బ్రిటిష్ వారి కాలంలో ఇన్ని ప్రభుత్వ శాఖలు ఉండేవి కావు. విద్యుత్ పంకాలు లేక యాంత్రిక పంకాలు కనుక్కోలేదు.
గాలి కొరకు ఎక్కువమంది విసనకర్రల మీద ఆధారపడేవారు. ఆఫీసుల్లో పంకాలు లేవు. ఉన్నత అధికారులకు తగిన గాలి వచ్చుటకు వీలుగా గది మధ్య భాగంలో సీలింగ్ కు దగ్గరగా నాలుగు పక్కల చిన్న తెరలు బద్దలకు వేలాడుతూ ఉండి, లాగుటకు వీలుగా తాడు కట్టబడి మనుషుల సహాయంతో లాగుతున్నప్పుడు గాలి వచ్చేది, ఆ లాగుటకు పనిచేసే మనిషిని పంకా పుల్లర్ అని అనేవారు, చూచుటకు చిన్న ఉద్యోగంగా కనపడినా, ఆ శాఖాధికారికి ముఖ్యమైన సేవ అందించుటలో అతనిది పెద్ద పాత్ర. ఏమీ చదువుకోనివారికి ఆ ఉద్యోగం లభించినా ప్రభుత్వ నౌకరీ కింద భావించి, ఆ ఉద్యోగికి సమాజంలో తగిన గౌరవం లభించేది. కాలక్రమములో పంకా పుల్లర్లు తమ సేవ ద్వారా పదోన్నతి పొందిన సందర్భములు ఉన్నవి.
వివిధ పంకాలు మార్కెట్లోకి వచ్చిన తరువాత, ఆ పనిముట్లు కనుమరుగయ్యి, పంకా పుల్లర్ ఉద్యోగం మారిపోయినది. ఇది కాలంలో వచ్చిన మార్పు. వీరికి ఉన్నతి వచ్చుటకు పంకా పుల్లర్ల విధినిర్వహణ అంకితభావం అర్హత కొందరు ఉన్నతాధికారుల మంచి మనసు కారణములుగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ వ్యాపార స్వయంవృత్తి రాజకీయ రంగములవారు వారి ఉన్నతికి తమదైన మేధా సంపత్తితో చేయు ప్రయత్నములు భావితరాల వారికి మార్గదర్శనము చేస్తాయనుటలో ఎలాంటి సందేహం లేదు.
అలాగే కొందరు చిన్న వయసులో చదువు, అర్హత ఉన్నా తక్కువ ఉద్యోగంలో చేరిన కొందరు తాత్కాలిక బంట్రోతులుగా బ్యాంకులో చేరి కాలక్రమములో అంచెలంచెలుగా ఎదిగి శాఖాధికారులై ఉద్యోగ విరమణ చేసిన సందర్భాలు ఉన్నవి. అలాగే కొందరు సాంకేతికంగా ఎక్కువ విద్యార్హతలు కలిగి తమ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, తమకు దొరికిన చిన్న ఉద్యోగములలో కుదురుకుని అవకాశం దొరికినప్పుడు సఫల ప్రయత్నములు చేసి విజయం పొందిన సందర్భమును మనము గమనిస్తాము.
అయితే ప్రతి మనిషి ఉద్యోగ సోపానములో ఒక ఉద్యోగంలో చేరి కాలక్రమేణా విరమణ వయస్సు వచ్చువరకూ తనకు సంఘములో, కుటుంబంలో పరిచయస్తులు, బంధువుల దృష్టిలో గుర్తించబడే అధికార హోదా కొరకు ఆశపడుట జీవితంలో సహజమైనది. బ్రతుకు నేర్చిన ప్రతివారు కష్టపడతారు. కాకపోతే ప్రతివారు తమదైన పద్ధతులు పాటిస్తారు. కొందరు పై అధికారుల మెప్పు కొరకు వ్యక్తిగత పనులు చేస్తే, కొందరు తమ పనిలో సామర్ధ్యమును నమ్ముకుంటారు.
కొందరు పెద్దవారి సిఫార్సు ద్వారా, ఇంకొందరు వేరే మార్గముల ద్వారా, ఇలా వివిధ పద్ధతులు పాటిస్తారు. ఎవరు ఏ విధముగా ప్రయత్నించినా, తక్కువ సంఖ్యలో కల ఉన్నత పదవులు కొందరికే అందుతాయి. ప్రస్తుతం ప్రపంచ ధర్మము ప్రకారము ఏ పద్ధతిలో నడిచినా తప్పు పట్టని విధముగా నడుచుచున్నది. చాలా కాలము నుండి ఒకే సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులు తమకు ఉన్నతి లభించుటలో తగిన గుర్తింపు దొరకలేదని, కొందరు ఈ పద్ధతులు పాటిస్తున్నారు. వేరే సంస్థలోకి మరి అక్కడ గుర్తింపు లభించిన తరువాత, పాత సంస్థకు ఉన్నతి మీద వస్తున్నారు.
ప్రపంచంలోని ప్రతి వారు తమ జీవిత విధానంలో ఉన్నతి కొరకు ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ, చాలా తక్కువమంది మాత్రం ఎన్నో అవకాశములు గల దైవమార్గములో ఉన్నతి కొరకు ప్రయత్నించుచున్నారు. ఆ మార్గంలో ప్రయత్నించువారు దీర్ఘకాల ప్రయోజనములు పొందుతారు. ఎక్కువమందిని బాధించే రక్తపోటు, ఒత్తిడి వారిని బాధించవు. వారికి వచ్చే కష్టములలో ఓర్పు, సహనము వారిని ముందుకు నడిపిస్తుంది. ఈ మార్గంలో పోయేవారిని అత్యాశ తక్కువగా పీడిస్తుంది అని తెలుసుకోవాలి. నీరు లేనిది మానవ శరీరం లేదు. నాగరికతలో భాగముగా జనావాసములు నీటి వసతులు ఉన్న చోట పెరుగుట మనం గమనిస్తాం. గోదావరి నీరు తాగిన తర్వాత ఆధ్యాత్మిక భావములు పెరిగి, దైవ చింతన వైపు మనసు మళ్ళింది అని నా నమ్మకం.
నీతి: ఉన్నతి వైపు చూడటం మానవజీవిత సహజ లక్ష్యము. ఆది ప్రతి వారికి అందాలని కోరుకుందాం.
No comments:
Post a Comment