ప్రతి ఇంటిలో చెత్తకుండీ ఉంటుంది. ప్రభుత్వం వారు ఇచ్చిన చెత్తకుండీలో చెత్త, వ్యర్ధపదార్థములు వేసే లోపల ముందుగా దానిలో వేస్తాం.
చెత్తకుండీలోని వ్యర్ధపదార్థముల లాగానే మన మనసులో కూడా చెత్త ఆలోచనలు ఉంటాయి. వాటిని వదిలించుకోగలిగితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ చెత్తకుండీని మార్చినట్లు మన ఆలోచనలను తీసివేయలేము.
ఇంటిలో ఉన్న పొదుపుకు ఆడవాళ్ళ పాత్ర చాలా ముఖ్యము. దానికి ఇంటిలోని ఇతరుల సహకారం కూడా అవసరం. చాలామంది ఆడవాళ్ళు అవగాహన లేక వండిన ఆహార పదార్ధములు మిగిలిపోతే చెత్తకుండీలో వేసి ఇంటి ఖర్చుపై అదుపు కోల్పోతారు. దీనివల్ల చాలా కుటుంబములలో తెచ్చిన నెలసరి సరుకులు మధ్యలో ఖర్చయి మరలా కొనవలసిన సరుకులు ఖర్చు పెరిగి అధిక భారం అవుతుంది. దీని వలన అప్పులు పెరిగి మనశ్శాంతి కరువు అవుతుంది.
ఈసందర్భంలో ఒక మధ్య తరగతి కుటుంబం గూర్చి జ్ఞాపకం చేసుకుందాం. ఒక ఊరిలో ఒక మధ్య తరగతి భార్యాభర్తలు ఉండేవారు. పెళ్లయిన కొత్తలో భార్యకు భర్త ఆదాయంపై అవగాహన లేక వారు ఇంటిలో వండుకోక రోజూ హోటల్లో నుండి భోజనం తెచ్చుకొనుట, ఇతర అనవసర ఖర్చులు పెట్టటం వంటివి చేసేవారు. కొంతకాలం గడిచిన తర్వాత వారు అప్పుల్లో పడి, మనశ్శాంతి కోల్పోయి, ఆత్మహత్య వరకు వెళ్లారు.
కనుక ఇంటిలో పొదుపుకు మూలస్తంభములైన ఆడవారు కడు జాగ్రత్తతో, అందరి సహకారంతో పొదుపు పాటించి, చెత్తకుండీని కుటుంబ సభ్యునిగా ఆదరించక స్నేహితునిగా మాత్రమే చూడాలి. ఈ విషయం గమనించి ఆడవారు పొదుపుకు చిహ్నంగా వ్యవహరించాలి.
ఆడవారందరూ గమనించాల్సింది ముఖ్యంగా ఇంటిని నడిపేది, నడపాల్సింది, నడపబోయేది వారు, వారి సామర్థ్యమేనని గమనించి, వారి సంసారమును పొదుపు రక్షణబంధంలో ఉంచాలి.
నీతి: ఇంటి పనిలో ఆడవారి కష్టం ఇమిడి ఉండగా, దానిలో పొందే సుఖము పొదుపు అనుకుంటే ఆ సంసారం బాగుంటుంది. కుండకు చిల్లి ఉంటే నీరు ఎలా నిలవ ఉండదో, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే, ఆసంసారం మనశాంతి లేక అప్పుల పాలవుతుంది.
No comments:
Post a Comment