Saturday, June 11, 2022

మానవ శరీర నిర్మాణము - 2

ఆరోగ్య సంరక్షణలో ఆహారం పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఈమధ్య ఆర్గానిక్ ఆహార వస్తువుల వినియోగము పెరిగింది. అనగా కృత్రిమ ఎరువులు, చీడపురుగుల సంహారము నిమిత్తము క్రిమిసంహారక మందులు వాడని వస్తువుల వినియోగం రోగాల బారి నుంచి కాపాడుతుంది అని నమ్మేవారు పెరిగారు.

రోగము తగ్గించుకొనుటలో తినకూడని ఆహారం తినకుండా ఉండుట కూడా ఒక పద్ధతి. ఫాస్ట్ఫుడ్ నియంత్రణ కూడా ఒక జాగ్రత్త చర్యే.

నాకు తెలిసిన కొందరి ఆహారపు అలవాట్లను పరిశీలిద్దాము. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని సక్రమమైన ఆహారం తీసుకోకుండా సమయపాలన చేయకుండా సమోసాల మీద ఆధారపడి జీర్ణకోశ సమస్య తెచ్చుకొని, ఒక యోగా నిపుణుడిని ఆశ్రయించింది. 

రెండవది ఒక తోటి ఉద్యోగి అలవాటు. ఆకలి అయినప్పుడు ఆహారం తీసుకోకుండా ఎక్కువ కాఫీలు, టీలు తాగి జీర్ణకోశ ఇబ్బందిని తెచ్చుకొని వైద్యుడిని ఆశ్రయించాడు.

క్రిక్కిరిసిన ఆస్పత్రులు, పెరిగిన జనాభాకు తగినట్టుగా లేని వైద్యుల కొరత ఆరోగ్య రక్షణకు చేయు కృషి మెరుగుపడాలని మనకి తెలియజేస్తుంది. రోగాల బారిన పడుటకు వాతావరణ కాలుష్యం, బలమైన ఆహారము తీసుకోకపోవటము, వాతావరణంలో విపరీతమైన మార్పులు, అలసట, ఒత్తిడి కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు.

విద్యార్థి దశ నుండి వయసుకి మించిన స్కూల్ పుస్తకముల సంచి బరువు, పరీక్షలు, మార్కులు, ర్యాంకుల ఒత్తిడి వంటివాటితో, విద్యార్థుల జీవితం అంతా ఒత్తిడితో గడుస్తుంది. ఒత్తిడితో జీవితము ప్రారంభమై జీవితమంతా ఒత్తిడితో ముగుస్తుంది. ఏవిధమైన వ్యాయామము లేని పూర్తి యాంత్రిక విధానము.

అన్ని రకముల ఆహార పదార్థములలో నకిలీ లేదా కల్తీ వస్తువుల వాడకం ఆరోగ్యమునకు హాని చేస్తుంది. భౌతిక వస్తువుల అవసరముల నిమిత్తము డబ్బు సంపాదించడం ముఖ్యమే, కానీ దాని కొరకు అనేక రకముల ఒత్తిడికి గురవ్వటం కూడా ఒక భాగమైంది. 

దాన్ని తగ్గించుకొనుటకు ఆధ్యాత్మికజీవితమునకు కొంత సమయం కేటాయించడం మంచిదని కొందరంటారు. దీని వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మానవ శరీరములో అన్నిటికన్నా పదునైన ఆయుధం నాలుక. ఇది ఎవరినైనా తన మాటలతో బాగా గాయపరచగలదు.

నవ రంధ్రములు:

నవ రంధ్రములు మానవ శరీరము సక్రమముగా నడుచుటకు తోడ్పడతాయి. అవి రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కు రంధ్రములు, నోరు, మల, మూత్ర విసర్జన ద్వారములు (2). ఈ భాగములు బయట నుండి కొన్ని, ప్రకృతి నుండి స్వీకరించుటకు కొన్ని అనవసరమైన వస్తువులను విసర్జించుటకు తోడ్పడతాయి. 

నవ రంధ్రములు ఆరోగ్య సంరక్షణకు తోడ్పడినా, మనిషి ప్రాణములు పోయేటప్పుడు అతని ప్రాణశక్తి నవ రంధ్రములలో ఏదో ఒక రంధ్రం నుండి గాలిలో కలిసిపోతుందని శాస్త్రము చెప్తున్నది. నవ రంధ్రములు మానవ జీవితం సక్రమంగా నడుచుటకేకాక,  వాటి తోడ్పాటు ఆధ్యాత్మిక జీవితంలో కూడా సహాయపడుతుంది. 

కొందరు విశాల హృదయంతో చనిపోయిన తర్వాత  తమ శరీరమును వైద్య కళాశాలలకు పరీక్షల నిమిత్తము అందజేయడం మనం గమనిస్తాం. మరికొందరు వారి జీవితకాలంలో నవ రంధ్రములుగల శరీర అవయవములకు అందము పెంచుకునే నిమిత్తము శస్త్ర చికిత్సలు చేయటం కూడా మనము గమనిస్తాం.

కారుకి స్టీరింగ్ ఎంత అవసరమో శరీరమునకు మనస్సు కూడా అంతే అవసరం. మనసుకు గల అత్యధిక శక్తి వలన అనేక కోరికలు తీరుతాయి. దీనికి సంకల్ప బలము తోడైతే కోరికల సాధన సులభమవుతుంది. దానికి ఎఫర్మేషన్స్ సాధన అవసరము. ఈ మధ్యకాలంలో ఎఫర్మేషన్స్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్ పవర్ వాడుట ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. 

ప్రపంచంలో పరీక్షలు పెట్టడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. దానిలో గీటురాయి ఒకటి. దీనిని బంగారం నాణ్యత పరీక్షకు ఉపయోగిస్తారు. మానసిక పరిపక్వతను పరీక్షించడానికి ఆకర్షణలు పనిచేస్తాయి. ఎందరో మహర్షుల తపస్సులను ఇంద్రుడు ఆకర్షణలు ఉపయోగించి భగ్నం చేసినట్టు మనకు పురాణ కథలు చెబుతాయి. 

వాటికి ఉదాహరణగా విశ్వామిత్ర మేనకల కథను తీసుకుందాం. తీవ్రముగా తపస్సు చేస్తున్న విశ్వామిత్రునికి మేనక అనే అప్సరస తపోభంగం చేసిన సందర్భంలో వారికి ఆడపిల్ల కలిగింది. ఆ పిల్లను అడవిలో వదిలి మేనక వెళ్ళిపోయింది. ఆశిశువును కణ్వ ముని తీసుకొని వెళ్ళి, శకుంతల అనే నామధేయంతో పెంచుకున్నాడు.

కాలక్రమములో ఆ శిశువు పెరిగి, కన్య అయినప్పుడు దుష్యంతుడు అనే రాజు ఆమెను గాంధర్వ వివాహము చేసుకున్నప్పుడు కొన్ని అడ్డంకులు వచ్చి శాపవిమోచనము జరిగి కథ సుఖాంతము అవుతుంది. వీరి కుమారుడే భరతుడు. ఈ ఉదంతము భారతదేశ చరిత్రకు మూలమవ్వటం తర్వాత పరిణామాలు. అలాగే దైవానుభూతి పొందినవారు తమ చుట్టుపక్కల గల బాహ్య ఆకర్షణలకు లోనై పతనమైన సందర్భాలు ఉండవచ్చు. ఆకర్షణ చాలా బలమైనది. బాహ్య ఆకర్షణలో డబ్బు పాత్ర కూడా చాలా ముఖ్యమైనది.

మనము నివసించే భూలోకముపైన కొన్ని పరలోకములు కూడా ఉంటాయని, వాటిలో యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష మొదలగు దేవతా జాతి సమూహములు ఉంటాయని, అలాగే మన భూమి క్రింద పాతాళ, నాగ లోకములు ఉంటాయని మన శాస్త్ర విషయము ద్వారా తెలిసిన దానిని మనము నమ్ముతాము. 

ఈ జాతుల్లో కొందరు మానవులకు భూత, వర్తమాన, భవిష్యత్ విషయాలను చెప్పుటకు సహాయం చేస్తారని ఒక ప్రచారము. కొన్ని భవిష్య విషయములు తప్పయితే వాటిని అల్లరి మనస్తత్వమునకు కారణముగా చెబుతారు. మనిషి జీవితంలో కొందరికి విపరీతమైన మెచ్చుకోళ్ళు వచ్చిన సందర్భములు, విపరీతముగా జనము అసహ్యించుకున్న సందర్భములు ఎదురవుతాయి. ఈ సందర్భంలో మానవ జీవితమును మునగ చెట్టు- సీతాకోకచిలుక- గొంగళి పురుగుతో పోల్చుకుందాము.                                                      (సశేషం)                                                                             

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.