Wednesday, February 3, 2021

అభిమానం - అభిమానంతో ఏర్పడే సంఘములు

వడ్డించేవాడు మనవాడైతే చివర కూర్చున్నా పర్వాలేదు అనే సామెత ద్వారా మనకు అర్థమయ్యే విషయము, ఆకలి తీరుటకు చివర కూర్చున్నప్పటికీ, భోజన సౌకర్యంలో ఇబ్బంది ఏ మాత్రం ఉండదని మనకి తెలియజేస్తూ, అభిమానమునకు హద్దులు లేవని తెలియజేస్తుంది. 

అభిమానము లేక సారూప్యత వల్ల ఏర్పడిన పలు సంఘముల ద్వారా జరిగిన మంచి చూద్దాం. అభిమానంతో ఏర్పడిన క్లబ్బులు, అసోసియేషన్లు కూడా ఇందులో భాగమే. అభిమానమునకు మూలమైన విషయములు పరిశీలిద్దాం. వినోద కళాకారుల రంగము తమకు గల అలవాట్ల సారూప్యత ద్వారా కలిసిన వారు, దేశ, రాష్ట్ర, జిల్లా, ఊరు, భాష, రాజకీయపార్టీ, దైవభక్తి, పార్టీ సాహిత్యము, ఇతర అభిమానుల విషయంలో సారూప్యత ద్వారా సంఘములు ఏర్పడతాయి. ఈనాడు దేశంలో గల అనేక వృత్తులవారు సంఘటితంగా ఏర్పడి వారి వృత్తిలో గల సాధకబాధకాలు పరిష్కరించుకొనుటకు ఏర్పడిన వృత్తి సంఘముల ద్వారా మరొక సాంఘిక ప్రయోజనం నెరవేరుతుంది.

ఒకే భాష మాట్లాడే ప్రజలు వారి ఊరు, జిల్లా దాటిన తర్వాత ఒకే భాష అభిమానులతో కలిసి కలసికట్టుగా ఏర్పడి వారి ప్రయోజనములు కాపాడుకుంటూ, తాము ఉన్న రాష్ట్ర అభివృద్ధికి చేయు కొన్ని సేవలు మెచ్చుకోదగినవిగా ఉంటాయి. ఈ సందర్భంలో ఈ రాష్ట్రమునకు చెందిన రైతులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి సాగు చేయని భూములను సాగు చేయుట ద్వారా పంటల దిగుబడి పెరిగిందని మర్చిపోరాదు. దేశంలో ఉండగా రాష్ట్రముల మధ్య గల సమస్యలతో విభజింపబడిన వ్యక్తులు తమ రాష్ట్ర సరిహద్దులు దాటి దేశాంతరమునకు వెళ్ళినప్పుడు,  తమ రాష్ట్ర సమస్యలు మర్చిపోయి తము ఉన్న దేశాభివృద్ధికి చేసిన పనులు వారి స్వదేశమునకు తప్పక మంచి పేరు తెస్తాయి. కొన్ని సంఘముల నేతలు బలపడి రాజకీయ నేతలుగా మారి దేశ సేవ చేయుట గర్వించదగిన పరిణామము.

ఒక సినిమా హీరో తన నటనతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకుని వారు ఏర్పాటు చేసుకున్న అభిమాన సంఘముల ద్వారా చేసే సాంఘిక సేవ కార్యక్రమములు ఆ సేవల ద్వారా ప్రయోజనం పొందిన వారికి సంతోషం కలిగించేవే. పొరుగు రాష్ట్రంలో గల ఒక వీరాభిమాని ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే నాలుక కోసుకుంటానని మొక్కుకొని చివరకు మొక్కు తీర్చుకున్న తీరు దుర్ఘటనగా మిగిలిపోతుంది.

వివిధ సంఘముల ద్వారా అనేక కల్యాణ మండపములు, సత్రములు, వసతి సముదాయము నిర్మింపబడి వారి సభ్యులలో అవసరమైన వారికి అందుబాటులోకి వచ్చినవి. ప్రభుత్వం ద్వారా ఇవి నిర్మింపబడటకు నిధుల కొరత, ప్రాముఖ్య నిర్ణయములలో ఆలస్యము కారణములు. పలు సంఘ సభ్యుల అభిమాన విరాళము ఇలాంటి విషయములలో ముఖ్య పాత్ర పోషిస్తుందని మరువరాదు. ఈ సంఘములు కొంతమందికి  పరోక్ష జీవనోపాధి కలుగజేయుచున్నవి. వారు నిర్మించిన కట్టడములు దేశసంపదను పెంచుతాయి.

కొన్ని వృత్తి సంఘములు సభ్యులకు వినోద, ఆధ్యాత్మిక దర్శనములు ఏర్పాటుచేసి సభ్యులను ఆకట్టుకుంటున్నవికొన్ని వృత్తి సంఘములు వారి సభ్యులను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటుచేసిన విద్యాసంస్థల వలన విద్యా రంగమునకు ఒత్తిడి తగ్గుతున్నది. మరియు వైద్యశాలలు రోగుల సేవకు తోడ్పడుచున్నవి. ఈ విషయంలో అన్ని రంగములకు చెందిన సంఘాల పాత్ర చెప్పుకోదగినది. ఈ సంస్థల ఏర్పాటు ద్వారా ప్రభుత్వముపై ఆర్థిక భారం తగ్గి ఆ వనరులు ప్రాధాన్య రంగములకు మళ్లించు అవకాశం ఏర్పడునని కొందరి అభిప్రాయం.

మంచి అభిమానమునకు గుర్తుగా ఈ క్రింది విషయములు అనుకోవచ్చు.

1. మీకు ఒక సినిమా కళాకారునిపై అభిమానం ఉన్నది. ఆయన నటించిన సినిమా విడుదల కాగానే  మీలాంటి అభిమానులు లేదా అభిమాన సంఘముల ద్వారా ఆసినిమా విజయమునకు జరిగిన కృషి, రాష్ట్ర, దేశ అభిమాన సంఘాల అభిమానం గుర్తించబడతాయి.

2. మీరు ఒక దైవ అభిమాని. మీలాంటి అభిమానులు కొందరు కలసి సంఘటితంగా శిధిలావస్థలో ఉన్న దేవాలయాన్ని బాగుచేయుట కానీ లేదా ఉన్న దేవాలయంలో సౌకర్యములు కలుగజేసినప్పుడు ఆ స్వామిని దర్శించుకునే భక్తులు పొందే సంతోషంలో మీరు భాగస్వాములు అయినందుకు తప్పక ఆనందిస్తారు.

3. అన్ని అర్హతలు గల ఉద్యోగికి ఉన్నతిలో పై అధికారి సహాయం చేస్తే మంచిదే. అనర్హులకు సహాయం చేస్తే అర్హులకు బాధ, ఇబ్బంది.

4. ఒక ప్రజా ప్రతినిధి తన నియోజకవర్గ పరిధిలో అభిమానంతో గానీ, బాధ్యతతో గానీ కొన్ని సౌకర్యములు ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుంది. ఆ సౌకర్యం పొందిన నియోజకవర్గ ప్రజలు సంతోషిస్తారు. అది మరికొందరికి ఆదర్శం అవుతుంది.

మానవత్వంతో కూడిన అభిమానము ఎక్కువ ఆదరణ పొందుతుంది.

శేష ప్రశ్న: ఏది అభిమానమో, దురభిమానమో నిర్ణయించగల శక్తికి కొలబద్ద లేక అర్హుడైన వ్యక్తి ఎవరని మనసుని తొలిచే సందేహము.

నీతి: హద్దుల్లో గల అభిమానం ముద్దు - హద్దులేని దురభిమానము వద్దు.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...