దగ్గర సంబంధములు చేసుకొనుట: వెనుకటి రోజుల్లో ఇంతటి సమాచార వ్యవస్థ లేనందున ఎక్కువ మంది తమ దగ్గర బంధువులు, పరిచయస్తులలో మేనరికము వరసైన సంబంధములవైపు మొగ్గు చూపేవారు.
అదియు కాక చిన్నప్పటినుండి కలిసిమెలిసి పెరుగుట వల్ల ఒకరి పద్ధతులు ఒకరికి, వారి మనస్తత్వంతో పాటు అవగాహన వచ్చి, ముసలితనంలో తమను ఆదరిస్తారని తల్లిదండ్రులు అనుకోవటము వలన ఇటువంటి పెళ్ళిళ్ళు జరిగేవి. ఉమ్మడి కాపురములు నిలబడటానికి అది కూడా ఒక కారణమైంది.
ఇప్పుడు అందుబాటులో ఉన్న, అభివృద్ధి చెందిన సమాచార వ్యవస్థ వలన వివాహములు తక్కువ శ్రమతో జరిగి, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వలన, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై పలు వృద్ధాశ్రమముల ఏర్పాటుకు కారణమవుతోంది. మేనరికముల వివాహం దుష్పరిణామములు ఇచ్చునను వాదన సైన్సు ప్రకారం ఫలితములు నమ్మినపుడు ఆ ఆచారం మానుకోవటం జరుగుతున్నది.
తల్లిదండ్రులు (పుట్టింటివారు పురుళ్ళు పోయుట): కడుపుతో ఉన్న ఆడువారికి రకరకముల జాగ్రత్తలు వైద్యులద్వారా అందినప్పటికీ, వారికి తిండి, ఫలహారములు తినే విషయంలో కోరికలు లేదా ఫలానాది తినాలి అనిపించినప్పుడు, అత్తింట్లో బిడియపడినా, వేరింటి కాపురంలో బజారు తినుబండరాలు తినాల్సిన పరిస్థితిలో, పుట్టింట్లో తల్లిదండ్రుల సహకారంతో కొన్ని జాగ్రత్తలు పాటించే అవకాశం ఉంది.
ఆ పుట్టింటివారు కూడా బజారు వస్తువులపై ఆధారపడితే చేయగలిగేది ఏముంది? ఎవరు ఎంత అనుకున్నా పుట్టింటికి, అత్తింటికి తేడా ఉంటుంది. లోతుగా ఆలోచిస్తే ఈ ఆచారం వెనుక గర్భిణీకి ఇచ్చే మానసిక, వ్యక్తిగత భరోసా ఇమిడి ఉంది. పుట్టింటివారు పురుళ్ళు పోసే ఆచారంలో ఈ అంతరార్థం ఉండి ఉండవచ్చు.
ఈ మధ్యకాలంలో ఒక వివాహ సమాచార కేంద్రంలో రాయబడిన సమాచారం ఒకటి నా దృష్టికి వచ్చింది. దానిలో ఆడపిల్ల తల్లిదండ్రులు ఈ విధంగా రాశారు - పెళ్ళి అయిన తర్వాత ఆడపిల్లకు పురుడు పోయడం మాకు సంబంధం లేదు. బహుశా వారి ఆర్థిక పరిస్థితి లేదా ఇతర ఇబ్బందులు ఏమిటో నాకు తెలియదు. బంధు బలగములు తక్కువగా ఉన్న ఈ రోజుల్లో వారి ఆలోచన, అభిప్రాయము సరి అయిందని మనకు అనిపిస్తుంది.
No comments:
Post a Comment