మన మనసులోని కోరికలు తీరాలని భగవంతుని కోరుకునే ప్రయత్నమును ప్రార్ధన అనుకోవచ్చు. ప్రార్ధన కూడా పూజలో భాగమే. మన మత విశ్వాసాల ప్రకారం పూజలు ఈ విధంగా ఉంటాయి.
దేవుని స్తోత్రములు, వ్రతములు, అష్టోత్తర సహస్రనామాలు, అభిషేకం, దీక్షలు, మొక్కులు, నిత్య పారాయణ గ్రంథములు, ఇతరములు ఉంటాయి. మనకు ఎవరన్నా బాధ కలిగించి, మనసు తీవ్రంగా బాధపడినప్పుడు ఆ బాధతో అవతలి వ్యక్తికి అపకారం జరగాలని కోరుకోవటం కూడా ప్రార్థన ప్రక్రియలో సహజ భాగమే. బలహీనుల ఆక్రోశం బలవంతుల ప్రార్థన కన్నా గొప్పదని మర్చిపోవద్దు. న్యూటన్ లా ఆఫ్ గ్రావిటీ మూడవ సిద్ధాంతము ప్రకారం బలహీనులకు అపకారం చేసినవారికి ప్రకృతి ధర్మం ద్వారా రిటర్న్ గిఫ్ట్ అందుతుంది.
మానవ జీవితంలో మనకు వ్యాపార, వృత్తిపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు లేదా కొంత మేలు జరగాల్సినప్పుడు కొంత మంది అధికారులను కలిసి ప్రార్ధించటము కూడా ప్రార్థనలో భాగమే. ప్రార్థనలో బలం ఉంటుంది.
ప్రార్థించేటప్పుడు ఆర్తి ఉండాలి. మనసు ఏకాగ్రతతో ప్రారంభించినప్పుడు దానికి బలమైన శబ్ద తరంగాలు తోడై, సబ్ కాన్షియస్ మైండ్ యొక్క శక్తి ద్వారా మనకు కనపడని భగవంతుడి పాదాల మీద పెడతాము. అయితే ఆచరణ సాధ్యమైన కోర్కెలు ప్రార్థించినప్పుడు తీరవచ్చు, తీరకపోవచ్చు. ఇందుకు ఉదాహరణగా రెండు విషయాలు చెప్పుకుందాం. ఒక లాటరీ టికెట్ కొన్న వ్యక్తి మొదటి బహుమతికి ఆశపడి కొన్నప్పటికీ, ఎంతో మంది ఆశావహులు ప్రార్థించినప్పటికీ బహుమతి ఒక్కరికే వస్తుంది. అలాగే అత్యున్నత రాజకీయ పదవులు ఎంత ప్రార్థించినా రాకపోవచ్చు. దీనిని బట్టి కొన్ని పరిమితులకు లోబడి ప్రార్థనలు ఫలిస్తాయి అని అర్థమవుతుంది.
ఆశలు వదులుకున్న తీవ్ర వ్యాధి పీడితుల కొరకై, ఆ వ్యక్తి సమీప బంధువులు ఆరాటము, తపన, ఆర్తితో చేసిన బలమైన ప్రార్థనలు ఫలించి, మంచి ఫలితం వచ్చినప్పుడు ఆ విషయము వైద్య చరిత్రలో అద్భుతంగా మిగిలిపోయి, చూసిన వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది.
రెండు కళ్ళ మధ్య గల జ్ఞాననేత్రంపై ఏకాగ్రత పెట్టి మనస్పూర్తిగా చేసే ప్రార్థనలు ఫలిస్తాయి అని కొందరు నమ్ముతారు. ఏమాత్రము స్వార్థం లేకుండా మన కొరకు కాక, మానవ శ్రేయస్సు కొరకు చేయు ప్రార్థనలు ఫలిస్తాయి అని మరికొందరు నమ్ముతారు.
దేని కొరకు ప్రార్థించినా, రాత్రి పడుకోబోయేముందు ప్రార్థన చేయుట చాలా మంచిది. ఈ ప్రార్ధన వారి ఆలోచనలను బట్టి ఎవరికి వారు తయారు చేసుకోవచ్చు. పగలంతా అలసిపోయి ఆలోచనలు చేసే మనస్సును ప్రక్కకు మరలించి, ప్రశాంతత మరియు మనశ్శాంతి కలిగించి, రాత్రి ప్రశాంతంగా నిద్రపోవటానికి ఇది తోడ్పడుతుంది. దీనిని ఆరోగ్యపరమైన ఆలోచనగా భావించవచ్చు.
భగవంతుడు మనకు ఇవ్వాల్సిందే ఇస్తాడు అని నమ్మేవారు ప్రార్ధనను వ్యక్తిగతంగా కానీ, సామూహికంగా కానీ స్వార్ధపరమైన ఆలోచనలు తగ్గించుకుని, మనచుట్టూ ఉన్న సమాజంలో అందరికీ మంచి జరగాలని ప్రార్థించినప్పుడు మంచి ఫలితం వస్తుందని నేను నమ్ముతాను.
కొద్దిసేపు దైవమును ప్రక్కకు పెట్టి, శారీరక, మానసిక విశ్రాంతిలో భాగంగా రాత్రి ప్రార్థన చేయడం జీవితంలో భాగం కావాలి. దీనివలన దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయి. అవి అందుకోండి.
పేపర్ వార్త: ఒక ఊరిలో ఒక దేవాలయం ముందు ఉండే బిచ్చగాడు ఆ గుడికి లక్ష చొప్పున రెండుసార్లు విరాళం ఇచ్చాడు. అతని దానం ముందు మన ప్రార్ధన చాలా చిన్నది.
No comments:
Post a Comment