జీవితంలో విజయం సాధించాలని ప్రతివారూ కోరుకుంటారు. దానికి కృషి ముఖ్యము. కృషి చేయుట అనగా ఆశయ సాధనలో సాధన దిశగా పని చేయు విధానము. ప్రతివారూ తమదైన శైలిలో ఆపని చేస్తుంటారు.
కొందరు ఆ పని చేసే విధానంలో వినూత్నరీతిలోఆలోచించి చేసేపని కొత్తగా ఆవిష్కరణలకు దారితీస్తుంది. వాటి వలన శారీరక శ్రమ తగ్గి పనులు త్వరగా పూర్తి అవుతాయి. విశ్రాంతి దొరికి మానసిక శ్రమ కూడా తగ్గుతుంది. నిత్యజీవితంలో మనకు అవసరమైన అన్ని పనులు యంత్రముల ద్వారా జరిగినప్పుడు సమయము, శ్రమ తగ్గి సంతోషం కలుగుతుంది. ఈ పని ఒడుపుకు ఏ విధమైన దగ్గరదార్లు గాని, అడ్డదారులు గాని లేవు అని భావించాలి.
వంట గదిలో మనకు ఉపయోగపడే, అందుబాటులోకి వచ్చిన అనేక ఉపకరణాలను గురించి చెప్పుకుందాము. కూరగాయలు, ఉల్లిపాయలు తరుగుటకు వాడే ఉపకరణములు, వంటను సులువు చేసే స్టవ్వులు, పొదులు, పచ్చళ్లు చేయటానికి ఉపయోగించే మిక్సీ, గ్రైండర్ల వంటివాటిని వీటిలో చెప్పుకోవచ్చు.
కొన్ని దేవాలయాలలో భక్తుల కొరకు తయారు చేయుటకు వినియోగించే లడ్డూ ప్రసాదముల తయారీ యంత్రం కూడా ఆ కోవలోకి వచ్చును. వ్యవసాయ రంగంలో పొలము దున్నుటకు వినియోగించే కాడి ఎద్దులకు బదులు ఉపయోగపడే ట్రాక్టర్లు, విత్తనం నాటు యంత్రము, పంటలు కోయు యంత్రము, ఆధునిక రవాణా సాధనములు, ఇతర యంత్రములు వాడుటలో మానవ శ్రమ తగ్గి, పరోక్షంగా ఉపాధి అవకాశాలు తగ్గినవి. ఈనాడు ప్రతి రంగంలో పని సౌలభ్యమునకు యంత్రములు వచ్చినవి.
ఇళ్ల నిర్మాణ రంగంలో వెనుకటి రోజులలో భవన నిర్మాణ సమయములో కింద నుండి పైఅంతస్తుకు ఇసుక, ఇతర కట్టడము సామాన్లు బొచ్చలతో పైకి వెళ్ళుటకు పడిన అధిక శ్రమ, ఇప్పుడు ఆస్థలం వద్ద ఏర్పాటు చేసిన లిఫ్టుల ద్వారా పైకి చేర్చబడుతున్నది. చెడిపోయి లేక ప్రమాదమునకు గురి అయిన లేదా రవాణా సమయంలో ఆగిన వాహనములని క్రేన్ ద్వారా తొలగించుట, హోటల్లో తిన్న ప్లేట్లు తీయుటకు వాడే ట్రాలీలు, దేవాలయంలో జరిగే అన్నదానమునకు ప్రతిదీ పళ్లెంలో తీసుకెళ్లి వడ్డించే విధానమునకు బదులుగా ట్రాలీలో చేరవేసిన అన్ని పదార్థములను వడ్డించే సులభతరమైన విధానము, తుఫాను, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు చెట్లు, చెట్ల కొమ్మలు ట్రాఫిక్ కి అడ్డం పడినప్పుడు తొలగించుటకు వాడే పాత రంపముల కంటే ఇప్పుడు వాడే యాంత్రిక రంపముల విధానము శ్రమ సమయము తగ్గించేవే.
కొన్ని ఏళ్ళ క్రితం ఒక ఊరిలో ఒక ఆర్థిక సంస్థకు సంబంధించిన బరువుగల బీరువాలను తరలించడంలో నేల మీద గల ఒక భవనం నుండి కొంత దూరంలో గల మొదటి అంతస్తు భవనంలోకి మార్చుటకు చేసిన ఈ ప్రక్రియను గూర్చి చెప్పుకుందాం. ఈ భవనము నుండి ఆ భవనం మెట్ల వరకు మొదట బీరువాలు చేర్చబడి, మెట్లపై రెండు దుంగలు పెట్టి దానిపై బలమైన తాడు కట్టి బలమైన బీరువాలను పైకి లాగుట ద్వారా జరిగిన పని సులువు విధానము. టింబర్ డిపో వాళ్ళకి బలమైన దుంగలు మార్చడం నిత్యకృత్యమే.
మానవ బాహ్య జీవితంలో మార్పు వచ్చుటకు ఇన్ని యంత్రములు అందుబాటులోకి వచ్చిన తరువాత మనను పుట్టించిన దైవమును కనుగొనుటలో యంత్ర సహాయం ఏమీ దొరకదా అని అనుకోవచ్చు. ఎక్కడున్నాడో, ఎప్పుడు కనపడతాడో తెలియని దైవమును వెతుకుట ఎట్లా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇన్ని విషయములు కనుగొనుటకు తోడ్పడిన మేధావితనం, దైవము వెతుకులాటలో ఎంతవరకు తోడ్పడుతుందని ఆలోచిస్తే, భగవంతుని రూపమునకు నిర్వచనం ఇదమిత్తముగా లేదు. మన చుట్టూ ఉన్న వ్యామోహములను దాటి, మనసు ఎంత వరకూ బయట పడుతుందో తెలియదు. అంతా ఊహల్లోనే ఉంటుంది. సాక్షాత్తూ దైవానుభూతి పొందిన వారు కూడా మనకు చెప్పినా ఎంతవరకు అర్థం అవుతుందో తెలియదు. అప్పుడు మనకు ఒక గురువు అవసరం ఏర్పడి, ఆయన కోసం వెతుకుతాము. ఎవరన్నా వైరాగ్యం ఎక్కువై సన్యాసి అయితే అతనిని బాధ్యతల నుండి పారిపోయినట్లు భావిస్తారు.
జపము కౌంటింగ్ కొరకు స్టాప్వాచ్ లాంటివి ఉన్నాయని మనకు తెలుసు. బలమైన కోరిక లేదా కృషియే ఆధారం అనుకోవాలి. జీవితములో దైవానుభూతికి యంత్రములు సహాయపడాలి అని కోరుకునేవారికి మంచి ఆవిష్కరణ రావాలని కోరుకుందాము. భగవంతుని అన్వేషణ మార్గం రాజబాట కాదు. జీవితం రోడ్డు మీద ఒక ప్రయాణం భావిస్తే, మనని ప్రలోభపెట్టే విషయములు స్పీడ్ బ్రేకర్ లాంటివే. అవి విశ్వాస పరీక్షలుగా భావించాలి. దైవాన్వేషణ ప్రయాణము నున్నటి సిమెంట్ రోడ్ లాగా ఉండకపోవచ్చు. మధ్యమధ్యగా ముళ్ళు, గోతులు ఉంటాయి. వాటిని మన దుర్గుణాల బలమైన ప్రభావంగా భావించి, సాఫీగా కనబడే మార్గము మనము చేసే మంచి ఆలోచనలు, మంచి పనుల ప్రభావము సద్గుణాల బలంగా భావించాలి. ఎదుటి వ్యక్తిలో దైవమును చూడగలిగిన వ్యక్తి పిచ్చివానిగా ముద్రబడి తట్టుకోగలిగితే, తప్పక దైవానుభూతి ద్వారా ఆనందము పొందుతాడు.
మానవజన్మ ఎత్తినవారికి తన మీద ఆధారపడ్డవారి పోషణతో పాటు వారి మంచి, చెడులను తమకు నచ్చిన అందుబాటులో ఉన్న న్యాయమార్గం ద్వారా సంపాదించిన ఆదాయంతో పోషించుట కనీస కర్తవ్యమై ఉన్నది. అలాగే పరిమితి మించని వైరాగ్యంతో సమతుల్య జీవన విధానంతో సోమరితనం దగ్గరికి రానీయరాదు. ఎడారిలో కనపడే ఎండమావులను నీటి వనరులుగా భావించి ప్రలోభములకై పరిగెత్తరాదు. సోమరితనము, బద్ధకములను శత్రువులుగా భావించకపోతే మనలో చురుకుదనం ఉండదు. మన జీవన విధానంలో భావోద్వేగములకు ఎక్కువ మోతాదులో స్థానం ఇవ్వరాదు. స్వయం పరిశీలన రోజూ రాత్రిపూట ఐదు నిమిషాలు చేసుకుంటే దిశానిర్దేశం చేస్తుంది. మనకు నచ్చిన జ్ఞానమార్గము ఏదైనా మనసుకు, శరీరమునకు క్రమశిక్షణ ఇస్తుంది. వేదాంతము, వైరాగ్యము ఒక మోతాదు మించితే పిచ్చివారిగా కొందరు భావిస్తారు.
దైవ స్వరూపులైన కబీరు, రమణ మహర్షి, శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి, అక్కలకోట మహారాజు, సాయిబాబా, వెంకయ్య స్వామి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజులు - వీరు ప్రదర్శించిన మహిమలు, ప్రబోధముల ద్వారా భక్తిభావమును ప్రచారము చేసినారు. వారి జీవితచరిత్రలు పారాయణము చేసి ఫలితములు పొందినవారు ఎందరో. పూర్వజన్మల నుండి వచ్చిన సాధన, సంస్కారము, పుణ్యము వలన కొందరికి ఈజన్మలో దైవానుభూతి కలిగిందని నమ్ముతారు.
ప్రభుత్వ పన్నులు కట్టిన తర్వాత మిగులు ఆదాయంలో కొంతశాతం అవసరమైనవారికి అందిస్తే దాని శుభ ఫలితం మనని వెన్నంటి ఉంటుందని చాలామంది నమ్ముతారు. దినచర్యలో భాగముగా రాత్రి పాపకార్యముల పరిశీలన ద్వారా, పాపపు పనులు తగ్గిస్తే తద్వారా మన జీవిత ఆదాయ ఖర్చుల పద్దులో ఖర్చు పద్దు తగ్గుతుంది. దీని వలన దైవచింతన మార్గములో అడ్డంకులు తొలగును. పుణ్య కార్యముల వలన ఆదాయం కొద్దిగా పెరిగి, మేలు జరుగునని పాపపుణ్యములపై అవగాహన కలిగిన వారి భావన.
నమ్మకం విజయం కలిగిస్తే, అపనమ్మకం విజయానికి అడ్డంకిగా ఉంటుంది. మండలదీక్షకు సమానముగా పారాయణ గ్రంథములు ఫలితములు ఇచ్చును అని నమ్మితే పారాయణ చేసి, భౌతిక సౌఖ్య ఫలితములు పొందండి. ప్రతి పారాయణ తర్వాత నిర్ణీతసంఖ్యలో అన్నదానము చేయవలసి ఉంటే, దానిని మర్చిపోవద్దు. ఒకేరోజు ఒకే ఆసనం మీద కూర్చుని 4 గంటలు పట్టే హనుమాన్ చాలీసా 108 పర్యాయములు చదివి కార్యసిద్ధి పొందినవారు ఉన్నారు. నమ్మకమే బలము మరియు విజయ సాధనకు ఆయుధం అని గ్రహించండి.
ఏదిఏమైనా భగవంతుని అనుభూతి ద్వారా లౌకిక ఆనందము పొందగోరువారు మనసులో గల సంకల్పమును దృఢముగా చేసుకొని, నచ్చిన జ్ఞానమార్గము ద్వారా ప్రయత్నించితే విజయము సాధ్యమే. ఈ దృఢ సంకల్పము ఎలా ఉండాలంటే పర్వతారోహకులు పర్వతము ఎక్కుటకు చేయు కఠిన శ్రమకు తగ్గని మానసిక శ్రమ అవసరము. ఒకసారి మార్గం ఎంచుకున్న తర్వాత అనవసరమైన సంశయము లేదా సందేహంతో వెనుకకు మరలరాదు. శరీరమును నడిపించే మనస్సు కోరికల పుట్ట. ఆకోరికలలో భగవంతుని అనుభూతికై ఆరాటం ఒక బలమైన ఆశగా ఉంటే, విజయమునకు మార్గం సులభము. మన ఈప్రయత్నము ప్రపంచంలోని పాలించే సిద్ధపురుషులు ఆశీర్వదించి సరైన సమయంలో మార్గదర్శనం చేసినపుడు, విజయం సాధ్యమవుతుంది.
శుభమస్తు!
No comments:
Post a Comment