ్ముళ్ళ పట్ల బాధ్యతలు నెరవేర్చిన అన్నగారి పిల్లల వివాహమునకు తమ్ముళ్ళు సహకరించిన వైనం, అన్నగారు రోగగ్రస్తుడైనప్పుడు అతడికి వైద్య సహాయం అందించిన తమ్ముళ్ళున్నారు. 

ఇంకొంతమంది వారి ఇంట్లో శుభకార్యములు జరిగినప్పుడు, తమ ఇంటికి పెద్దవారైన అన్నా వదినల పేర్లు శుభలేఖపై ఆహ్వానకర్తలుగా ముద్రించి పెద్దవారి పట్ల తమ గౌరవం, భక్తిని తెలుపుకుంటారు. అన్నా వదినలకు కష్టము వచ్చినప్పుడు వారిని ఆదుకున్న చిన్నవారు చాలా సందర్భములలో మనకు తటస్థ పడతారు.

కాలం శరవేగంగా మారిపోతున్నది. ప్రపంచము పెద్దదైనా, మనసులు కుంచించుకుపోయి, ఆప్యాయతలు తగ్గి, ఉమ్మడి కుటుంబ స్వరూపము మారిపోయి, గౌరవ, ఆచారములు మారిపోయినాయి. ఇది ఎవరి కుటుంబమునకు వారు గీసుకున్న సరిహద్దు.

అందరూ గమనించవలసింది ఏమిటంటే సుఖముగా ఉన్నప్పుడు బాగుంటుంది, కానీ రోగములు, కష్టములు వచ్చినప్పుడు మనుషుల తోడు లేకపోవటం తీవ్రంగా బాధిస్తుంది. డబ్బు ఖర్చు పెట్టగలిగిన వారికి కొన్ని సంస్థలు, మనుష్యుల సేవలు అందిస్తాయి. అది కొంత ఊరట కలిగిస్తుంది. దీనికి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనమే కారణమని అనుకోవచ్చు.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.