జాగ్రత్త అంటే అన్ని వేళలా అప్రమత్తంగా ఉండటం. దీని అవసరం అన్ని వేళల్లో, అనేక సందర్భాల్లో వస్తుంది.
జాగ్రత్తలు ఆరోగ్యపరంగా, సాంఘికపరంగా, రక్షణ పరంగా తీసుకోవాలి. మన మత విశ్వాసపరంగా తీసుకోవలసిన కొన్ని నియమాలు సూక్ష్మంగా ఆలోచిస్తే జాగ్రత్తలే. వాటిలో ఎక్కువ ఆరోగ్యపరంగా మనకు సహాయంగా ఉంటాయి.
ఉదాహరణకు బయటకు వెళ్లి వచ్చిన వారు కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలని, పాదరక్షలు ఇంటి బయట విడవాలని, ధరించిన బట్టలు మార్చుకోవాలని మొదలైన విషయాలు పాటించినప్పుడు ఆరోగ్యపరంగా మేలు చేస్తాయి. కరోనా జాగ్రత్తలలో ఇవి ముఖ్యమైనవని మనకు తెలిసిందే. ఈవిషయము కొన్ని ఆస్పత్రులలో, ఆఫీసులలో చెప్పులు బయట విడవాలని బోర్డులు కూడా చూస్తాం.
కరోనా రాకముందు బద్దకముతో పాటించని నియమాలు, కాళ్ళు కడుగుకోనకుండా లోపలికి వెళ్ళుట నమస్కారమునకు బదులు కరచాలనము చేయుట ఆధునిక సంస్కృతిలో భాగమై, నిజజీవితంలో పాటించవలసినవిగా మారి, తాత్కాలికంగా నిషేధింపబడినవి. మన ఇంటి నుండి వెళ్లేవారికి జాగ్రత్త అని చెప్తాం. అధికార పెద్దలు రోడ్డుమీద ప్రయాణించేటప్పుడు తీసుకునే చర్యలు రక్షణ జాగ్రత్తగా పరిగణించాలి. అలాగే కొందరు అధికారులు తమ విధి నిర్వహణలో పాటించే నియమ నిబంధనలు కూడా జాగ్రత్తల క్రిందకే వస్తాయి.
ఇన్ని జాగ్రత్తల మధ్య మనం తెలిసో, తెలియకో పాటించే నియమాలు అప్పుడప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అన్ని జాగ్రత్తలకన్నా ముఖ్యమైంది శరీర జాగ్రత్త. మన జీవితంలో ఉపయోగించే అనేక యంత్ర పరికరములు వాడునపుడు పాటించే జాగ్రత్తలు మనలను ప్రమాదం నుండి కాపాడతాయి.
ఈవిషయంలో చిన్నకథ జ్ఞాపకం వస్తోంది. ఆదిశంకరాచార్యులవారు దేశపర్యటన సందర్భంలో వాద, ప్రతివాదములు చేసి విజయం సాధించేవారు. ఒకానొక సందర్భంలో ఒక పండితుని ఓడించినప్పుడు ఆయనలో అర్ధభాగమైన భార్య తనని కూడా ఓడిస్తేనే గెలిచినట్లు అని చెప్పింది. ఆవిడ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చుటకు తన అనుభవం చాలదని గ్రహించిన శంకరాచార్యులవారు కొంత గడువు కోరారు.
తర్వాత చనిపోయిన ఒక రాజుగారి శరీరంలోనికి తన పరకాయ విద్య ద్వారా శంకరాచార్య ప్రవేశించాడు. తన శరీరమును భద్రముగా చూడమని తన శిష్యులకు చెప్పినాడు. రాజుగారి భార్య తన భర్త శరీరంలో ఒక మహానుభావుడు ఉన్నాడని గ్రహించి, రాజ్యంలోని మృత శరీరములన్నీ దహనం చేయవలసిందిగా భటులకు చెప్పింది. ఈ విషయం గమనించిన శిష్యులు ఎంత కాలమునకు తిరిగిరాని గురువుగారిని వెతుక్కుంటూ వెళ్ళి, రాజుగారి అంతఃపురం బయట ఆయన కర్తవ్యజాగ్రత్తలు నర్మగర్భంగా చెప్పుట ఒక విశేషం. శంకరాచార్య తన శరీరంలోనికి తిరిగి ప్రవేశించి పండితుని భార్య సందేహము తీర్చి వాదములో విజయం సాధించుట కొసమెరుపు.
నీతి: జీవితమే జాగ్రత్త. జీవితకాలపు జాగ్రత్తలు పాటించి జీవితం ఆనందంగా గడుపుట ఆశయం కావాలని కోరుకుందాం.
అంకితం: భారతీయ సాహిత్యం అపార విజ్ఞాన భాండాగారం. దానిని భద్రపరిచి, ముందు తరాలవారికి అందించే ప్రయత్నం చేయుచున్న మేధావులకు అంకితం.
No comments:
Post a Comment