సృష్టిలో స్త్రీ పురుషుల పాత్ర సమానమైనదని భావించినా, స్త్రీలు లింగ వివక్షతను ఎదుర్కొంటున్నారనే విషయము నిజాయితీగా ఒప్పుకోలేని నిజము.
స్త్రీలు శిశువులుగా పుట్టినప్పటి నుండి కుటుంబ సభ్యులనుండి, భార్య భర్త నుండి, బయటి వారి నుండి చిన్నచూపు చూడబడుట అనాది నుండి జరుగుతున్నది. మనది పురుషాధిక్య సమాజం అని అందరూ అనుకున్నా దక్షిణాది రాష్ట్రాలలోని ఒక రాష్ట్రములో స్త్రీ ఆధిక్య సమాజము నడుస్తున్నట్టు అనుకుంటారు. ఆ రాష్ట్రంలో స్త్రీ విద్యాధికులు ఎక్కువగా ఉన్నట్లు, అంతేకాక దేశం మొత్తం మీద వైద్యరంగంలో ఎక్కువమంది నర్సింగ్ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తున్నది.
చాలా
కుటుంబములలో మగ పిల్లలు డిగ్రీ వరకు
చదువుతూ ఉండగా, విద్యా శక్తితో ఆడపిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుట ఈ మధ్య
కాలంలో వారి విద్యాభ్యాసమునకు సహాయపడుట చాలా కుటుంబంలో వచ్చిన మార్పు. మగ
పిల్లలకంటే ఆడపిల్లలకు ఆప్యాయత, బంధు ప్రేమ, బాధ్యతలు ఎక్కువ అని తల్లిదండ్రులు
స్వానుభవంతో గమనిస్తారు.
స్త్రీల సామాజిక సమస్యలలో బాల్య వివాహం, సతీసహగమనం, దేవదాసీ
విధానం ఇబ్బంది కలిగించేవే. సతీసహగమనం చూచుటకు మత ధర్మము కాపాడే ఉద్దేశ్యంతో
ఏర్పడినట్లు కనిపించినా, ఆచరణలో విధవ స్త్రీ ఆస్తిపై కన్నువేసిన దాయాదులు సతీసహగమనం వేళ పాటించిన
బలవంతపు మరణ పద్ధతులు ఎక్కువమందిని ఆలోచింపజేశాయి. సంఘసంస్కర్తల కృషితో ఆ మూడు
ఆచారాలు నిషేధింపబడి, స్త్రీలకు ఊరట కలిగింది.
ఆడవారు పనిమీద బయటికి వచ్చినప్పుడు ఎదుర్కొనే వేధింపులు ఇబ్బంది కలిగించేవే. వేధింపులకు వయసు ప్రభావం వలన కలిగిన ఆకర్షణ కారణం అనుకున్నా, తమ జాతివారిచే పెంచబడిన మగవారు కారణమవడం ఒక విచిత్రం. అవాంఛనీయ వేధింపుల ఫలితం కొంతమంది బలహీన మనస్కులకు మరణ శాసనం అవుతున్నది. నడుస్తున్న కాలంలో జరిగే అనేక అనేక సంఘటనలు, సంస్కృతి మార్పులు ఆలోచనలో మార్పులు జరిగి కొత్త ఆచారములు పుట్టుకు రావచ్చు. దాని ఫలితం సమాజం పై పడినా, ఎంతవరకు ఉంటుందో కాల పరిణామం నిర్ణయించగలదు. ఇందుకు ఉదాహరణగా మానవుల ఆలోచన ఉమ్మడి కుటుంబంలో బలం తగ్గి వృద్ధాశ్రమం పెరుగుదల చెప్పుకోవచ్చు.
పనిలో పనిగా ఆడవారి అభివృద్ధికి అడ్డుపడే తోటి ఆడవారి సలహా చర్యలు, వారి అభివృద్ధికి నష్టం కలిగించే సందర్భాలు, ఆడవారిని ఆడవారు మోసగించి నష్టపరిచే సందర్భాలు కూడా కొన్ని ఉండొచ్చు.
బాల్యములో ఆటపాటలతో తల్లిదండ్రుల గారాబంతో పెరిగిన ఆడపిల్లలు, యుక్త వయస్సు వచ్చిన తరువాత సాంఘిక ధర్మంలో భాగముగా వివాహం జరిగి గృహిణిగా బాధ్యతలు స్వీకరించుట జరుగుతున్నది. అప్పటినుండి పుట్టింటి వాతావరణమునకు పోలికలు ఉన్నా లేకపోయినా అనేక వైరుధ్య మనస్తత్వం కలిగిన మనుషుల మధ్య సర్దుకుపోవడం, సహనంతో జీవితం జరుగుతున్నది.
వివాహ జీవితంలో కుటుంబ సభ్యుల మధ్య
అభిప్రాయ భేదం లేని జీవనము సాగుటకు ఆడవారి పాత్ర ఉంటుంది. భర్త నిద్ర లేచి తన
పనులు పూర్తి చేసుకుని అందరి సహకారంతో వృత్తి ఉద్యోగ ధర్మం నిర్వహించుటకు
తయారవుతుండగా భార్య ఏమాత్రం సహకారం లేకుండా ఇంటికి సంబంధించిన అన్ని పనులతోపాటు తన
శక్తి సామర్ధ్యములు ఉపయోగించి పనులు చేయుట చాలా కుటుంబాలలో జరుగుతున్నది. ఆర్థిక స్తోమత కలిగిన వారు, పనివారితో కొన్ని
పనులు చేయించుకున్నవారిని మినహాయించి, మిగిలినవారు ఎన్నో శ్రమలకోర్చి, వారి బాధ్యతలను నెరవేర్చటం మనం గమనించవచ్చు.
వంట ఇంటి నిర్వహణ కొరకు, ఇతర విషయాలకొరకు, యంత్ర పరికరముల సహాయం లభించినందున కొంత శ్రమ సమయము తగ్గినది. వివిధ పనుల సమ్మేళనము సమన్వయంతో చేయుట ద్వారా గృహిణి అను పదమునకు హౌస్ కీపింగ్ అనగా గృహ నిర్వహణ చక్కగా చేస్తూ ఆ పదమునకు సరైన నిర్వచనం ఇస్తున్నారు. ఇంటి కోసమే పరిమితమైన సందర్భములు గతంలో ఉండగా ఆదాయం పెంచుకునే చర్యలు, పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ, కొన్ని ఇతర సేవలు కొత్తగా కలిసినవి.
చాలా కుటుంబములలో మగవారి కంటే ఆడవారు ఒత్తిడిని ఎదుర్కొనే
సందర్భములు పెరిగినవి. ఈ ఒత్తిడి కారణంతో అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలతో
పెరిగిన అసంతృప్తి, విడాకుల కోరువారి
సంఖ్యను పెంచింది. దూకుడుగా పోయే కొందరిలో నేర మనస్తత్వం పెరిగి క్రిమినల్ చర్యకు
అవకాశం కలిగి ఆందోళన కలిగించే వారి సున్నిత మనస్తత్వం తగ్గినదా అనే ఆలోచన
కలుగుతుంది. స్త్రీలు విద్యార్హత పెంచుకుని కేవలం మగవారే చేయగలరనే ఉద్యోగములతో
పోటీపడి తమ సామర్ధ్యం నిరూపించుకున్న సందర్భములు ఉన్నవి. కొన్ని దేశములలో పెద్ద
అధికారులకు, నాయకులకు రక్షణ కవచంలో భాగంగా అంగరక్షకుల పాత్ర పోషించి పలువురి
మెప్పు పొందుతున్నారు, బలమైన యంత్రములను నడుపుతూ మగవారితో పోటీ పడిన సందర్భములు
వారికి గుర్తింపు తెస్తున్నాయి. (సశేషం)
No comments:
Post a Comment