Thursday, February 4, 2021

భ్రమ - నిజం - అబద్ధం

భ్రమ = భ్రాంతి = లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు భావించడం.

కళ్ళముందు కనబడేది అంతా నిజం కాదు. ఒక్కొక్కప్పుడు అబద్ధమును కూడా నిజమని భ్రమ పడతాము.

1. రాజమండ్రిలో సారంగమెట్ట అనే ప్రదేశం మనకు చెప్పిన సందేశం - ఒక రాజు తన భార్య సవతి కొడుకు సారంగధరుడు తన మీద మోజు పడ్డాడని చెప్పిన అబద్దపుమాటలు నమ్మి కొడుకుని శిక్షించిన వైనం.

2. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరు అనుమానంతో హింసకు దిగిన సందర్భం - భార్యపై సందేహంతో తన పోలిక రాలేదని కన్న బిడ్డలపై అనుమానంతో డీఎన్ఏ పరీక్షకు వెళ్లిన సందర్భం.

3. పాలు తాగాలంటే మామూలు ప్రదేశంలో తాగాలి, కానీ తాడిచెట్టు కిందకి వెళ్లి తాటిపాలు తాగినా, కల్లు తాగినట్లు జనం భ్రమ పదే విధం.

4. సాక్షాత్తు దేవుడే భూమి మీద తిరుగుతూ ఉంటే నమ్మలేక ఏ డ్రామా ఆర్టిస్టో అనుకునే జనం భ్రమ.

5. దయ్యములు నిజంగా ఉన్నాయా లేవా అని తేల్చుకోలేని సందేహంతో కూడిన భ్రమ.

ఇన్ని భ్రమలు అనుభవించే మనం హింసకు చోటిస్తాం.

ఈ విషయములన్నింటి ద్వారా మనకు సందేహం వచ్చినప్పుడు అది మన బుర్ర తొలిచి వేస్తుంది. సందేహం వచ్చిన తర్వాత రోజురోజుకీ దాని తీవ్రత పెరిగి పోతుంది. సందేహ నివృత్తికి తగు ప్రయత్నం చేస్తారు. భ్రమలో పడిన వారికి విచక్షణ లోపిస్తుంది. తప్పులు చేసినవారు మనల్ని భ్రాంతిలో ఉంచుతారు. దాన్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ లేదా సందేహము సంఘటన అంటారు. తప్పులు చేసినవాడు ఎన్నుకునేది దబాయింపుల ప్రక్రియ. ఈ క్రమంలో ఎన్నో అబద్ధాలు చెప్తారు. అబద్ధములు నిబద్ధతను సరిచూసుకొనుటకు ప్రయత్నిస్తే కొన్ని నిజములు బయటపడతాయి. ఆధునిక కాలంలో పలు నేరములకు సెల్ఫోన్ సంభాషణలు, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారముల ద్వారా కొన్ని నిజాలు బయటకు వస్తాయి. సంతానం విషయంలో అనుమానం ఉన్నవారు డిఎన్ఏ ప్రక్రియ ద్వారా నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తప్పులు చేసేవారు ఈ ప్రక్రియలో పండిపోయి అవతలి వారిని ఇబ్బంది పెట్టి తన పనిని కొనసాగిస్తారు. ఈ ప్రక్రియలో వారిని ఎదిరించలేని బలహీనుల ఆక్రోశం ఎవరూ గుర్తించరు. మనం గుర్తించాల్సిన విషయం ఏమనగా తప్పులు కేవలం మగవారే చేస్తారని అనుకుంటే తప్పు. వారిచేత వెనక ఉండి గాని లేక స్వయంగా ఈ కార్యక్రమంలో గాని పాల్గొనే ఆడవాళ్ల సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుచున్నది. జైళ్లలో స్త్రీ నేరస్తుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ జనాభా శాతంలో చాలా తక్కువ శాతం ఉన్నందున ఆందోళన పడనక్కర్లేదు. అలానే ఈనాటి కాల పరిస్థితులలో నేరాలు, క్రిమినల్ కార్యక్రమములలో పెరిగిన ఆడువారి పాత్ర చేత వారి సున్నిత మనస్తత్వం తగ్గినదా అని భ్రమ కలుగుచున్నది. భ్రమ జీవితము నాశనం చేస్తుంది. నిజమైనా, అబద్ధమైనా నిర్ధారించుకుని తగిన విధముగా నడుచుకోండి. మనము చేసే ప్రక్రియలో మాయ, మైకము మనతోపాటే ఉంటాయని తెలుసుకోవాలి.

మరికొన్ని భ్రమలు

1. ఒక్కొక్కప్పుడు చీకట్లో పాముని చూచి తాడు అని భ్రమపడినా కొద్దిసేపు గమనించినప్పుడు దాని కదలిక ద్వారా పాము అని తెలుసుకున్న విషయం దిగ్భ్రాంతి కలిగిస్తుంది.

2. ఒకానొక ఊరి బయట కొందరు గొర్రెల కాపరుల చీకటి పడే సమయంలో గొర్రెలను మేపుతున్నారు. వారు గొర్రెల్ని ఆదరించే క్రమంలో విసిరిన కొన్ని రాళ్ళు అదే సమయంలో బహిర్ప్రదేశమునకు అక్కడకు వచ్చిన ఆడవారికి తగిలినాయి. తమని ఉద్దేశించి ఆ రాళ్లు వేశారని భావించిన  ఆడువారు తమవారితో చెప్పగా వారు వచ్చి గొర్రెల కాపరులతో జరిగిన వాగ్వాదంలో ఆవేశం పెరిగి, హింస చెలరేగి కొందరు గొర్రెల కాపర్లు చనిపోయినారు. పూర్తి నిజానిజాలను ఎవరు చెప్పలేని సందర్భంలో భ్రమయే నిజమని నమ్మిన వారు శిక్షార్హులైనారు.

రాజస్థాన్ ఎడారులలో ఎండమావులు చూసి నీటి వసతిగా భ్రమించి అంత దూరం వెళ్లిన వారు ఎండమావిగా తెలుసుకుని తమ భ్రమ తప్పని తెలుసుకుంటారు.

మయసభను గుర్తుకు తెచ్చుకుందాం. మయసభ గొప్పతనమును విన్న దుర్యోధనుడు మయసభని చూసి దాని అందమునకు ముగ్ధుడై ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమ పడ్డాడు. నీటి కొలను ఉన్నచోట లేనట్టు, లేనిచోట ఉన్నట్టు భ్రమపడి ఒక చోట కాలు జారి పడ్డాడు. దానిని చూచి నవ్విన ద్రౌపదిపై అసూయా ద్వేషములు రగిలి కోపముతో మండిపడ్డాడు. దాని తీవ్రత ఎంతటిదంటే ద్రౌపదిని అవమానించి, తద్వారా కౌరవ పాండవ యుద్ధమునకు అది కూడా ఒక కారణమైంది.                                                                    (సశేషం)

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...