Saturday, July 3, 2021

ఉమ్మడి కుటుంబాలు- ఆస్తి పంపకాలు

ఉమ్మడి కుటుంబములు కనుమరుగు అయినప్పటికీ ఆస్తి పంపకాల దగ్గర కలతలు వచ్చే సందర్భాలు ఎన్నో. దానిని ఈనాడు కోర్టులో నలుగుతున్న సివిల్ క్రిమినల్ కేసులు తెలియజేస్తాయి. 

ఒక మనిషి చనిపోయినప్పుడు అతని పేరిట ఉన్న ఆస్తుల పంపకము, తగాదాలు చనిపోయిన వ్యక్తి అంతిమ సంస్కారాలపై ప్రభావం చూపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు వారసులు వారిని రెచ్చగొట్టే బీరకాయ పీచు బంధువులు దీనికి కారణం అవుతారు. దీనికి చిన్న ఉదాహరణ- ఒక ఆయనకి ఇద్దరు కొడుకులు. తండ్రికి అవసరమని ఒక కొడుకు ఫ్యాను కొన్నాడు. బహుశా అప్పట్లో 600 రూపాయలు చేస్తుందేమో. తండ్రి పోయిన తర్వాత ఫ్యాను కొనుటలో సహాయం చేయని కొడుకు ఫ్యాన్ లో వాటా అడగటం కొంత ఆశ్చర్యం కలగజేస్తుంది. కొడుకు కొనని ఫ్యాను ఆ ఫ్యాను తండ్రి ఆస్తిలో భాగం అయింది కనుక వాటి కోసం ఆశ పడ్డాడో ఏమో తెలియదు కానీ చట్టాలు పూర్తిగా తెలియని నాలాంటివారు ఆ ఫ్యాను కొనిచ్చిన అతనికి మాత్రమే చెందుతుందని నమ్ముతారు. చివరిగా ఈ విషయం ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే.

ఇంకొక సంఘటనలో ఒక ముసలావిడ తన కొడుకు చనిపోయినప్పుడు వచ్చిన ఆస్తి ముగ్గురు కొడుకులకు వారి పిల్లల్ని బట్టి పంచాలి అంటే ఇద్దరు పిల్లలు ఉంటే రెండు వాటాలు, ఒక పిల్ల లేక  పిల్లవాడు ఉంటే ఒక వాటా పంచాలని అభిప్రాయపడింది. నాకు తెలిసిన దాని ప్రకారం జీవించి ఉన్న కొడుకులకు, జీవించిలేని కొడుకుల పిల్లలకు సమాన వాటా అని చెప్తారు. ఈ విషయం ఎలా పరిష్కరించుకున్నారో నాకు తెలియదు.

ఒకమారు రైల్లో ప్రయాణం చేయుచుండగా ఒక గృహిణి భర్తకు అత్తవారింటి ఆస్తిపై చట్టం ముందు నిలబడని వితండ సలహా ఇవ్వడం గమనించాను. కనుక గృహిణులు మీ భర్తలకు ఆస్తి పంపకంపై తగిన న్యాయమైన సలహాలు ఇవ్వండి. ఆ కుటుంబ యజమాని స్థానంలో మీ కుటుంబాన్ని ఊహించుకుని తగిన సలహా ఇవ్వండి.

ఇంకొక రకము ఆస్తి పంపకం, ఇది ఖర్చుల పంపకం. బతికి ఉన్నవారు అనుభవించే విచిత్ర పరిస్థితి. ఉమ్మడి కుటుంబాలు అంటే ప్రత్యేకంగా లేకపోయిన చాలామంది ఇళ్లల్లో భార్య, భర్త చనిపోయిన ఆడ, మగవారు మరియు అనేక కారణములతో పెళ్లి కానివారు, ఆడ, మగ ఆస్తిపరులు ఉంటారు. అనుకోని పెద్ద ఖర్చు వచ్చినప్పుడు ఉదాహరణకు కాలేజీ ఫీజు పెద్ద మొత్తంలో కట్టాల్సి వచ్చినప్పుడు, కాలేజీకి వెళ్లే పిల్లలకు ద్విచక్ర వాహనములు కొనాల్సి వచ్చినప్పుడు, పెద్ద పిల్లలకు నగలు కొనాల్సి వచ్చినప్పుడు, మరియు ఇతర ఖర్చులు వచ్చినప్పుడు తెలివిగా భార్యాభర్తలు తమ దగ్గర డబ్బు ఉన్నప్పటికీ తమ ఇంట్లో గల ఒంటరి ఆస్తిపరులైన వారి వైపు వేలు చూపిస్తారు. వారికి తమ పిల్లలపై గల ఆప్యాయతను పరీక్షించుటకో, వారి దగ్గర డబ్బు వసూలు చేయుటకో ఈవిధంగా చేస్తారు. ఈ కాలం ఆప్యాయతలు ఎలాంటివి అంటే వారి వద్ద అనేక సహాయములు పొందిన ఈపిల్లలు వారికి రోగములు కష్టములు వచ్చినప్పుడు వారిని పట్టించుకునే సమయం ఉండదు. చివరికి వారు చనిపోయిన సందర్భంలో చివరి చూపుకు కూడా రాలేకపోవచ్చు. ఈ ఒంటరి పెద్దలు డబ్బు సర్దాల్సి వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడతారో వారి మనసుకు మాత్రమే తెలుసు. ఉన్న డబ్బు ఖర్చు పెట్టుకుంటూ, వారికి నిజముగా అవసరం వస్తే వారి అవసరం కొరకు సహాయం అందని సందర్భాలు కొన్ని ఉంటాయి. ఈ కాలం పరిస్థితి ఏంటంటే మానవ సహాయం కావాల్సి ఉన్నా డబ్బే రక్షణ, డబ్బే మీ అవసరాలు తీరుస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండండి.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.