Friday, February 12, 2021

రహస్యం

రహస్యం అనగా ఒకరి జీవితంలో గుట్టుగా ఎవరికీ తెలియరానిది. రహస్యం అనేది తెలుగులో నాలుగు అక్షరాల మాట అయినా, దాని ప్రభావం చాలా నష్టం కలగజేస్తుంది. 

ప్రతికూల పరిస్థితులలో జీవితములు నాశనమౌతాయి. రహస్య జీవితము, రహస్య ప్రయాణము, రహస్య సమావేశాలు, రహస్య కార్యకలాపాలు కూడా రహస్య అనుబంధ వ్యవహారకోవలోకి వచ్చేవే. అతి చిన్నగా ఒకరి చెవిలో ఒకరు గుసగుసలుగా చెప్పుకోవడం చూచినవారు ఏమిటి ఆ రహస్య గుసగుసలు అని అనటం చూడవచ్చు. దీనిని బట్టి గుసగుసలు రహస్యం చెప్పు విధములలో ఒకటిగా అనుకోవచ్చు. రహస్యములలో చట్టబద్ధమైనవి, చట్టవిరుద్ధమైనవి కూడా ఉండవచ్చు. రహస్యము తెలుసుకునే విధానములలో ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు.  రహస్యమును తెలుసుకునే ప్రయత్నములకు దూరంగా ఉండాలి. కొన్ని రహస్యములు మనకు తెలియకపోతేనే మంచిదని మన విచక్షణ మనకు అనుభవపూర్వకముగా తెలియజేస్తుంది. తెలిస్తే ఏమవుతుంది? రహస్యము రట్టు అవుతుంది. ఉద్రేకము పెరిగి, హింసకు దారితీస్తుంది. చట్టపరిధిలోనికి వెళితే, మనశ్శాంతి లేని వ్యతిరేక చర్యలను ఎదుర్కోవాలి. అల్లరే అల్లరి. ఖర్చులు పెరుగుతాయి. పనిలో పనిగా మనకు సంతోషం కలగజెయ్యని, ఏమీ ప్రయోజనములు లేని ప్రచారము మనము వద్దన్నా ఆగదు. తెలిసినవారి ఓదార్పులు. అప్పుడు సిగ్గు పడతాము. అంతర్మధనము మొదలవుతుంది. మన జీవితమును సమీక్షించుకుంటాము. దిద్దుబాటు చర్యలు మొదలుపెడతాము. నష్టపోయినవారిని బుజ్జగిస్తాము. అన్ని పద్ధతులు ఉపయోగించి జరిగిన నష్టాన్ని భర్తీ చెయ్యడానికి ప్రయత్నిస్తాము. అన్ని సర్దుబాట్లు పూర్తయిన తరువాత, నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంటాము. మన తెలివి, విచక్షణ చక్కగా పనిచేస్తే అలాంటి తప్పులు మరలా చెయ్యము.

మరలా చేసే పక్షములో తగిన జాగ్రత్తలు తీసుకుంటాము. తప్పులు చేసినా, జాగ్రత్తగా చేశామని మనసులో అనుకుంటాము. అది ఎలాగంటే ఒక హత్య చేసేవ్యక్తి చాలా జాగ్రత్తగా చేసినా ఏదో ఒక తప్పు చేస్తాడు. తప్పులు కనుగొనుటలో బాగా ఆరితేరిన వారుంటారు. అదే వారిపని. ఒకనేరము జరిగినప్పుడు నేరపరిశోధక శాఖవారు చూస్తూ చేతులు కట్టుకునుండరు. వారి పని వారు చేసుకు పోతారు. ఫోరెన్సిక్ సైన్స్ ద్వారా వృద్ధి చెయ్యబడిన నేర పరిశోధనా పద్ధతి ఉపయోగించి, నేరస్తుల ఆధారాల కోసం ప్రయత్నిస్తారు. ఎంతో జాగ్రత్తగా నేరస్తుని గుర్తిస్తారు. ఒక నేరము చేసిన తర్వాత మనసు ఆగదు. ఏదైనా ప్రలోభము చేతనో, సమాజముపై కసితో కాని, నేరము చేయుటలో వికృతానందంతో కాని గొలుసు నేరము చేసి, ఏదో ఒక సందర్భములలో దొరికిపోతారు.

నేరములు అమావాస్య రోజుల్లో ఎక్కువగా జరుగునని ఒక నేర పరిశోధకుల విశ్లేషణగా ఉంది. అమావాస్య రోజు ప్రకంపనలు నేరస్తుల మనసులో బాగా ప్రభావం చూపుతాయని, వారి రహస్య చర్యలు అమావాస్యనాడు బలంగా ఉంటాయని అర్థం చేసుకోవాలి. విచిత్రమేమిటంటే ఏమనిషి కూడా నాకు రహస్యములు వద్దు, నేను బట్టబయలుగా జీవిస్తానని అనలేడు. కారణమేమిటంటే మనము తెలిసో, తెలియకో అనేక తప్పులు చేస్తాము. కొన్ని బహిర్గతమైనప్పుడు చట్టపరిధిలోనికి వెళ్ళే నేరములైతే ఇబ్బందులు తప్పవు. నేరము చేసి చట్టానికి అందకుండా పారిపోయి, రహస్యముగా జీవించే రహస్య జీవితం కూడా రహస్యమే. రాజకీయ జీవితంలో రహస్యములు బట్టబయలు అయితే అణుబాంబు విస్పోటం కంటే మించిన ప్రమాదం జరిగి, రాజకీయ ప్రకంపనలతో ప్రభుత్వాలకు అస్థిరత్వం ఉంటుంది. నోటిమాట ద్వారా జరిగే ప్రచారము వలన రహస్య విచ్ఛేదన కార్యక్రమాలు పుకార్లుగా వ్యాప్తి చెందుట, ఆహ్వానించ తగని పరిణామముగా భావించాలి. సమాజములో భయాందోళలను కలిగించే వాటికి దూరంగా ఉండుట చాలా మంచిది.

సాయిబాబా కథలో సాయిబాబాను ఆయన ముఖ్య భక్తుడైన నానా చందోర్కర్ ఎలా కలిశాడో తెలుసుకుందాం. పెద్ద ఉద్యోగస్తుడైన నానా చందోర్కర్ కు తనను కలవమని బాబా కబురుచేశారు. బాబా చందోర్కర్ తాను పెద్ద ఉద్యోగస్తుడనని, సామాన్యుడగు ఒక ఫకీరుని ఎలా కలుస్తానని అహంభావంతో కలవలేదు. కొన్నిమార్లు కబురు చేసిన తరువాత నానా చందోర్కర్ బాబా వద్దకు వచ్చి నన్ను ఎందుకు పిలిచారు అని అడిగాడు. అప్పుడు బాబా మనిద్దరి మధ్య కొన్ని జన్మల బంధం వల్ల నిన్ను నేను పిలిచాను అని చెప్పారు. చందోర్కర్ నమ్మలేదు. అప్పుడు వారిద్దరి మధ్య జరిగిన రహస్యమును బాబా చందోర్కర్ కు చెప్పారు. అప్పటి నుండి ఈ సాయిబాబాకు చందోర్కర్ భక్తుడై ఎంతో మంది భక్తులను సాయిబాబా దర్శనమునకు పంపి, వారి జీవితము ఆధ్యాత్మికముగా బాగుపడేటట్లుగా చేశాడు. సాయిబాబా చందోర్కర్ ల మధ్య జరిగినది రహస్యమే. ఆరహస్యం ఏమిటో మనకు తెలియనంత కాలము అది రహస్యమే. రహస్యము నుండి వచ్చినవే రహస్య సమావేశములు. ఈ సమావేశములు కొంతమంది మధ్య ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొనుటకు వారి మధ్య కల రాజీ మార్గ పథకములు లేక షరతులు ఇతరులకు తెలియకుండా ఉండుటకు ఏర్పాటు చేసుకుంటారు. ఆతరువాత సమావేశ వివరములు బయటకు వస్తే అవి రహస్య సమావేశాలు ఎలా అవుతాయి అనుకుంటారు. అప్పుడు మనము దానిని రాజీమార్గముగా అర్థ రహస్య సమావేశం అని పిలవవచ్చు. రహస్యం ఉండాలా అని కొందరు అనుకుంటే, అన్నీ బట్టబయలుగా ఉండాలా అని కొందరంటారు. రహస్యములు ఉండాలి. లేనిచో మనము మనశ్శాంతిగా బతకలేము. రహస్యములు భార్యాభర్తల మధ్య తప్పక ఉండాలి. వారి పూర్వ జీవితంలో చేసిన తప్పులు ఏవైనా రహస్యముగా ఉంచుకోకపోతే, వారిలో ఒకరిమీద ఒకరికి అభిమానములో తేడా వస్తుంది. రహస్యములు ఉన్నప్పుడు రహస్య శోధనం ఉంటుంది. ఒక వాహనదారు ప్రమాదము కలగజేసి పారిపోయినప్పుడు లేక ఒక దొంగ దొంగతనం చేసినప్పుడు గుర్తించుటలో సీసీ కెమెరా పాత్ర చాలా ఉంటుంది.

రహస్య విషయములో ఆఫీసులలో జరిగే విషయములు రహస్యంగా ఉంటేనే అందరికీ గౌరవం. లేకపోతే విమర్శలను ఎదుర్కొంటారు. ఉదాహరణకు ఒక ప్రముఖ వ్యక్తి తన వారసుడికి కొన్ని కోట్లు వారసత్వంగా ఇచ్చాడనే రహస్యము సంచలనవార్తగా వచ్చినా దానిని పెద్దగా ముఖ్యమని భావించనవసరము లేదు. అన్ని వార్తలు సంచలనంగా మనము భావించరాదు. కొందరు సంచనల వార్తలకై అనగా ప్రజల దృష్టిలో పడని రహస్యములు, రహస్య గూఢచర్యల ద్వారా వెలికి తీసినప్పుడు ఆవార్తలు కొంత గందరగోళ వాతావరణం సృష్టిస్తాయి. మన దృష్టిలో అంతవరకు మంచివాడుగా కనబడిన వ్యక్తి వెంటనే చెడ్డగా కనపడతాడు. కానీ అతను న్యాయస్థానం ద్వారా నిర్దోషిగా బయటపడితే అతని పైన పడిన ముద్ర చెరిగిపోతుంది. కొన్ని సందర్భములలో అమాయకులు అవతలివారి ఉచ్చులో పడి నేరస్తులుగా ముద్రపడిన సందర్భము ఉండవచ్చు. వారికి కాలమే తగిన న్యాయం చేయగలదని ఆశిద్దాము. ఇక్కడ కాలము అనగా జరగబోయేకాలంలో అతను ప్రయత్నించి, తను నిర్దోషిగా బయట పడుటకు చేసే ప్రయత్నముగా భావించాలి. అమాయకులు నేరములలో ఇరుక్కుంటారు అను విషయమునకు నేను చిన్నప్పుడు విన్న విషయము ఒక ఉదాహరణ - ఒక అధికారికి గల పేరు ప్రతిష్ఠలు చెడగొట్టుటకు లేక దారికి తెచ్చుకునే ప్రయత్నంలో ఆడవారిని అడ్డం పెట్టుకున్న  సందర్భం చెప్పుకోవాలి. ఆ తరువాత జరిగిన పరిణామాలు నాకు తెలియదు. మనము చేసే ప్రతి పని బట్టబయలుగా చేయరాదు. మనకు  ఆదాయము తెచ్చిపెట్టే పనులు, ఇతర విషయములు కొన్ని బట్టబయలుగా చేస్తే అనుకోని పోటీ ఎదుర్కొని, ఆదాయము తగ్గుతుంది. ఇందుకు ఉదాహరణగా ఒక విషయము చెప్పుకోవచ్చు. ఒక అపార్ట్మెంట్ అమ్మే స్థిరాస్తి బ్రోకరు ఫోన్ లో గాని, స్వయముగా కానీ పూర్తి వివరములు చెప్పక తాను స్వయంగా తీసుకెళ్లే విధానంతో దీనిని పోల్చుకోవచ్చు. ఆ వివరములు చెప్తే తన వ్యాపార ఆదాయమునకు భంగం అని ఆలోచిస్తాడేమో తెలియదు. అది అతని వృత్తి రహస్యంగా భావించాలి.

చీకటి రహస్య జీవితం, వృత్తి రహస్యం, వ్యక్తిగత రహస్యము, దేశ రహస్యము, పేరుపొందిన బాబాల రహస్య జీవితం అన్ని రహస్యముగానే ఉండాలి. ఏరహస్యమైనా బయటికి వస్తే సంచలనం సృష్టిస్తుందని అర్థం చేసుకోవాలి. సంచలనము సృష్టించడమే రహస్యం యొక్క బలము. మనకు తెలియని విషయమును చిదంబర రహస్యంగా తెలుగువారు భావిస్తారు. ఇక్కడ చిదంబరం అనగా మంత్రిగారి పేరు కాదని, చిదంబరం అనే ఊరిపేరు మీద వచ్చిందని తెలుసుకోవాలి. రహస్యములు ఎవరికీ తెలియదని భ్రమ పడేవారు చాలామంది ఉంటారు. వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన చుట్టూ ప్రత్యక్ష సాక్షులైన భూమి, నీరు, గాలి, ఆకాశము, అగ్ని నిరంతరం మనం చేసే ప్రతి పనిని గమనిస్తూ, పాపపుణ్యముల నిర్ధారణలో పాల్గొంటారు. వారు మన తప్పులను తోటి మనుష్యులకు చెప్పలేరని మనం ధీమాగా ఉండడం గొప్ప విషయమే. మానవ జీవితంలో రహస్యములు మానవ జీవితము కంటే ఉన్నతమైన శక్తులవద్ద బట్టబయలుగా ఉంటాయి. ఎంత బలవంతులైనా వారి రహస్యములు మరొక చోట బయటపడే అవకాశం ఉన్నదని భావిస్తూ, సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

జీవితము మూడు రోజుల ముచ్చట కాదు. గ్యారెంటీగా వందేళ్ళ ముచ్చట. కాలం కలిసిరాక మధ్యలో పోతే చెప్పలేము. అతి ముఖ్యమైన రహస్యముగా ఉంచవలసినది మన ఆయుర్దాయ విషయం. అనగా ఎంత కాలం జీవిస్తామో అని తెలుసుకోరాదు. దీనిని తెలుసుకునే ప్రయత్నము మానుకోవాలి. అది భగవంతుడు మనిషిని సృష్టించినప్పుడు కాపాడుకోవలసిన రహస్యముగా నిర్ణయం జరిగింది. అనవసరమైన కోరికలతో ఆయుర్ధాయ విషయములు తెలుసుకోవడానికి ప్రయత్నించరాదు. ఈ విషయంలో నా దృష్టికి వచ్చిన ఒక చిన్న విషయం చెప్తాను. అనవసరమైన చాపల్యంతో వ్యర్థ సంభాషణలో భాగంగా, ఒక వ్యక్తి ఆ ఊరిలో గల దైవ ఉపాసకుని వద్దకు వెళ్లి, తను ఎప్పుడు చస్తానో  చెప్పమని అడిగాడు. ఉపాసకుడు ఎంత వారించినా వినని ఆవ్యక్తి పట్టుదలకు సమాధానముగా రెండు రోజుల్లో మరణిస్తావని తెలిపాడు. ఎందువల్ల జరిగిందో తెలియదు గానీ, చెప్పిన విధముగా ఆవ్యక్తి మరణించడం జరిగింది. కుటుంబమునకు విషాదం మిగిలింది. ఇందులో మనం గమనించవలసిన అతి ముఖ్యమైన విషయం ఆయుర్ధాయ విషయము సృష్టిలో అతి పెద్ద రహస్యం. దాని గోప్యతను మనము బట్టబయలు చేసే ప్రయత్నం చేయరాదు. ఈ జీవితం భగవంతుడు ఇచ్చిన వరముగా భావించినప్పుడు, భవిష్య విషయములు తెలుసుకొనుటకు భవిష్యత్తు సూచకులను కలిసేవారికి నాప్రత్యేక మనవి ఏమిటంటే ఎటువంటి పరిస్థితులలోనూ మీ జీవితంలో అతిపెద్ద రహస్యమైన ఆయుర్ధాయ విషయము గూర్చి తెలుసుకునే ప్రయత్నం చేయరాదు. దీనికి మినహాయింపు జీవితం వార్ధక్య దశలో ఉన్నవారు, అతి తీవ్ర రోగ పీడితులు ఆలోచించగలరు. తెలుసుకుంటే ఏమవుతుంది ఎప్పుడైనా మరణించ వలసినదే కదా అని అనుకునేవారికి చెప్పేది ఒకటే. ఈ జీవితము సంతోషముగా ఉండుటకు ఏర్పడినది. అంతేగాని అనవసరమైన విషయాలు తెలుసుకొని, మనసును బలహీనపరచి కొనుటకు కాదని గమనించాలి. మనసు బలహీనపడితే, నిరాశా నిస్పృహలు బయటపడితే అవి మనమీద స్వారీ చేస్తాయి. అప్పుడు వ్యతిరేక శక్తులు లేదా నెగిటివ్ ఫోర్స్ ఆధీనంలోకి  వెళ్తాం. దీనిని ఏ మాత్రం స్పృహ లేని వ్యక్తి ఆటో నడిపితే ఎలా ఉంటుందో అలాంటి జీవితంతో పోల్చుకోవచ్చు.

రహస్యమా జిందాబాద్!  నువ్వు బట్టబయలు కావద్దు.

అంకితము: నేర పరిశోధనలో నేరస్తుల రహస్యములను ఛేదించే వృత్తికి అంకితమైన వారికి కృతజ్ఞతలతో.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.