Wednesday, January 11, 2023

ఆరోగ్యమే మహాభాగ్యం

ఈ భూమి మీద పుట్టిన ప్రతివారికీ ఆరోగ్య సమస్యలు ఉంటాయి. భూమి మీద ఉన్న అన్ని సంపదల కంటే ఆరోగ్యమే పెద్ద సంపద. 

అలాగని డబ్బు పాత్రను తోసివేయలేము. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు, డబ్బు లేనిదే వైద్య సహాయం జరగదు. ఆరోగ్యం బాగు లేనప్పుడు లేదా ఆసుపత్రిలో చేరినప్పుడు మనిషి సహాయం కూడా అవసరం.

ఈరోజుల్లో బీపీ, షుగర్ ఎక్కువమందిని ఇబ్బంది పెట్టడం జరుగుతోంది. ఈ రెండూ అన్నదమ్ములలాంటివి. 40 సంవత్సరములు దాటినవారు శరీరంలో తేడాలు వస్తే వైద్య సంప్రదింపులు చేసుకోవడం తప్పనిసరి. 

ఈమధ్య రైలులో ఒక 90 ఏళ్ల వృద్ధుని కలిసినప్పుడు, ఆయన తన ఆరోగ్యం గురించి ఇలా చెప్పారు: "నాకు హైపర్ టెన్షన్, డయాబెటిస్, మోకాళ్ళ నొప్పులు లేవు. మొదటి నుండి ఏ విషయం గురించి ఎక్కువ ఆందోళన పడేవాడిని కాదు. సమయానికి తినటం, నిద్రపోవటం వంటివి చేసేవాడిని. మితంగా తినేవాడిని. నడక అలవాటు కనుక వెళ్ళగలిగిన దూరాలకు నడిచే వెళ్ళేవాడిని. దురలవాట్లు లేవు. ఉద్యోగంలో ఉన్నప్పుడు కొన్న పొలములకు మంచిధర పలుకుతోంది. అందుకని డబ్బుకు ఇబ్బంది లేదు. దూరపు బంధువులు మా ఇంటిలో పనులకు సహాయముగా ఉంటారు. పిల్లలు స్థిరపడ్డారు. ఆర్థిక ఇబ్బందులు లేవు. అనవసరపు ఆలోచనలు లేవు. ముసలితనంలో ప్రశాంతంగా ఉన్నాను. ఈ వయసులో కూడా ఒంటరిగా ప్రయాణం చేయగలను." అయితే ఇలా చీకు చింతలు లేకుండా ఉండాలంటే అందరికీ కుదరదు. ఆయన చెప్పిన విషయాలు ఆలోచిస్తే ఆర్థిక పరిస్థితులు మనిషి మనిషికి మారుతాయి, కనుక దానిని పక్కన పెట్టి మిగిలిన విషయాలలో మనం అమలులో పెట్టగలిగినవి పెట్టి, ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలి.

ప్రతివారు 60 సంవత్సరములు దాటిన తర్వాత వైద్యబీమా చేసుకోవాలి. ఎప్పుడు రోగం పలకరిస్తుందో తెలియని పరిస్థితిలో, డబ్బు పాత్రను కొట్టివేయలేము. ఈనాటి పరిస్థితుల్లో ఆరోగ్యం మహాభాగ్యమని, అన్ని సంపదల కన్నా అది మిన్న అని చెప్పక తప్పదు.

ఎన్నో రోగములకు సరైన మందులు పూర్తిగా లేవు. ప్రతివారు ఏడు లేక ఎనిమిది మాత్రలు మిగకుండా సర్వరోగ నివారిణి మాత్రలు రావాలని భగవంతుని ప్రార్థిద్దాం. అందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, అనారోగ్యముల నుండి తొందరగా కోలుకోవాలని, ఆ భగవంతుని కోరుకుందాం. రోగాలు తక్కువగా ఉన్న కాలంలోకి వెళ్ళటానికి, కల్తీ లేని జీవనమునకు మన వంతు కృషి చేద్దాం.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.