అందమైన చేతివ్రాత కలవారిని అందరూ గౌరవిస్తారు. వారు నలుగురిలో పొగడబడతారు.
విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో తోటి బద్ధకస్తులైన స్నేహితుల వ్రాత అభ్యర్ధనలు, ఉద్యోగ సమయంలో అంటే బద్ధకంతో పనిని ఎగొట్టే మనస్తత్వం కలిగిన ఉద్యోగుల నుండి పొగడ్తలతో వారి పనులను అంటకట్టినప్పుడు, వాటిని మొహమాటంతో తిరస్కరించలేనప్పుడు అది నిజంగా శాపం అవుతుంది.
కేవలం పొగడ్తలతో ఏ ఆదాయం లేకుండా సేవ చేసిన భావం పెరిగి, మనలను మనము తిట్టుకునే పరిస్థితిలో ఉనప్పుడు అది శాపమే. అలా కాకుండా పొగడ్తలు, గుర్తింపు లభించినప్పుడు అది వరము. అది మనలను సంతోష పెడుతుంది. ఈ గుర్తింపు మనలను ఆనందపు అంచుల్లో చేరుస్తుంది.
కొందరు మనస్తత్వ విశ్లేషకులు దస్తూరిని బట్టి మనస్తత్వమును విశ్లేషించగలరు. అలాగే కొంతమంది చేతివ్రాత నిపుణులు మంచి చేతివ్రాతను నేర్పుటకు బోధనా తరగతులు, పుస్తకములు అందజేస్తున్నారు.
దేవాలయములలో సుందరీకరణ ఆహ్లాదము కలిగించే రీతిలో, అందమైన చేతివ్రాత మనసుకు ఆహ్లాదము కలిగిస్తుంది.
ఈ సందర్భంలో ఒక సరదా విషయం చూద్దాం. ఒక డాక్టర్ భార్య ఒక చీటీని తీసుకొని వెళ్లి మందులషాపులో చదవటానికి ఇచ్చింది. ఇది ఉత్తరం కదా అని షాపతను అడగగా, డాక్టర్ గారి వ్రాత మీకు అర్థం అవుతుంది కదా, అందుకని మీరు చదివి పెడతారని మీ వద్దకు తెచ్చాను అని చెప్పింది. అప్పుడు ఆశ్చర్య పోవటం షాపతని వంతయ్యింది.
ఇలాంటి సరదా సంగతులను పక్కన పెడితే చక్కటి దస్తూరి తోటివారిని ఆకర్షిస్తుంది. విద్యార్థులకైతే ఎక్కువ మార్కులు తెచ్చుకోవటానికి సహాయం చేస్తుంది. కనుక అందమైన చేతివ్రాతను వరమని చెప్పుకోవచ్చు.
No comments:
Post a Comment