అష్టసిద్ధులను గూర్చి తెలుసుకుందాం. శరీర పరిమాణమును తగ్గించుట, పెంచుట, బరువు పెంచుట, తగ్గించుట, కావలసిన వస్తువులను సంపాదించుకొనుట, సృష్టించుకునే శక్తి, అన్ని వస్తువులపై అధికారం, కోరినంత ధనము ఇలాంటివి.
ఇవన్నీ భగవంతుని శక్తిలో కొంత భాగమే. హనుమంతుడు సీతాన్వేషణకై సముద్రమును దాటినప్పుడు ఈశక్తులను ప్రదర్శించటం ద్వారా మనకు ఆయన శక్తి తెలుస్తుంది. కొంతమంది జ్ఞానులకు ఈ శక్తులు లభించగానే కాలక్రమంలో శక్తులు ప్రదర్శించి, అహంకారంతో పతనమైన విషయము మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది.
భూమి మీద నివసించేవారు నిధులు అన్వేషణ కొరకు సరైన గురువు ద్వారా ప్రయత్నించి, సఫలమైనవారు కొందరు ఉన్నారు.
భూగర్భ నిధులు: ప్రకృతి ప్రసాదించిన నిధులు, సంపద వనరులు సముద్రంలో కొన్ని, భూమిలో కొన్ని ఉండటం జరుగుతుంది. దానికి సంబంధించిన శాస్త్రజ్ఞులు సైంటిఫిక్ పద్ధతుల్లో లోహపు గనుల గురించి కనుక్కొని, వాటిని బయటకు తీయటంలో సహాయం చేస్తారు. వర్షములు పడినప్పుడు వజ్రములు కొన్ని ప్రదేశాలలో బయటకు రావటం మనకు పేపర్ వార్తల ద్వారా తెలుస్తుంది.
అలానే జనావాసాలు ఉన్నచోట, కొన్ని వందల ఏళ్ళ తర్వాత శిథిలమైన ప్రదేశములలో తవ్వకం జరిగినప్పుడు బంగారు వస్తువులు, రత్నాలతో కూడిన ఆభరణములు బయటపడుట జరుగుతుంది. గుప్త నిధులకై వేటాడేవారు, అన్వేషకులు ఈ పనిలో రకరకములుగా ప్రయత్నించుటను ఎన్నో వార్తల ద్వారా మనం గమనించవచ్చు. ఈపనిలో బలుల వంటి తీవ్ర పద్ధతులు వాడుతారని తెలిసినప్పుడు సున్నిత మనస్కులు బాధపడటం జరుగుతుంది. దీనిలో వారు కొందరు మంత్ర శాస్త్రవేత్తల సహాయం తీసుకుంటారు.
రోగం వచ్చినప్పుడు కొంతమంది మంత్రశాస్త్రము సహాయంతో దానిని తగ్గించుకొనుటకు ప్రయత్నిస్తారు. అయితే మంత్ర శాస్త్రముతో స్వంతంగా ప్రయోగములు చేయక అనుభవజ్ఞులైన మంత్ర శాస్త్రవేత్తల సహాయంతో మాత్రమే ముందుకు పోవాలి. అప్పుడైతేనే ఉచ్ఛారణ దోషములేకుండా, నియమములు పాటిస్తూ విజయం సాధించుటకు అవకాశములు ఉంటాయి.
లేని ఎడల సాధకుని మానసిక స్థితిలో తేడా వచ్చి, దానిని సరి చేయటానికి తగిన గురువుని వెతికే పని సాధకుని కుటుంబ సభ్యులకు ఉండదు. మంత్ర శాస్త్రంలోని మంత్రములు చాలా శక్తివంతమైనవి. ఉచ్ఛారణ దోషము, నియమనిబంధనలు పాటించడంలో తేడా వస్తే ఇబ్బందులు వస్తాయి, తస్మాత్ జాగ్రత్త.
భగవంతుడిని తమ అసలైన తల్లిదండ్రులుగా భావించి అహంభావము లేకుండా, అమాయకత్వంతో కూడిన పట్టుదలతో ప్రార్థించినవారికి వారి కోరికలు తీరునని కొందరి అభిప్రాయం. పట్టుదల ముఖ్యం అనగా ఒక పని అనుకున్నప్పుడు దానిని పూర్తి చేయు కార్యదీక్ష ముఖ్యమని భావించాలి.
మంత్ర శాస్త్రంలో ఉచ్ఛారణ ముఖ్యం. ఉచ్ఛారణకు పళ్ళు సహకరిస్తాయి. పళ్ళు లేకపోతే ఉచ్ఛారణ సరిగా జరగదు. దైవానుగ్రహమునకు మంత్రశాస్త్రము ఒక మార్గము. పూర్వకాలంలో తపస్సులో కూర్చుని కఠిన నియమములు పాటిస్తూ బీజాక్షరములతో కూడిన మంత్రములు ఉచ్ఛరించి, భగవంతుని ప్రత్యక్షం చేసుకున్నట్లు మనకు పురాణ గాధల ద్వారా తెలుస్తుంది. ఈ కాలంలో కూడా గురు సహాయం ద్వారా, గురూపదేశం పొంది కోరికలు సాధించుకున్నవారు కొందరు ఉన్నారు.
మంత్రశాస్త్రం ద్వారా కాకుండా కొందరు ఖరీదైన ఖర్చుతో కూడిన హోమములు చేసి ఫలితం పొందుతున్నారు. హోమం సత్వర ఫలితములు ఇస్తుందనే నమ్మకం బాగా ఉంది. మంత్రసిద్ధి పొందినవారు సామాన్య జనములో గౌరవింపబడి, అహంకారమును జయిస్తే వారి గౌరవం నిలబడుతుంది. లేక అదే వీరిని జయిస్తే అదే జనముచే తిరస్కరింపబడతారు.
మంత్రశాస్త్రముతో పాటు సిద్ధులు పొందిన వారి పరిస్థితి కూడా అంతే. మానవాతీత శక్తులు పొందినవారు ఎవరైనా అత్యున్నత స్థానమునకు చేరుట లేక పతనమైపోవుట వారి ప్రవర్తనను బట్టి జరుగుతుంది.
సాయిబాబా చరిత్రలో కూడా కొన్ని శక్తులు పొందిన కుశాభావు అనే వ్యక్తి సాయిబాబా దగ్గరకు వచ్చినప్పుడు అతని మాంత్రిక శక్తులు వదిలిన తర్వాతనే అతనిని తన దగ్గరకు రానిచ్చినట్లు తెలుస్తుంది.
మానవ జీవితము - ఆయుర్దాయం: మానవ జీవితంలో మరణం అతి రహస్యం. మరణం తర్వాత ఈజన్మలో అనుభవించవలసిన కష్ట సుఖములు పూర్తవుతాయి. పుట్టినప్పుడు వ్రాయబడిన ఆయుర్దాయము, అది తీరిన తర్వాత అతి చిన్న కారణము చేత మరణం సంభవిస్తుంది. ఆయుర్దాయము తీరకముందు ఎన్ని ప్రమాదములు జరిగినా, అనారోగ్యములు సంభవించినా మరణం రాదు. అది తీరిన తర్వాత మరణం సంభవిస్తుందని నమ్మక తప్పదు.
శుభం
No comments:
Post a Comment