Wednesday, February 10, 2021

జ్యోతిష్య, భవిష్యత్తు సూచకులు చెప్పే సందేశం - దానిపై సామాన్యుడి దృష్టిలో విశ్లేషణ

ఒక జ్యోతిష సిద్ధాంతి మాటలలో ఆయన చెప్పే భవిష్యత్తు సూచనలు జరిగితే శాస్త్ర విజయంగా భావించాలి, తప్పు అయితే  తన శాస్త్రజ్ఞాన లోపం అని ఆయన చెప్పిన విధము మన సందేహములను తీరుస్తుంది. 

మానవజన్మలో మనకు గానీ, మన కుటుంబ సభ్యులకు కానీ తీవ్రమైన ఆశలుండటం వలన, జాతకములు చెప్పేవారిని మరియు దైవ ఉపాసకులను కలవటం అలవాటయింది. వీరిలో కొందరు రాజకీయ అధికార ప్రాపకం కలవారి ఆశ్రిత వర్గంలో ఉండి, వారు చెప్పిన ఫలితములు జరిగినప్పుడు మౌత్ పబ్లిసిటీ లేదా నోటి ప్రచారం ద్వారా ఎక్కువ గుర్తింపు పొందుతున్నారు.

దైవము లేక దైవశక్తి ఈ ప్రపంచమును నడిపిస్తుందని మనము నమ్ముతూ దానితో గ్రహముల ఉనికిని, సైన్సు ప్రకారం నిర్ధారించబడినప్పుడు దానిని కూడా నమ్మాలి. దాని ప్రభావం ప్రతి విషయం మీద ఉంటుందనేది కనబడే సత్యం. భవిష్యత్తు సూచకులు మనకు జరిగే మంచి చెడులను, వాటి విశ్లేషణలతోపాటు, వాటికి తగిన పరిహారములు కూడా తెలియజేస్తారు. ఆ పరిహారములు కొన్ని ఖరీదైనప్పుడు, దానికి అయ్యే ఖర్చు మన శక్తి దాటి అప్పులపాలైనప్పుడు, ఆశించిన ఫలితం రానప్పుడు కుటుంబంలో మనశ్శాంతి లోపించి అప్పులు తీర్చే భారం మన కష్టములను పెంచుతుంది.

మానవుడు ఆశాజీవి. భవిష్యత్తుపై ఆశ మన మొదటి బలహీనత. మనకు ఎన్ని ఆశలు, కోరికలు ఉన్నాయో మనం వెళ్లే భవిష్యత్తు సూచకులకు కూడా అన్ని ఆశలు, సమస్యలు, ఆర్థిక, ఆరోగ్య బాధలు ఉంటాయి. కొన్ని ఏళ్ళుగా భవిష్యత్తు సూచనలు చేసేవారిని సందర్శించాను. ఇప్పుడూ చేస్తున్నాను. నాలోని భవిష్యత్ విషయ సూచనలపై కోరికల బలం తగ్గనంతకాలం నేను వెళ్తూనే ఉంటాను అని అనుకుంటున్నాను. అందరూ చెప్పేవి అన్నీ సరిగ్గా జరగవు. కొన్ని మాత్రమే జరుగుతాయి. ఏ పుట్టలో ఏ పాముందో అని అనుకుంటూ నాలాంటి వారు భవిష్యత్తు సూచనల కోసం చేసే అన్వేషణల ప్రయాణం ఇది.

భవిష్యత్తు సూచకుల వద్దకు ఎక్కువమంది గృహిణులు వెళ్ళుట నేను గమనించాను. వారి సేవలు వీరే ఎక్కువగా పొందుతారు. సంసార నిర్వహణ బాధ్యత గృహిణులు చూస్తుంటారు కనుక ఆ సమస్యల పరిష్కారం కొరకు వీరు వెళ్ళుట సహజమే. మనము కోరకుండా, కొంతమంది వాక్శుద్ధి కల పెద్దవారు మన నుంచి ఏమాత్రం పైకం ఆశించకుండా ఆశీర్వదిస్తారు. అలాంటి సందర్భములలో ఆశీర్వచనం పొందినవారు ఆశీర్వచన బలంచే మంచి జరిగినప్పుడు నిజముగా సంతోషిస్తారు. అలా మంచి మనసుతో ఆశీర్వదించగలవారు ఈనాటి సమాజంలో చాలా తక్కువమంది ఉంటారు.

అన్ని వృత్తులలాగానే జాతక సిద్ధాంతులు, భవిష్య సూచకులు కూడా దానిని ఒక వృత్తిగా భావిస్తారు. తమ వద్దకు వచ్చిన వారిని మాటల నేర్పుతో, వాక్శుద్ధితో, పడికట్టు మాటలతో ఆకట్టుకుంటారు. దాన్ని వృత్తి నైపుణ్యముగా భావించవచ్చు. మనకు అర్థంకాని విధముగా చెప్పేవారు కొందరైతే, భయం కలగజేసే విషయములు మాత్రమే చెప్పి ముందుకు సాగేవారు మరికొందరు. కొందరు ఏమాత్రం చెడు విషయములు చెప్పకుండా నడిపిస్తారు. మొత్తం మీద ఏవిషయము జరుగుతుందో, ఏది జరగదో ఊహకు అందని విషయంగా వ్యవహారం నడుస్తుంది.

కొందరు  జరిగిన విషయములు చెప్పి నమ్మకం కలగజేస్తే, మరికొందరు జరగబోయే విషయాలను సరిగా చెప్పి మంచి పేరు తెచ్చుకుంటారు. ఉద్యోగ విషయములలో ఉన్నతి, బదిలీ, ఇతర ఇబ్బందులు, భార్యా భర్తల బంధము, ఆరోగ్య విషయములు, పిల్లల సీట్లు, చదువు, మార్కులు, ఆర్థిక విషయములు, ఇలా అనేక విషయములపై కావాల్సిన భవిష్యత్ సూచిక వివరణలు నమ్మనివారికి పనికిరానివిగానూ, నమ్మినవారికి అత్యవసరముగానూ కనపడి ఎంతోమందికి జీవనోపాధి కలగజేస్తాయి. వారు చేయువృత్తిలో వారికి తగిన గౌరవ మర్యాదలు కలిగిస్తున్నవి. ఖరీదైన హోమ కార్యక్రమముల ద్వారా అనారోగ్య పీడితులకు తాత్కాలిక ఉపశమనం కలిగినట్టు గమనించాను. అలానే మేలు జరగనివారు కూడా కొందరు ఉండవచ్చు. ఇలాంటి కార్యక్రమములలో పాల్గొనేవారు వాటి ఫలితములు చాలావరకు బయట పెట్టనందున ఎక్కువ నిజములు బయటికి రావు.

నా అనుభవములు లేక నాకు తెలిసిన కొన్ని విషయాలు

1. ఒక వ్యక్తి తన కొడుకు జాతకంలో చెప్పిన విషయములకు వ్యతిరేకంగా జరిగిందని, జాతక సూచకునిపై దాడికి దిగినట్టు నేను పేపర్లో చదివాను. దీనికి కారణం అతను జాతకునిపై పెంచుకున్న నమ్మకమే. ఏ భవిష్యత్తు సూచన అయినా భగవంతుని విధి లిఖితమునకు లోబడి జరుగుతుందని అతను గ్రహించకపోవడమే.

2. ఒక దేశ రాజకీయ పదవులకు పోటీ చేసిన వ్యక్తులలో ఒకరు ఓడిపోతారని చెప్పిన సూచన జరగనప్పటికీ, ఆయన చేసిన ఇతర సూచనలు నిజమై శాస్త్రంపై నమ్మకం పెంచింది.

3. కొన్ని ఏళ్ళ క్రితం ఒక ఉపాసకుని సలహాతో ప్రత్యేక దుస్తులు ధరించినా కూడా, కేవలం నా అజాగ్రత్తతో ప్రమాదం జరిగినప్పుడు జాతకం చెప్పిన వ్యక్తిని కానీ, అతని పరిజ్ఞానమును గాని నిందించలేము.

4. కొన్ని ఏళ్ళ క్రితం ఒక ఊరిలో ఒక జాతకుని కలిసినప్పుడు బండి నెంబర్ మార్చమని చేసిన సూచన ప్రకారం బండి నెంబర్ మార్చకుండా ఆ బండి వాడినా కూడా, నాకు ఏవిధమైన అపకారం జరగలేదు. చాలాకాలం తర్వాత, ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే అది మాటల పడికట్టా లేక మిగిలిన గ్రహ ప్రభావాల స్నేహ హస్తం ద్వారా జరిగిన మంచో నిర్ణయించలేని సందేహము, ప్రయోజనం అనబడే బెనిఫిట్ ఆఫ్ డౌట్ గా తెలుసుకున్నాను.

5. సరదాగా చిన్నప్పుడు కలిసిన ఒక ఉపాసకుని నా పరీక్ష విజయమును గూర్చి అడిగిన సందేహము, పరీక్ష విజయము తెలిసిన తరువాత రొటీన్ ఆనందం మిగిల్చింది.

6. కొన్ని ఏళ్ల క్రితం పొరుగు రాష్ట్రంలో గల రాజకీయ విజయం గురించి చెప్పగల ఒక ప్రముఖ జ్యోతిష్యవేత్తను కలిసి, మా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంపై తెలుసుకున్న ఫలితములు కొన్ని జరిగినవి, కొన్ని జరగలేదు.

7. కొన్ని ఏళ్ల క్రితం ఒక రాజకీయవేత్త రాష్ట్రంలో రాజకీయ ముఖ్య పదవి పొందుట కొరకు, పూజలకు డబ్బు ఖర్చుపెట్టి, ఫలితం రాకముందే మధ్యలో మరణించినట్లు తెలుసుకుని, తన మరణం గురించి ముందుగా తెలిస్తే ఆ ప్రయత్నం చేయడు కదా అని అనుకున్నాను.

8. కొన్ని ఏళ్ల క్రితం నా పదవీ విరమణ అనంతరం ఒక ఉపాసకుని కలిసి, రావలసిన ఆర్థిక ప్రయోజనముల గురించి ప్రశ్నించగా రావని చెప్పటం జరిగింది. అయినా కొన్ని ఏళ్ళ తర్వాత మంచి మనసుగల మనుషుల ద్వారా రావలసిన ఆర్థిక ప్రయోజనములో కొంత లభించినప్పుడు నిజముగా సంతోషపడ్డాను.

9. కొన్ని ఏళ్ళ క్రితం బహుమతి వచ్చే లాటరీ టికెట్ నెంబర్ చెప్పమని ఒక ఉపాసకుని  కలిసిన నేను ఆ టికెట్ కొని, దానికి బహుమతి రానప్పుడు, నాలోని అజ్ఞానం తొలగినది. డబ్బు ఎవరికీ చేదు కాదు. వారు సరిగా చెప్పగలిగినప్పుడు వారే కొనుక్కోలేరా అని అర్థమైంది.

10. 20 ఏళ్ల క్రితం ఒక దినపత్రిక ఆదివారం సంచికలో ప్రచురింపబడిన భవిష్యత్ సూచకుని విజయమును గూర్చి వ్రాసిన విషయం చదివిన తర్వాత, తదుపరి ఆదివారంనాడు, విజయవాడకు 150 కిలోమీటర్ల దూరంలోగల ఆపల్లెటూరికి వచ్చిన కొన్ని వందలమంది భవిష్య ఆశావహుల సందడి మినీ ఇండియా భవిష్య ఆశావహుల కోరికల సభగా కనబడింది. ఆరోజు అక్కడికి వచ్చిన ఎంతమందికి సరి అయిన ఫలితములు వచ్చినవో నాకు తెలియదు.

11. కొన్ని ఏళ్ళ క్రితం ఒక జిల్లా కేంద్రంలో నివసించే ఒక సిద్ధాంతి తగిన రుసుముతో చాలా కాలం క్రితం ఇంటి నుండి తప్పిపోయినవారిని తన మంత్ర శాస్త్ర ప్రభావంతో వెనుకకి రప్పించే సందర్భమును బాధితుల కుటుంబీకులు ఒక దైవ సహాయముగా భావించేవారు.

పైన ఉదహరించిన అనుభవములే కాకుండా, మరికొన్ని జరిగిన, జరగని భవిష్య సూచనలను విశ్లేషించిన తర్వాత ఈ విధంగా అభిప్రాయపడుతున్నాను. జ్యోతిష్యం చెప్పువారు కానీ, దైవ ఉపాసకులు గాని వారి వృత్తిలో మిక్కిలి కృషి చేస్తారు అనుటలో ఏవిధమైన సందేహం లేదు. అయితే వారు సాక్షాత్తూ దైవం కాదు, గనక వారు చెప్పే విషయాలు కొన్ని జరుగును, కొన్ని జరగవు. జరిగే వాటికి కొన్ని కారణములు ఉంటే, జరగని వాటికి మరికొన్ని కారణాలు ఉండవచ్చు. వారి సామర్థ్యం అంచనా వేయుటకు నాశక్తి చాలదు. నాకు అర్థమైంది ఒకటే. మన విచక్షణతో కూడిన జాగ్రత్తను,  అధిక ఖర్చుతో కూడిన పరిహారముల జోలికి పోని విధమును మనం మరచిపోరాదు. మానవులకు లేని సమదృష్టి కారణంగా దైవ న్యాయం, మానవ న్యాయము ఒకేలా ఉండాలని లేదు.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.