Sunday, October 16, 2022

అవతలి ఒడ్డు, ఇవతలి ఒడ్డు - మధ్యలో కష్ట సుఖముల ప్రవాహము-2

హిందూ దేవుళ్ళలో శంకరుడికి కొద్దిపాటి తపస్సుకు, పొగడ్తలకు పొంగిపోయి వరాలనిచ్చే భోళాశంకరుడని పేరు ఉంది. సముద్ర మథనప్పుడు లోకమునకు మేలు కలుగచేయు ఉద్దేశ్యముతో గరళము నుండి ప్రజలకు మేలు చేసిన ఖ్యాతి ఆయనకు వచ్చింది.  

ఈభూమి మీద పుట్టిన స్త్రీ, పురుషులలో అనేకమంది పొగడ్తలకు స్పందిస్తారు. పొగడ్తలు మానసిక స్పందనలో సహజ పరిణామములుగా భావించవచ్చు. అస్సలు పొగడ్తలకు స్పందించకపోవడం ప్రకృతి సహజ స్పందనకు వ్యతిరేకముగా భావించవచ్చు. పొగడ్తలకు స్పందించడం తప్పు కాదు, కానీ ఎదుటివారు తమ స్వార్థ ప్రయోజనములకు చేసే పొగడ్తలకు స్పందించి, విపరీత వాగ్దానములు చేయుట, అనవసరమైన ప్రయోజనములను అవతల వారికి కలగజేయుట వలన ఇబ్బందులు రాకుండా చూసుకొనుట ముఖ్యం. ఇది కొన్ని సందర్భములలో మనని అనుకోని కష్టములలోకి నెట్టేస్తుంది. 

దేవుడిని ప్రత్యక్ష పూజల ద్వారా ఆరాధించి కోరికలు తీర్చుకునేవారు మనశ్శాంతి పొందుతారు. మానవత్వంతో కూడిన మానవ సేవ ద్వారా అవసరమైన వారికి సహాయము చేయుటకు వెనుకాడరాదు. దైవ సేవలో పరోక్ష సేవ చేసి తృప్తి పొందినవారిని పోల్చుకున్నప్పుడు, ఈ సేవ నిరాకార, ఆకార రూపమునకు ప్రత్యామ్నాయంగా భావించవచ్చు.

కొన్ని ప్రత్యక్ష మహిమల గురించి ఇప్పుడు తెలుసుకుందాం: 

కొన్ని కుటుంబములలో పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వాదములు తీసుకుంటారు. తల్లిదండ్రుల మనవంటి వాళ్ళే కదా, దానివలన ఏమి మేలు జరుగుతుందని కొందరు అనుకోవచ్చు. అలా ఆశీర్వాదం తీసుకున్నవారికి, తల్లితండ్రుల వలన పైలోకంలో ఉన్న వాళ్ళ పితృదేవతలు మేలు చేసే అవకాశం ఉంది. దీని గురించి పురాణాలలో చెప్పబడిన ఒక విషయం చూద్దాం: 

ఒకానొకప్పుడు పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉండగా గణపతి, కుమారస్వామి వచ్చి తమ ఇద్దరిలో ఒకరికి ఆధిపత్యాన్ని ఇవ్వమని కోరారు. అప్పుడు ఇద్దరిలో ఎవరు సమస్త నదులలో స్నానం చేసి, ముందుగా వస్తారో వారికి ప్రథమ స్థానం ఇస్తానని పరమశివుడు చెప్పాడు. వెంటనే కుమారస్వామి నదీస్నానాలు చేయడానికి బయలుదేరాడు. అయితే గణపతి తన శరీరంతో భూప్రదక్షిణ చేయలేనని గ్రహించి, అన్ని లోకాలు వారిలోనే ఉన్నాయి కనుక, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఫలితం వస్తుందని, వారిద్దరి చుట్టూ ప్రదక్షిణం చేయగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తను వెళ్ళిన ప్రతిచోట తనకంటే ముందుగా విఘ్నేశ్వరుడు వెళ్ళటం కనిపించి, వెనుతిరిగి వచ్చాడు. ఈ రకంగా పరీక్షలో విజయం పొంది, వినాయకుడు గణాధిపత్యం పొందుతాడు. కనుక తల్లితండ్రులు ప్రత్యక్ష దైవాలని పెద్దలు చెప్పిన మాటను గుర్తు చేసుకుందాం.

ఒక్కొక్కసారి ఆకతాయి పనులు చేయటం వలన ప్రమాదములు తెచ్చుకోవడం జరుగుతుంది. ఒక ఊరిలో పైకప్పు లేని మరుగుదొడ్డిలో ఒక పంది దాని ఆహారమైన మలము తింటుండగా, ఒక కుర్రవాడు మరుగుదొడ్డి గోడలపై నుంచి ఒక పొడుగాటి కర్రతో దాన్ని పొడవసాగాడు. కోపం వచ్చిన పంది ఆ కర్రను పట్టుకుని లాగగా, కుర్రవాడు మరుగుదొడ్డిలో పడ్డాడు. అప్పుడు పంది అతడిని చీల్చి చంపేసింది. కనుక ఆకతాయి పనుల జోలికి పోరాదు.

జీవన మార్గంలో మౌనము, లౌక్యము కవచంలాగా ఉపయోగపడుతాయని భావించినప్పటికీ, వాటిని ఉపయోగించటానికి విచక్షణ ముఖ్యం. అవసరమైనప్పుడు మాట్లాడాలి, లేకపోతే ఫలితం ఉండదు. ప్రవర్తనలో తప్పులు సరిదిద్దటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే, అవసరం లేనిచోట లౌక్యాన్ని ఉపయోగించినప్పటికీ, ప్రయోజనం ఉండదు. అందుకే విచక్షణతో కవచాలను వాడుకోవాలి.

భూలోక సౌఖ్యములకు అవసరమైన ధనముతో పాటు, మరికొన్ని కూడా ఉన్నాయి. వీటి కోసం అర్హులైన వారు ప్రయత్నించడం ముఖ్యం. ఇప్పుడు అష్టసిద్ధులను గూర్చి తెలుసుకుందాం. అష్టసిద్ధులు అంటే ఎనిమిది సిద్ధులు.

                                                                                                                                        (సశేషం)

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.