హాస్యము మనలను నవ్వించి బాధలనుండి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. హాస్యంతో కూడిన నవ్వుల మాటలు మనము ఎక్కువగా ఇష్టపడతాము.
పూర్వం రాజులు ఆస్థానములలో విదూషకులను ప్రత్యేకముగా నవ్వించుటకు ఉంచుకునేవారు. చార్లీ చాప్లిన్ అను విదేశీయుడి పేరు హాస్య ప్రముఖుడిగా అందరికీ గుర్తు. అలాగే అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనే విదూషకుడి పేరు అందరికీ పరిచయమే. పాత తరం సినిమాల ద్వారా పరిచయమైన హాస్య నాయకులు స్వర్గీయ రేలంగి, అల్లు రామలింగయ్య తెలుగువారి హృదయములలో చిరస్మరణీయులు, ఇప్పటికీ జీవించి ఉన్న హాస్య చక్రవర్తులు వారి స్థానమును హాస్య ప్రపంచములో పదిలపరుచుకున్నారు.
సైన్స్ ప్రకారము లాఫింగ్ గ్యాస్ ను పీలిస్తే నవ్వు వస్తుందని, వ్యాయామంలో భాగంగా లాఫింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆయుష్షు పెరుగుతుందని చెబుతారు. సర్కస్ అనే జంతువుల విన్యాసముల హాస్య ప్రదర్శనలో మరుగుజ్జు బఫూన్లుగా ఏర్పాటుచేసి వారి కదలికల ద్వారా ప్రేక్షకులకు నవ్వు కలిగిస్తారు. నవరసాల్లో ఒకటయిన హాస్యం జీవితంలో ప్రముఖ స్థానంలో ఉంది.
టీవీ ప్రదర్శనలో హాస్యం తక్కువగా ఉంది. సినిమాల్లో హాస్యం ఎక్కువగా ఉండి, ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వు కలిగిస్తుంది. హాస్యంలో మోటు హాస్యం ఇబ్బంది కలగజేస్తుంది. ఎవరైనా జారి పడినప్పుడు, చూసినవారు నవ్వితే, జారిపడ్డవారికి నవ్వినవారిపై కోపం వస్తుంది. ఒకానొక ప్రదర్శనలో కొరడాతో కొట్టుకునేవారి మీద జాలి పడకపోగా నవ్వించే సందర్భములు కొన్ని ఉన్నాయి. ఒకరు పడినప్పుడు నవ్వు ఎందుకు వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం.
సినిమాల్లో హాస్యం పండించే నవ్వుల రాజులుగా ప్రసిద్ధి పొందిన హాస్యచక్రవర్తులు ప్రత్యేక అభిమానులను సంపాదించుకుని ప్రతిష్టాత్మక అవార్డులు పొందుతారు. ఎంత కోపధారి అయినా హాస్యము వద్దు అని అనలేడు. హాస్యము శరీరమునకు, మనసుకు ఔషధంగా పనిచేసి శరీరం మొత్తమునకు రిలాక్సేషన్ కలగజేస్తుంది. ఇది వేయి ఔషధముల పెట్టు.
జీవితంలో పడే కష్ట నష్టములకు ఒత్తిడులకు హాస్యము మద్యం ఇచ్చే మత్తు కంటే బాగా పనిచేస్తుందని కొందరు హాస్యాభిమానులు భావిస్తారు. చిన్నపిల్లల ముద్దు మాటలు కూడా హాస్యం కలగజేసి మనల్ని ఒత్తిడినుంచి దూరం చేస్తాయి. వండర్లాండ్, డ్రీమ్ల్యాండ్ లాగా హాస్య లోకము ప్రపంచములో ఉందో, లేదో నాకు తెలియదు కానీ ఒక ప్రత్యేక హాస్య లోకము ఏర్పాటు చేయుటకు హాస్య ప్రేమికులు కృషి చేయగలరని ఆశిద్దాము. హాస్య నాయికా నాయకులు చిరంజీవులై వారి హాస్య చతురతతో మనల్ని బాగా నవ్వించాలి. వారికి వందనం సమర్పిస్తూ వారి కళ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుందాం. హాస్యమును ఆహ్వానించి ఆనందించండి.
నీతి: హాస్యం లేనిది జీవితం లేదు.
No comments:
Post a Comment