Tuesday, October 25, 2022

మానవ శరీరంలో ఏ భాగం గొప్పది?

మానవ శరీరములో ఏ భాగం గొప్పదంటే చెప్పటం చాలా కష్టం. ప్రతి అవయము దానికదే ప్రత్యేకమైనది. మానవ శరీరమును మూడు భాగాలుగా విభచింపవచ్చు. 

1. మెడపై భాగము: ఇందులో తల, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు వస్తాయి.

2. మెడ క్రింది భాగం - పొట్ట వరకు: దీనిలో మెడ, చేతులు, గుండె, పొట్ట, ఛాతీ వస్తాయి.

3. పొట్ట క్రింది భాగము: మలమూత్ర విసర్జకావయవములు, మర్మాంగము, కాళ్ళు దీని క్రిందకు వస్తాయి.

స్థూలంగా ఇవి పనిచేసే విధానం తెలుసుకుందాం:

మొదటి భాగంలో తలలోని మెదడు, దానిలోని మనసు ఆలోచన ద్వారా శరీరము మొత్తమును నడిపిస్తుంది. కళ్ళు చుట్టూ జరిగేది చూడటం, చెవులు వినడం, ముక్కు వాసన ద్వారా పదార్థాలను తెలుసుకోవడానికి, నాలుక స్పర్శ ద్వారా రుచి తెలుసుకోవటం, నోరు శరీరమునకు కావలసిన ఆహారం తీసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవి అన్నీ మనసుకి విషయమును చేరవేసే అవయవములు. 

రెండవ భాగములో చేతులు ఏ వస్తువునైనా పట్టుకోవడానికి, ఆత్మరక్షణకు ఉపయోగపడతాయి. మెడ తలను నిలబెట్టడానికి, గుండె, ఛాతీ జీవించటానికి అవసరమైన రక్తప్రసరణ, ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా అవసరమైన ప్రాణవాయువుకు సహాయపడతాయి. పొట్ట ఆహారమును జీర్ణించుకుని, శరీరం మొత్తానికి  కావలసిన శక్తిని పంపుతుంది.

మూడవ భాగంలోని కాళ్ళు శరీరమును కదల్చటానికి తోడ్పడతాయి. పదార్థములను జీర్ణించుకున్న తర్వాత అనవసరమైన వ్యర్థ పదార్ధములను విసర్జించుటకు మలమూత్ర ద్వారములు తోడ్పడతాయి. మర్మాయవములు సృష్టిలో సహాయపడతాయి.

శరీరము మొత్తములోని రక్తనాళములు, ఎముకలు, అనేక గ్రంథులు అన్ని భాగములు సక్రమంగా పనిచేయుటకు తోడ్పడతాయి. శరీరము మొత్తమునకు చర్మం కవచములాగా ఉపయోగపడుతుంది. చర్మంలేని మానవ శరీరము ఉత్త ఎముకలగూడులా ఉండి, మనిషిని గుర్తించలేము.

ఈమూడు భాగములు ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధం కలిగి, విడదీయరానివిగా ఉంటాయి. ఈభాగములలోని అవయవములు దేనికవే ప్రత్యేక లక్షణములు కలిగి ఉన్నందున, ఏది గొప్ప, ఏది తక్కువ అనే ప్రశ్న తలెత్తదు. 

ఈమూడు భాగములలో పై భాగమును ఆలోచనలను సృష్టించే బ్రహ్మస్థానముగాను, రెండవ స్థానమును పోషించే స్థానమైన విష్ణు స్థానంగాను, మూడవ స్థానమును క్రియా స్థానముగా శివస్థానంగాను పోల్చుకోవచ్చు.  

మానవ శరీరమును ఒక విశిష్ట యంత్రముతో పోలిస్తే, దానిలోని వివిధ భాగములు చాలా ప్రత్యేకమైనవి, దానికి సంబంధించిన అనేక అవయవములు ఇంకా తయారుకాబడలేదు. కానీ శరీరమునకు సంబంధించిన అనేక రోగములకు ఆఅవయవమునకు సంబంధించిన ప్రత్యేక వైద్యనిపుణులు సేవలు చేయుటకు అందుబాటులో ఉన్నారు.

అలాగే మానవుడు తన కృషితో, మేధస్సుతో అనేక రంగములలో తన ప్రతిభను కనపరుచుచున్నాడు. పరిస్థితుల ప్రభావం చేత, మానవుడు సగము యాంత్రిక మానవుడై, తనకు తోడుగా యాంత్రిక మానవుని అనగా రోబోలను తనకు సేవ చేయుటకు తయారు చేసుకున్నాడు.

ఈ రోబో సేవకులు సమాజమునకు శ్రమ తగ్గించి, ఆకలి దప్పులు, గుణములు లేకుండా ఉంటాయి. ఇప్పటికే సగం యాంత్రికమైన మానవుని గుణము, ఎటువంటి స్వభావం, ఆకలి లేని రోబోల మధ్య గడిపితే వారి శరీర స్పందన మారవచ్చు. రానున్న కాలంలో ప్రపంచమందు అనేక మర మనుషులు సృష్టించబడి, అదొక విచిత్ర ప్రపంచముగా ఉండవచ్చు. అప్పుడు అదొక మేధా సృష్టి అవుతుంది. 

భవిష్యత్తులో ఎక్కువ రోబో సేవకులు గల యజమానులు వాటిని ఉంచుటకు భూమి మీద, సముద్రం మీద చోటు లేకపోతే ఆకాశంలో ఉంచే పరిస్థితి వస్తే ఆశ్చర్యపడవలసిన పని లేదు. ముందు ముందు, పశుసంపదలాగా రోబో సేవకులు ఎక్కువగా ఉన్నవారిని ఆస్తిపరులుగా చూస్తారేమో. రోబో సేవకులతో ప్రదర్శనలు కూడా నడిపించవచ్చు.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...