Sunday, March 7, 2021

ఆడవారు - సమాజంలో వారి పాత్ర - 2

 అయితే భారతదేశమునకు సంబంధించిన ముఖ్య విషయం ఒకటి చెప్పుకోవాలి.  

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే ఆలోచన ప్రకారము చాలా మంది టివి, సెల్ఫోన్లకు పరిమితమై పెద్దగా ఉపయోగపడని సీరియల్స్ కొరకు సమయం వృధా చేసుకొని తమ పిల్లలు బాగోగులు చూసుకొనక, పెంపకము లోపమునకు దారితీస్తూ, పిల్లల్లో నేర ఆలోచనలకు, ప్రత్యేకముగా ఆడవారిపై జరుగు హింసకు కారణమవుతోందని కొందరి అభిప్రాయం.

పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ కు నిర్వచనంగా సరైన ఆలోచన, వ్యతిరేక ఆలోచన అనుకుంటే, ఆ ఆలోచన ప్రభావము మనము నడిచే విధానంలో తప్పక ప్రతిబింబిస్తుంది. పిల్లలు నిద్ర లేచింది మొదలు తయారుచేసి బడికి పోవుటకు అన్ని అవసరములు సిద్ధము చేసి బడి నుండి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత, సమస్యలు గమనించి సహాయ పడుట మనం గమనించవచ్చు.

చల్లని తల్లికి నవ రూపాలు అయితే అమ్మకు అన్నపూర్ణ, సరస్వతి, లక్ష్మి, జాగ్రత్త, ధైర్యం, వైద్య సేవ, సహాయం, శుభ్రత, బాధ్యత, రక్షణ, త్యాగం, వెన్నుతట్టి బుజ్జగింపు వంటి అనేక రూపాలు కనబడతాయి.  ఇంట్లో అమ్మ అన్ని విధములా అవసరాలను గమనించి సహాయపడుతుంది. ఇదే ఆడవారిలో అమ్మ స్వరూపము.

ఆడువారికి మగవారి కంటే దైవభక్తి ఎక్కువ అని అందరూ ఒప్పుకుంటారు. అన్నీ తన ప్రయోజకత్వంతో నెరవేర్చగలమని అనుకునేవారు ఒకరైతే, పరిణామాలపై అవగాహన కలవారు భగవంతునిపై నమ్మకంతో ముందుకు పోయే వారు ఆత్మవిశ్వాసము పెంచుకుంటారు. అది ఆడవారికి పని ఒత్తిడినందు మానసిక ధైర్యం పెంచి వారిలో ఉత్సాహం పెంచుతుంది. ఓటమిని ఒప్పుకోని మనసు 50 సంవత్సరాలు దాటిన తర్వాత శరీరం బలహీనమైనప్పుడు మన ప్రయోజకత్వం ఏమీ లేదని అంతా సృష్టి రహస్యం అనే నిజం ఒప్పుకోవడానికి సిద్ధపడుతుంది. ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆలోచనలు మరల్చాలి. దానికి దైవభక్తి తోడ్పడుతుంది. 

సృష్టిలో భాగంగా స్త్రీ పురుషుల జీవితము నందు వయస్సు ఆకర్షణల ప్రభావంతో సమాజ అభివృద్ధిలో భాగంగా జీవనమందు వయసు ఆకర్షణతో స్త్రీ పురుషుల సహకారం తప్పనిసరి. స్త్రీ జీవితము వివాహం తర్వాత మాతృత్వం లభించిన తర్వాత గృహిణి నుండి అమ్మ స్థానమునకు మారి సార్థకత ప్రారంభమవుతుంది. దైవమునకు మారుగా అన్ని కుటుంబములకు అమ్మను తన ప్రతినిధిగా పంపాడని భావించుటకు నిదర్శనంగా మాతృ స్థానం లభించిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులకు అమ్మ స్వరూపము అర్థమవుతుంది. పసిపిల్లలను లాలించుట, వారి మలమూత్రములు అసహ్యించకుండా బాగు చేయుట, వారి సౌకర్యముల కొరకు చేసే త్యాగమనే కోరికల వాయిదాలను అమ్మలోని గుణములుగా ఆ కుటుంబ సభ్యులు గ్రహిస్తారు. ఈమధ్య దేవాలయములలో, బస్టాండ్, రైల్వేస్టేషన్లలో వెలసిన అమ్మ పాలు ఇచ్చే గది అమ్మ ఏర్పాటు, అమ్మ స్థానమునకు ఇచ్చే గౌరవంగా భావించవచ్చు.

ఋష్యశృంగుడు అనే బ్రహ్మచారి ముని కుమారుడు అతను ఎక్కడకు వెళితే అక్కడ వర్షాలు కురుస్తాయని పురాణ కథనం. అతనికి స్త్రీ అంటే తెలియదు. ఆమె అవయవ నిర్మాణం చూసి ఆమె శరీరంలో పుట్టబోయే శిశువుకు పాల ఏర్పాటు జరిగిందని తెలుసుకుని, భగవంతునికి కృతజ్ఞతలు తెలిపినట్టు పురాణ కథల ద్వారా తెలుసుకున్నాము.

అమ్మ అయిన తర్వాత గృహిణికి తన జీవితం సార్ధకత అనుకుంటే, కనీసం 30 నుండి 40 ఏళ్ల జీవితంలో ఎన్నో ఆటుపోట్లు భరించి, పొగడ్తలు లేని లేదా వాటికి ఆశపడని జీవితము గడుపుట సర్వసాధారణం. ఈ సందర్భంలో కొందరు మగ బాధితులు మహిళా అధికారుల మాతృత్వ భావనతో సహాయము పొందినవారు వారిని తప్పక గుర్తుంచుకుంటారు.

అయితే ఈరోజుల్లో ఎక్కువగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం సంపాదించాలనే ఆలోచనతో సర్దుబాటు మనస్తత్వం తగ్గి, సంసార జీవితం విడాకుల వరకు వెళ్తున్నది అని జీవితమును కాచివడబోసిన వారి అభిప్రాయం.

కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలామంది ఆడవారు తమలోని విభిన్న సేవా గుణములతో ధర్మ సేవా సంస్థల ద్వారా ఆపదలో ఉన్నవారిని ఆదుకొనుటలో భాగంగా  భాగంగా వివిధ రకముల అప్లికేషన్లు విడుదల చేసి, అవసరమైన వారికి అందుబాటులో ఉంచుతున్నారు. ఆపదలో నిజంగా ఉన్నవారు వాటిని దైవసహాయంగా భావించుటలో తప్పు లేదు.

ఆడపిల్లలను కనటం కష్టములకు ప్రారంభదశ అని భయపడి భ్రూణహత్యలు పెరిగిన దశ నుండి బయటపడి, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అని ఆలోచన విధానం వైపు మళ్లేవారి సంఖ్య ఇప్పుడు పెరుగుతున్నది. జనాభా నిష్పత్తిలో ఆడవారి జనభా తగ్గి దాని ప్రభావం సమాజంలోని అన్ని రంగములపై చూపిన చెడు ప్రభావం గమనించి, దానిని గాడిలో పెట్టుటకు ఆడవారికి విద్యా, రాజకీయ, ఇతర రంగాలలో కల్పించిన రాయితీలు, రిజర్వేషన్లు, ఆస్తిహక్కు కొంతవరకు మంచి ఫలితాలు ఇచ్చినవి.

ఈ సందర్భంలో స్వయం ఉపాధికి ఏర్పడిన మహిళా సంఘముల పాత్ర, పొదుపు, స్వయం ఉపాధి కల్పనను కూడా చెప్పుకోవాలి. మిగిలిన దేశాలతో పోల్చితే మన దేశ స్త్రీల పరిస్థితి ఇతిహాస చరిత్రల సిద్ధాంతపరంగా గౌరవ స్థితి అని అనుకున్నా, వ్యవహారపరంగా తక్కువ గౌరవం లభిస్తుందని దేశ పరిస్థితులను గమనించి తెలుసుకోవాలి. ఇంకా కొన్ని చోట్ల స్త్రీ పురుష వేతనములు లేదా కూలీలో వ్యత్యాసం ఉందని మనకు వార్తల ద్వారా తెలుస్తోంది. మనదేశ సాహిత్యం చూసినవారికి, పురాణ - సాహిత్య గ్రంథములను వ్రాసిన రచయిత్రుల సాహిత్య పటిమ, పాండిత్యము ఏమాత్రం తక్కువ స్థాయిలో లేదని గ్రహిస్తారు.

ఈ పరిస్థితుల్లో జనాభా నిష్పత్తికి తగిన విధంగా మహిళలు అన్ని రంగాల్లో తన స్థానమును స్వయంకృషితో సాధించగలరని ఆశిద్దాం. గాంధీ మహాత్ముడు కోరుకున్న విధంగా అర్ధరాత్రి మహిళలు నిర్భయంగా, వారి గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా వెళ్ళగలిగినప్పుడు దేశమునకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అనే రోజు కోసం ఆశగా ఎదురు చూద్దాం.

జన్మనిచ్చిన తల్లిని స్మరించుకుంటూ ఈ ప్రపంచమునకు అమ్మ దుర్గమ్మకు అంకితం.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.