Saturday, August 19, 2023

జీవితములో ఏ సేవ ముఖ్యము - మానవసేవా లేక దైవ సేవా - 2

భూమి మీద దైవము లేదా దైవాంశ సంభూతులు మానవ రూపంలో జన్మించి, తమ అవతార కాలంలో అనగా జీవించి ఉన్న కాలంలో అనేక ప్రబోధములు ప్రజలకు అందించి, వారిని ఆధ్యాత్మిక మార్గంలో మళ్ళించినట్లు మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. 

శరీరమే దేవాలయం అని భావించేవారు కొందరుండగా, తనలో ఉన్న దేవుని చూచుటకు బయట వెతుకుట అనవసరమని కొందరు భావిస్తారు. ఆధ్యాత్మికత ప్రపంచము లేక జ్ఞానము చాలా లోతైనది. విశాలమైనది. ఎన్నో సందేహములు సామాన్యులకు కలుగుతాయి. మత ప్రవక్తలను మినహాయించి, ఎందరో ఆధ్యాత్మిక పురుషులు లేదా జ్ఞానులు ప్రపంచమంతా ఉన్నారని సామాన్యులు భావిస్తారు.

వారు తమ అనుభవ సారంతో సందేహాలని నివృత్తి చేస్తే, చాలామందికి మేలు జరుగుతుంది. వయసులో ఉన్నప్పుడు సుఖముల కొరకు వివిధ ప్రయత్నములు చేసినా, నడివయసులో ఆ వేగము తగ్గుతుంది. ముసలితనంలోకి అడుగుపెట్టినప్పుడు మనసు పూర్తిగా మారిపోతుంది. 

శరీర పటుత్వము తగ్గి మనసు ఆలోచనలలో మార్పులతో, దేవుడు ఉన్నాడో, లేదో అని ఒకప్పుడు సంశయపడిన వారు కూడా దేవుడు ఉన్నాడనే నమ్మకంతో వెతుకులాట ప్రారంభిస్తారు. ఇది సృష్టి క్రమంలో భాగంగా అనుకోవాలి. 

సుఖానుభవంలో మునిగి తేలినప్పుడు, దాని చెడు ఫలితము కూడా వెంట ఉంటుందని మర్చిపోరాదు. ఋణానుబంధ రూపేణా బంధుత్వాలు ఏర్పడతాయి అనే మాట తరచుగా చెబుతారు. అది నిజమైతే మరుజన్మలు నమ్మేవారికి బంధుత్వాల వరుసలు మారవచ్చు.

దైవ సేవలో కళాసాహిత్య బృందములను ప్రోత్సహించవచ్చు. విద్యా దానముకై కళాశాలలు, విద్యాసంస్థలు స్థాపించవచ్చు. ఇవి అన్నీ ఒక్కరే చేయలేరు. బృందములుగా ఏర్పడితేనే సాఫల్యం అవుతాయి. తమిళనాడులోని ఒక గుడి వారు వైద్య కళాశాలను నెలకొల్పారు. ఒక శివపీఠం వారు అనేక విద్యాసంస్థలు నెలకొల్పారు. అర్హులైన పేదవారికి స్కాలరుషిప్పులు ఇవ్వవచ్చు. ఇలాంటివి ఇంకా ఎన్నో. 

దైవ భక్తుల సేవ కూడా దైవ సేవలో భాగమే. చిన్న జ్ఞాపకము పాఠకులతో పంచుకుంటాను. కొన్ని ఏళ్ళ క్రితం ఒక ఊరి గుడిలో అయ్యప్ప సేవా కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చిన అయ్యప్ప భక్తులకు, ఒక భక్తుడు బావిలో నుండి నీరు బొక్కనతో తోడి పాదములు కడుక్కొనటానికి సహాయపడ్డాడు. అతనివంతు దైవ భక్తులకు చేసే సేవ దైవ సేవలో భాగమని చెప్పుకోవచ్చు. 

దైవ సేవలో ఫలితములు చివరికి మానవులకే చేరుతాయి. ఉదాహరణకు నైవేద్యమును మనమే వినియోగిస్తాము. పూజా కార్యక్రమములలో వినియోగించు అనేక వస్తువులు చాలామందికి పరోక్ష జీవనోపాధి కలగజేస్తాయి. 

విషయం పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత అర్థమయ్యేదేమిటంటే దైవ సేవ ఉత్తమం. మానవసేవ పరమోత్తమం. దైవసేవ, మానవసేవ కలిసి చేస్తే ఉత్తమోత్తమం అని నేను అభిప్రాయపడుతున్నాను.

చేదునిజం: ఈ ప్రపంచంలో ఏదీ ఉచితం కాదు. పరోపకార సేవాభావంతో కొందరు కొన్ని సేవలు జరిపించినా దాని వెనుక కొందరు దాతల సహాయం, కష్టము ఉంటుంది.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.