Monday, April 4, 2022

పౌరుష ప్రదర్శన అనే తిరగబడుట లేక కాకాపట్టుట అనే విధేయత ప్రదర్శన - ఏది మంచిది?

ఈ రెండూ మనిషికి అవసరమే. తిరగబడుట కోపం వచ్చినప్పుడు అవతలివారితో వాదించినప్పుడు మనకు రావలసిన ప్రయోజనములు దొరకనప్పుడు లేదా మన చుట్టూ ఉన్న వారికి అన్యాయం జరిగినప్పుడు దానిని సరిదిద్దడం కోసం చేసే ప్రయత్నంగా భావించాలి.

ఈ ప్రయత్నంలో చట్టపరమైన చర్య చివరి భాగం అవుతుంది. ఈ తిరగబడే చర్యను అవతలవారు మెచ్చరు. దీనికి ఆదరణ తక్కువ. 

కాకాపట్టుట అను విధేయత చర్యకు ఆదరణ ఎక్కువ. దీనిని స్వాగతించేవారు కూడా ఎక్కువే. మన ప్రయోజనములు దెబ్బతిననంతవరకు దీనిలో ముందుకు పోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భములలో సొంత సొమ్ము వెచ్చించి విధేయత ప్రదర్శనలో భాగంగా తన సొంత పొలంలో పండినవని అబద్ధాలు చెబుతూ అవతలివారికి ఉచితంగా ఇవ్వవలసి ఉంటుంది. ఈ చర్యలలో పాల్గొనేవారికి పోటీ ఉంటుంది. ఒకచోట ఇద్దరికి పోటీ ఏర్పడినప్పుడు వారికి పడే మార్కులలో తేడా ఉండి, అవతల వారి ప్రయోజనం పొందుటకు చేసే ప్రదర్శన, వారి ఆలోచన కొందరిని సందేహంలో పడవేస్తుంది. తిరగబడే విధానము, విధేయత ప్రదర్శన విధానములను పోల్చుకొందాం. 

ఒక మనిషి క్రూరజంతువు పక్కన జాగ్రత్తగా నడిచే విధానం లేక సాధు జంతువు పక్కనే ఉండి నడిచే విధానంలో తేడా ఎలా ఉంటుందో అలా అవతల వారు వీరిద్దరిని పోల్చుకుంటారు. అనగా విధేయత ప్రదర్శించేవారికి వారు ఎక్కువగా భయపడరు. తిరగబడేవారికి భయపడతారు. 

విధేయత ప్రదర్శించే వ్యక్తికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. పోరాడే వ్యక్తికి ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. 

చరిత్ర పుట్టినప్పటి నుండి నిరంకుశ పాలనలో పోరాడేవ్యక్తి ఎక్కువ ఇబ్బందులు పడగా, విధేయత ప్రదర్శించే వ్యక్తి అధికారం, మన్ననలు పొంది, పదవీ వైభవములు, ధనలాభం పొందిన సందర్భాలు ఉన్నాయి. సగటు అధికారము కలిగిన వ్యక్తి విధేయత ప్రదర్శించే వ్యక్తులకు మేలు చేస్తాడని విడిగా చెప్పనవసరం లేదు. 

విజయం సాధించడంలో తిరగబడే మనస్తత్వము కలిగిన వ్యక్తులకు ఎక్కువ ఆటంకములు వస్తాయి. విధేయత ప్రదర్శించే వ్యక్తులకు ప్రదర్శకులలో పోటీ ఉంటుంది. విజయం ఎవరిని వరిస్తుందో విధేయత ప్రదర్శకుల సమర్ధత మీద ఆధారపడి ఉంటుంది.

చెట్టు ముందా, విత్తనం ముందా అను వాదముతో పోల్చదగిన విధముగా పౌరుష ప్రదర్శన మరియు విధేయత ప్రదర్శన ఉంటుంది. మనముందున్న నైతిక విలువలు మారిపోతున్న సందర్భమునకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని ప్రవర్తించేవారు విజయసాధనలో ముందుంటారనటంలో సందేహం లేదు.

కొసమెరుపు: జీవితంలో పౌరుషము, విధేయత ప్రదర్శించుట రెండు ముఖ్యమే.  విజయం సాధించేందుకు అవసరమైన సందర్భమును బట్టి పౌరుషము, విధేయత వాడినవారికి ఎప్పుడూ విజయమే. దీనిని సర్దుబాటు మనస్తత్వము లేక సమతుల్య జీవనంగా భావిద్దాం. 

గమనిక: ఈ బ్లాగులోని కొన్ని ఉపయోగపడే వ్యాసాలతో 'గృహిణుల పల్లకి' అనే పుస్తకమును ముద్రించుట జరిగింది. కావలసినవారు కామెంట్ సెక్షనులో తెలియచేయగలరు.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...