Thursday, June 2, 2022

మానవ జీవితంలో వైరాగ్యం స్థానము ఎక్కడ?

మానవ జీవితంలో సుఖ దుఃఖములలో వైరాగ్యము దాగి ఉంది. వైరాగ్యము అనగా జీవితకాలంలో సుఖదుఃఖ అనుభవములు పొందిన తర్వాత దేనిపైన అయినా విరక్తి ఏర్పడితే, దానిని వైరాగ్యముగా భావించవచ్చు. 

అది తాత్కాలికమైనదైనా లేదా శాశ్వతమైనదైనా కావచ్చు. ప్రాపంచిక వ్యామోహములపై, భార్య హితముతో వైరాగ్యము వచ్చి భక్తి భావములతో హనుమాన్ చాలీసా, ఇతర గ్రంథాలు రచించిన గోస్వామి తులసీదాసు లేదా గౌతమ బుద్ధునిగా మారిన సిద్ధార్థ గాని వైరాగ్య మార్గమును తెలియజేశారు.

బుద్ధుని కాలంలో జరిగిన ఒక కథ జ్ఞాపకం చేసుకుందాము. దుఃఖంతో ఉన్న ఒక గృహిణి బుద్ధుని వద్దకు వచ్చి తన కష్టము చెప్పుకొనగా బుద్ధుడు ఆమెకు దుఃఖం ఎరుగని ఇంటి నుండి ఆవాలు తెమ్మని చెప్పినట్లు, గృహిణి దుఃఖమెరుగని ఇల్లు లేదని గ్రహించి, ఆ విషయం బుద్ధునికి చెప్పినట్లు, ఆమెకి జ్ఞానోదయం అయినట్లు తెలుసుకున్నాము. చాలామందిలో దుఃఖ సంఘటనలు జరిగిన తరువాత వచ్చేది తాత్కాలిక వైరాగ్యమే.

కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాము. పేకాటలో సర్వం కోల్పోయిన వ్యక్తి విరక్తి చెందితే పేకాట వైరాగ్యము వచ్చి ఆ ఆట జోలికి పోకపోవచ్చు. ఉద్యోగంలో కోరుకున్న చోటుకు బదిలీ కానీ, ఉద్యోగంలో ఉన్నతి కానీ రానప్పుడు వచ్చేది తాత్కాలిక వైరాగ్యమే. 

అతి అనర్థం అని అనుకుంటే ఇష్టముగా, రుచిగా ఉందని జీడిపప్పు అతిగా తింటే దాని వాత లక్షణంతో ఒళ్ళు పట్టుకోవచ్చు. అప్పుడు వచ్చే విరక్తి భయముతో జీడిపప్పు మీద వైరాగ్యం కలగవచ్చు. అతని మనస్తత్వం మీద ఈ వైరాగ్యం తాత్కాలికమా లేక శాశ్వతమా అని ఆధారపడి ఉంటుంది. మనిషికి అతని జీవిత బంధములతో తేడాలు వచ్చి, చుట్టుపక్కల వారి ప్రవర్తనతో విసుగు చెందితే, అది విరక్తితో వైరాగ్యమునకు దారితీయవచ్చు. 

చెట్టు ముందా, విత్తనం ముందా అనే భావం లాగానే భక్తి ముదిరి వైరాగ్యం చెందుట లేదా వైరాగ్యం ముదిరి సన్యాసి అవుట ఒక జంట బంధముల పరిణామము. మనసు పొరలలో దాగి ఉండే అనేక గుణములతోపాటు వైరాగ్యము ఉంటుంది. దుఃఖ పరిణామములు సంభవించినప్పుడు ఓర్పు, వైరాగ్యము మనసుకి ప్రాథమిక చికిత్స చేయుటలో సహాయపడతాయి. 

సంసార జీవితంతో విరక్తి చెంది సన్యాస జీవితం వైపు మళ్ళిన కొందరికి వచ్చే సమస్యలు ఏమీ తక్కువ కాదని, ఆ సమస్యల తీవ్రతతో వైరాగ్యం గూర్చి ఆలోచించే సమయం దొరకడం లేదని భావించవచ్చు. వైరాగ్యం వచ్చిన తర్వాత సమస్యల నుండి, బాధ్యతల నుండి పారిపోరాదు. పరిష్కారానికి తమ వంతు కృషి చేయుటయే మానవధర్మం అని తెలుసుకోవాలి. సుఖ, దుఃఖముల వల్ల వచ్చే భావోద్వేగములకు ఎవరూ అతీతులు కాదు. 

మనసు ఒక పెద్ద సరస్సు అనుకుంటే మనిషిలోని అన్ని గుణములకు సంబంధించిన ప్రకంపనలవల్ల వచ్చే వైరాగ్యమునకు అది కేంద్రబిందువు అవుతుంది. ప్రపంచములోని అన్ని రోగ కారణములు శరీరంలోనే ఉండి బలహీనమైన సమయంలో బయటపడతాయి. చివరిగా మనము తెలుసుకోవలసింది ఏమిటంటే వైరాగ్యము బయట ఎక్కడోలేదు, మనని వెన్నంటే ఉంది. ప్రాపంచిక సుఖములపై విరక్తితో వచ్చేది వైరాగ్యము. ఆ తరువాత అలౌకిక ఆనందం కొరకు ప్రయత్నము మొదలవుతుంది. 

ప్రహ్లాదుని సూచనపై సర్వాంతర్యామి అయిన భగవంతుని నరసింహావతారం కొరకు హిరణ్యకశిపుడు వెతికి విజయం సాధించాడు. కానీ మరణం పొందాడు. మానవ జీవితంలో ఇవతలి ఒడ్డు సంసార జీవితం అయితే, అవతలి ఒడ్డు వైరాగ్య జీవితం అనుకుందాం. తామరాకు మీద నీటిబొట్టు లాంటిది వైరాగ్య జీవితం. అన్నీ కావాలని, అందరినీ కలుపుకొని పోవాలనేది సంసార జీవితం. ఈ ఒడ్డు దాటి అవతలి ఒడ్డుకు చేరిన తర్వాత, వారి జీవితంలో పెను మార్పులు ఉంటాయి. ఫలితము ఆశించని ప్రయత్నమునకు వైరాగ్యము అంటదు.

జీవిత సత్యం: శాశ్వత వైరాగ్యము పొందిన వ్యక్తి జీవితంలో అనేక మార్పులు వస్తాయి.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.