Tuesday, August 23, 2022

సంతోషంలో దేవుని చూడగలమా

సంతోషమే సగం బలము ఆనందోబ్రహ్మ అని పెద్దలు చెప్పారు. సంతోషమును రెండు రకాలుగా ఊహిస్తే ఒకటి దైవ సంబంధమైన పూజలు, దేవాలయంలో వివిధ పనులకు విరాళములు ఇచ్చినందువలన కలిగే ఆనందము లేక సంతోషమును దైవ సంబంధమైన సంతోషముగాను, రెండవది మనుష్యులకు ప్రత్యక్షంగా లేక నేరుగా ఉపయోగపడే పనులకు సహాయం చేయుటను మానవత్వ సంతోషంగానూ అనుకోవచ్చు. మన జీవితంలో సంతోషము కలిగించిన సంఘటనలను ఒక సంవత్సరంపాటు పుస్తకంలో రాసి పెట్టుకోవాలి.   

మానవ జీవితంలో సుఖదుఃఖములు సమానంగా ఉండవు. సుఖము తక్కువ, దుఃఖము ఎక్కువగా ఉండవచ్చు. విశ్రాంతి తీసుకునే వయసులో ఉన్నవారు తప్పక ఒక ఏడాది పాటు ప్రతిరోజు క్రితం రోజు సంతోషము కలిగించిన సంఘటనలు రాసి పెట్టుకోవాలి.

ముఖ్యంగా మనస్థాపం కలిగించిన సంఘటనలు రాసుకోరాదు. కుటుంబ సభ్యులతో పొరపొచ్చాలు, వారి మీద విమర్శలు రాసుకోరాదు. ఈ సందర్భంలో పిల్లల ముద్దు ముచ్చటలు, మనకు ఆనందం కలిగించిన సంఘటనలు, ఇతరులకు చేసిన పనులు, వారు మనకు చేసిన సహాయములు యాత్రల సందర్శనకు ఇతరులు అందజేసిన మేలు కూడా ఉండవచ్చు. ఈ పుస్తకంలో డబ్బు ప్రస్తావన వద్దు.

ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త, తపస్సంపన్నుల ఆశీర్వచనము లేక సంభాషణ ఆ చుట్టుపక్కల వారిని శబ్దతరంగముల ద్వారా ఆనందముగా లేక సంతోషంగా ఏ విధంగా ఉంచగలదో మన సంతోషం ద్వారా దాని తరంగాలు మన చుట్టుప్రక్కల వారిని సంతోషంగా అంత బలముగా కాకపోయినా ఉంచగలదని నేను నమ్ముతాను.

ఒక సంవత్సరం పాటు పుస్తకములో సంతోషం కలిగించే విషయములు రాసుకున్న తరువాత దానిని అప్పుడప్పుడు చదువుకొని సంతోషము పొందాలి. దీనివలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా శరీరము ఉత్సాహము నింపుకొని ఆయుర్దాయం పెరగవచ్చు. ఇది ఏ వయసు వారికైనా ఉపయోగపడే పద్ధతి. ఎవరు పాటించినా ఆనందం పొందుతారు. డబ్బు లేనిది జీవితం లేదు. అయినప్పటికీ, సాధ్యమైనంత వరకు డబ్బు ఆలోచనలు తగ్గించుకోవాలి.

మానవత్వంతో కూడిన సంతోషమే దైవత్వం. సంతోషంగా ఉండండి. చుట్టుప్రక్కల వారిని కూడా సంతోషంగా ఉంచండి. ఎప్పుడూ చిరునవ్వు ఆకర్షణీయంగా ఉంచుతుంది.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.