Wednesday, March 2, 2022

కృతజ్ఞత

కృతజ్ఞత అనగా మనకు ఎవరైనా సహాయం చేస్తే వారి సహాయమునకు గౌరవం వ్యక్తం చేయడం. ఇది మూడు రకాలుగా ఉంటుంది.

మొదటిది హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేయుట.  రెండవది అవకాశం వచ్చినప్పుడు తిరిగి సహాయం చేయుట. మూడవది మనకు సహాయం చేసినవారికి మన మనసులో మంచి స్థానం కల్పించుట.

కృతజ్ఞత జంతువులలో కూడా ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా చిన్నప్పుడు చదివిన ఒక కథను జ్ఞాపకం చేసుకుందాం. ఒక రాజు దగ్గర ఒక బానిస ఉండేవాడు. అతను ఒక రోజు అడవిలోకి పారిపోయాడు. రాజభటులు అతనిని తిరిగి పట్టుకుని రాజు ముందు నిలబెట్టారు. రాజు అతనికి శిక్షగా అడవిలోని సింహానికి ఆహారంగా వేయమని తీర్పు ఇచ్చాడు. అడవి నుండి ఒక సింహాన్ని తెచ్చి, బానిసను దానికి ఆహారంగా వేశారు. ఆకలితో ఉన్న సింహం అతడిని చంపకుండా, అతడి ముందు ప్రేమగా, కృతజ్ఞతగా నిలబడింది. దీనికి కారణం ఏమిటని రాజు విచారించగా తెలిసిన విషయం ఏమిటంటే, అడవిలోనికి పారిపోయిన బానిస గాయపడిన సింహానికి చికిత్స చేశాడని, అందుకు కృతజ్ఞతగా సింహం అతనిని చంపలేదని గ్రహించి, బానిసను స్వేచ్ఛగా వదిలివేశాడు.

ఇది పూర్వకాలంలో జంతువులకు సంబంధించిన కథ. ఈకాలంలో అలాంటి కృతజ్ఞత అవసరము కనుమరుగయ్యింది.

ఈమధ్య కాలంలో కోరికలతో మ్రొక్కులు మొక్కినవారు దేవుని దర్శనం చేసుకొని, వారి కోరికలు తీరిన తర్వాత, ఆదేవాలయమునకు మరలా వెళ్ళి, కృతజ్ఞతలు తెలుపుకునే పద్ధతి వాడుకలోకి వచ్చింది. మానవులలో కృతజ్ఞత సంప్రదాయము ఎక్కువమంది పాటించుట క్షీణించిన మానవ సంబంధాలు మరియు యాంత్రిక జీవితం ప్రభావము తగ్గుటకు తోడ్పడటం హర్షించదగిన పరిణామం.

కొందరు అధికారంలో ఉన్నవారు కొన్ని వర్గాలకు చేసే సహాయమునకు స్పందించిన ఆవర్గాల ప్రజలు, ఆనాయకులకు కృతజ్ఞతగా సన్మానం మరియు ఇతర కార్యక్రమములు చేయుట ఒక భాగంగా భావించవచ్చు.

కృతజ్ఞత జన్మనిచ్చిన తల్లిదండ్రులతో మొదలవుతుంది. తర్వాత విద్య నేర్పిన గురువుని మర్చిపోరాదు. తల్లిదండ్రులపై కృతజ్ఞత లేకపోయినా కృతఘ్నత ఉండరాదు. కానీ నేటి సమాజ పోకడ, పరిస్థితుల ప్రభావము వలన వ్యసనపరులైన పిల్లల నుండి కృతజ్ఞతను ఆశించలేని పరిస్థితులు ఉన్నాయి. పెద్దవారి పట్ల హింస, నిర్లక్ష్యం, ఆర్ధిక హింస వారిని వృద్ధాశ్రమం వైపు నడిపిస్తూ, వృద్ధాశ్రమాల పెరుగుదల వాస్తవ పరిస్థితులను తెలియజేస్తుంది.

విద్య నేర్పిన గురువు విషయానికి వస్తే వెనుకటి రోజులలో జమీందారులు, రాజులు సంపన్నులైన గృహస్థుల ఆర్థిక సహాయంతో భోజనం,  వసతి ఉచితంగా కల్పించి,  విద్య నేర్పించేవారు. ఈనాడు విద్యా తదితర విషయములకు రుసుములు వసూలు చేయటం వలన అది ఒక వృత్తిగా మారిపోయి, గురు శిష్య సంబంధంలో ఆత్మీయతా భావం, గౌరవ భావం తగ్గినవి. ఇది గురువుల జీవనోపాధియై, వ్యాపారంగా మారింది. డబ్బు తీసుకుని నేర్పుతున్నారు కనుక ఆయనకు నేను కృతజ్ఞత చెప్పేది ఏమిటి అనే ఆలోచన వస్తుంది.

కానీ నిదానంగా ఆలోచిస్తే, మన భవిష్యత్ జీవితంలో సంభవించే అనేక మార్పులకు బీజం పడేది విద్యాభ్యాసంలోనే కనుక కృతజ్ఞత ఉండటం లేక గౌరవించడం సబబుగా అనిపిస్తుంది. విద్యాభ్యాసం అయిన తర్వాత ఉద్యోగం వేటలో అనేకమంది యొక్క సహాయం అవసరమవుతుంది.

మారుతున్న కాలంలో అనేక ఆర్థిక ప్రయోజనములతో ముడిపడిన విషయములు మధ్యవర్తుల ద్వారా పరిష్కారం జరిగినప్పుడు, అందరికీ ఆర్థిక ప్రయోజనం ఉంటుంది, కనుక కృతజ్ఞతలు తెలియజేసే అవసరం ఉండకపోవచ్చు.

ప్రతి వారికి జీవితంలో కొన్ని సందర్భములలో కనపడని దైవసహాయం, కనపడే వ్యక్తుల సహాయంతో మేలు జరుగుతుంది. అలాంటి సందర్భంలో చిరునవ్వుతో కూడిన కృతజ్ఞత అవసరం ఏర్పడుతుంది. చిరునవ్వుతో కూడిన హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పగలిగిన మనిషి ఒత్తిడులను జయించి, ఎక్కువకాలం జీవిస్తారని చెప్పవచ్చు.

కృతజ్ఞతాభావ వృద్ధిరస్తు అని అనుకుంటూ, దాని అవసరాన్ని గుర్తిద్దాం. అది సమాజ జీవనంలో ఒక భాగంగా చేసుకుందాం.

కర్తవ్యం: దేవుడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు అని నమ్మితే వారానికి రెండు గంటలు కేటాయించుకుని, మీకంటే తక్కువస్థితిలో ఉన్నవారికి సేవ, సహాయం స్వయంగా, గాని సేవా సంస్థల ద్వారా గాని  చేసి, దానిలో ఆనందం పొందండి.

శుభమస్తు!

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...