Tuesday, June 14, 2022

మానవ శరీర నిర్మాణము - 3

జీవితం- మునగ చెట్టు- గొంగళి పురుగు- సీతాకోక చిలుకలతో పోలిక

మునగచెట్టు చాలా బలహీనమైనది. చెట్టు ఎక్కితే ఎక్కడ విరిగిపడిపోతుందో అని భయముగా ఉంటుంది. మనల్ని ఎవరైనా పొగిడితే మునగ చెట్టు ఎక్కించద్దు అని అంటాము. మునగచెట్టు ఆకులు వైద్యపరంగా ప్రయోజనకారి, మునగకాయలు శాకాహార, మాంసాహార ప్రియులకు వంటలో ఉపయోగపడతాయి. 

గొంగళి పురుగుకు మునగచెట్టు ఆశ్రయం ఇస్తుంది. మానవ జీవితము కూడా మునగ చెట్టు లాంటిదే. మనిషి చాలా బలహీనుడు. మనస్సు దృఢముగా ఉన్నప్పుడే, శరీరము బలహీనముగా ఉన్నా కూడా, ఎన్నో పనులు చేయగలుగుతాడు. చుట్టుపక్కల వారి అసూయ కాకుండా సహకారము లభించినప్పుడు అతను విజయమును సాధిస్తాడు. 

ప్రతివారూ గొంగళి పురుగును అసహ్యించుకుంటారు. అదే తర్వాత అది సీతాకోక చిలుకగా మారి అందరినీ ఆకర్షిస్తుంది. దీనిని మానవజీవితంలో మంచి దశ, చెడ్డ దశలుగా భావించవచ్చు. ఇదే విధముగా మానవజన్మలో భౌతిక సుఖము కొరకు చేయు ప్రయత్నములలో అవమానము, అదే సమయములో ఆధ్యాత్మిక సాధనలో విజయము సాధించినప్పుడు తోటివారిలో గౌరవమును మనము గమనించవచ్చు.

శరీర నిర్మాణ ధాతువులు

పంచభూతములైన గాలి, నీరు, ఆకాశము, భూమి, అగ్ని తత్వములకు అనుగుణంగా శరీర నిర్మాణము జరిగింది. గాలిని శరీరములో గాలి గాను, ఆకాశమును మెదడులో శూన్యముగాను, నీటిని శరీరంలోని నీరు గాను, అగ్నిని ఆకలనే జఠరాగ్ని గాను, భూమిని శరీరంలోని మట్టి గాను అనుకోవచ్చు. 

ఈవిధంగా నిర్మించబడిన మానవ శరీరము ప్రాణము పోయిన తర్వాత పంచ భూతములలో కలిసిపోతుంది. మనము జీవించే ఈ సమాజంలో శరీర పోషణ అంటే దానిని అందముగా, ఆరోగ్యముగా ఉంచుటకు ప్రతి శరీర భాగములకు ప్రత్యేక సూచనలతో సైన్స్ అభివృద్ధి చెందినది. దానిలో జుట్టు పోషణ, చర్మ పోషణ ప్రత్యేక శ్రద్ధతో నడుస్తాయి. జుట్టును అందముగా, ఆకర్షణగా ఉంచుకొనుట ఒక కళ. 

జుట్టు ఒత్తుగా పెరగాలంటే బాహ్య శత్రువైన పేను ఎదురుగా కాచుకుని ఉంటుంది. అది మనిషిని పెట్టే ఇబ్బంది ఏ మాత్రము తక్కువ కాదు. దాని నివారణకు ప్రయత్నము చేసి ఇబ్బందులు తొలగించుకోవాలి. వెనుకటి రోజుల్లో పొడవాటి జడ ఆకర్షణ కాగా, ఆధునిక కాలంలో పొట్టి జడ, వివిధ రకముల తలకట్ల వైపు ప్రజలు మళ్ళుతున్నారు. ప్రతి దేశమునకు ఆ దేశ పరిస్థితులను బట్టి జుట్టు రంగు ఉంటుంది.

జుట్టుతో పాటు గోళ్ళు, ఇతర శరీర భాగముల పోషణకై చేయు ఇతర ప్రయత్నములు, అందమైన ఆకృతి వగైరా దాని పరిరక్షణలో భాగమే. చర్మము శరీర రక్షణలో కవచముగా ఉపయోగపడుతుంది. సూర్యుని నుండి శక్తి గ్రహించుటకు తోడ్పడుతుంది. 

శరీర నిర్మాణము తరువాత ప్రాపంచిక జీవితములో శరీరపు రంగు, అందము మెరుగుపరుచుకోవడానికి మనవంతు ప్రయత్నం చేస్తూ, దాని కంటే ఉన్నతమైన మానసిక ఆనందము వైపు దృష్టిని మళ్లిస్తూ జీవితంలో సంతృప్తిగా గడపటం అవసరమని తెలుసుకుంటూ దానిని పొందడానికి సరైన ప్రయత్నం చేయాలి.

అవయవముల రక్షణ:
కొన్ని అవయవముల రక్షణ శరీర నిర్మాణంలోనే ఉంది. కంటికి కనురెప్పలు, చెవికి గులిమి, ముక్కుకి చీమిడి, గొంతుకి లాలాజలం లాంటివి.
                                                                                (సశేషం)

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.