సేవ అనగా మనము చేసినది, చేయించుకున్నది - రెండూ సేవలో భాగమే. ఈ సేవలను గురించి వివరముగా తెలుసుకుందాము.
మనిషి శిశువుగా పుట్టగానే పెద్దయ్యేవరకు తల్లి చేసే సేవలను
అందుకుంటాడు. విద్య నిమిత్తం గురువు దగ్గరకు వెళ్తాడు. వెనుకటి రోజుల్లో ఉచిత
గురుకులములలో, ఉచిత సౌకర్యములతో గురుసేవ చేసుకుంటూ విద్య నేర్చుకునేవారు. మారిన
కాల పరిస్థితుల్లో, బడా విద్యాసంస్థలలో బండెడు పుస్తకాల సంచీలతో, గురుసేవని ప్రక్కన
పెట్టి, అధిక శ్రమతో విద్య నేర్చుకోవాల్సిన పరిస్థితి. అప్పటినుండి ఉద్యోగము
సంపాదించుట, వివాహము,
పిల్లలతో కుటుంబం పెరిగి సౌకర్యముగా
గడుపుటకు అనేక మంది సేవలు అవసరమవుతాయి.
నిద్రలేచిన తరువాత ఆహారం కొరకు వివిధ సేవల ద్వారా ఇంటికి చేరిన ఆహారపదార్ధములకు సంబంధించిన సరుకులు, కూరగాయలు, ఇతరములతో మొదటి సేవ పూర్తి అవుతుంది. ఉద్యోగము చేయు ప్రదేశములు చేరుటకు అనేక రవాణా సౌకర్యములతో రవాణా సేవ పూర్తవుతుంది.
ఈ సేవ తరువాత కావాల్సిన వినోదమునకు సంబంధించిన సేవలు సినిమాలు, ఇతరములు. మధ్య మధ్య ఫలహారము అందించే హోటళ్ల సేవలు, సకాలములో మధ్యాహ్న భోజనం అందుకోలేనివారికి కొన్ని నగరములలో గల డబ్బావాలా వారి సేవలతో పాటు, ఇంటిలోని అనేక గృహూపకరణముల తయారీదారుల సేవలు, వాటికి మరమ్మతు వచ్చినప్పుడు మెకానిక్కుల సేవలు అవసరం అవుతాయి. ఈ ప్రపంచంలో ఏ సేవలు ఉచితము కాదు. భార్య, ఆత్మీయుల సేవలు మినహాయింపుతో అన్నిటికీ రుసుములు ఉంటాయి.
మన ఆరోగ్యము కాపాడుకొనుటకు వైద్య మరియు దాని అనుబంధ రంగముల సేవలు అవసరమవుతాయి. స్థూలంగా చెప్పాలంటే మన ఆహారము, ఇతర అవసరములు, వినోద, ఆరోగ్య, విద్య, రవాణా, యాత్రా సందర్శన, అనేక వృత్తి పనివారల సేవలు మొత్తం మనం లెక్కించలేనంతమందితో తగిన రుసుములతో మన జీవిత కాలంలో అవసరమవుతాయి. ఏ సేవలు ఉచితము కాదు. తగిన రుసుములు ఉంటాయి.
ఇది కాక కొన్ని సేవా సంస్థలు ఉచిత సేవలు అందిస్తాయి. విపత్తులు వచ్చిన సందర్భములలో వీటి పాత్ర చెప్పుకోదగినది. సాంఘిక సేవా సంస్థలు ( సాంఘిక సేవ), రెడ్ క్రాస్, scouts and guides లాంటి ఇతరములు దీని కిందకు వస్తాయి. ఇన్ని సేవలు అందుకునే మనము చివరి దశలో మరణించిన తరువాత మరుభూమికి సంబంధించినవారి అంతిమ సేవతో ఈ శరీరము పంచభూతములతో కలసి మానవుని సేవలు అందుకొనుట పూర్తవుతుంది.
సేవా జీవితము: జీవితమేసేవ. ఇన్ని సేవలు అందుకుండే మనము మరిన్ని కొత్త సేవలు కనుక్కొని, తోటివారికి ఉచితంగానూ, తగిన ఫీజులతోనూ అందిద్దాము. మరణించేలోపు మనము కూడా మన వంతు సేవ చేద్దాము. సేవ రుసుముతో చేస్తే బతకడానికి చేసే సేవ గాను, ఫీజు వసూలు చేయకుండా చేసే సేవను అవతలి వారికి దైవం మన రూపంలో అందజేస్తున్నట్లు భావించి, ముందుకు సాగిపోదాం. తమలోని సహాయం చేయగల నైపుణ్యమును ఏ వయసువారైనా వృధా చేయవద్దు. సేవాగుణము మనిషిని ఆదర్శముగా నిలబెడుతుంది.
No comments:
Post a Comment