Sunday, February 14, 2021

ఆతిథ్యము

ఆతిథ్యము అనగా మన ఇంటికి వచ్చినవారికి ఏ మాత్రం అసౌకర్యం కలగని విధంగా ఆదరించుట కానీ, మర్యాదలు చేయుట కానీ అనుకోవచ్చు. 

మనము అవతలివారిని ఎలాగా చూస్తామో మనని వారు అలాగే చూస్తారనే నమ్మకం దీంట్లో కలిసి ఉంది.

మేము ఒక ఊరికి  పనిమీద రాత్రి 10 గంటలకు వెళ్ళినప్పుడు, ఆ ఇంటి ఆడపిల్ల సుమారు 16 లేక 18 ఏళ్ళ వయసులో ఉండి, మాకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో చూపిన శ్రద్ధ, నెమ్మది, సహనంతో ప్రవర్తించిన తీరు ఇప్పటికీ గుర్తుంది. కానీ దురదృష్టం, ఆ అమ్మాయికి వివాహం అయిన పదిహేనేళ్ళలోపు భర్త రోగగ్రస్తుడై మరణించడం ఇప్పటికీ బాధగా ఉంది.  

ఆతిథ్యంతో పర్యాటక రంగమునకు సంబంధం ఉంది.

దీనిలో భాగంగా మూడు రకాల ఆతిథ్యములను గూర్చి తెలుసుకుందాం.

1. నోరూరించే ఆతిథ్యము: మనము ఎప్పుడైనా రోడ్డు పక్కన వెళ్తున్నప్పుడు ఆతిథ్యం ఇచ్చే కొన్ని ప్రదేశములనుండి నోరూరించే వాసనలు మనలను దృష్టి మళ్లించి, ఆతిథ్యము మనకు కూడా దొరుకుతుందా అని ఆశపడతాము. ప్రపంచంలో ఎవరూ ఎవరికీ ఊరికే ఆతిథ్యం ఇవ్వరని గ్రహింపు కలగానే ఆఆశ తగ్గుతుంది.

2. దౌత్యపరమైన ఆతిథ్యము: ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన బంధములను బలోపేతం చేసుకొనుటకు జరిగే మర్యాదగా చెప్పుకుందాం.

3. అతిథి గృహం ఆతిథ్యము: పూర్తిగా వ్యాపార ప్రయోజనములు కాపాడుకొనుటకు, అధికారంలో ఉన్నవారి మనసు గెలిచి, వ్యాపారాభివృద్ధి లక్ష్యంగా వారి కోరికలను పూర్తిగా తీర్చే ఉద్దేశ్యంతో ఇవ్వబడేదే అతిథి గృహ ఆతిథ్యము. పూర్తిగా వ్యాపార దృక్పథంతో జరిగినా, ఇరువురి  ప్రయోజనాలు కాపాడే ఈతరహా ఆతిథ్యము ఇద్దరికీ సంతోషం కలిగించేదే.

అతిథి మర్యాదల గురించి తెలుసుకుందాం.

1. ప్రోటోకాల్ మర్యాద: కొందరు అధికారులు, రాజకీయ ముఖ్యులు వారి హోదాకు తగ్గట్టు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా వారు వెళ్లిన చోట కల్పించబడే సౌకర్యములను ప్రోటోకాల్ మర్యాదలుగా భావించవచ్చు. ఈ మర్యాదలు ఇతరులు కూడా తమ పరపతిని ఉపయోగించి పొందుతారు. కొన్నేళ్ల క్రితం ఒక ప్రముఖ నటి ఒక దేవాలయంలో తనకు తగిన మర్యాదలు జరగలేదని బాధపడటం పేపర్ ద్వారా చదివి తెలుసుకున్నాను. దీనిని అధికార మర్యాదగా అనుకోవచ్చు.

2. కొందరు మాజీలు, అధికారం కోల్పోయిన తరువాత, పాత అధికార జ్ఞాపకములను వదలలేక తమకు తగిన గుర్తింపు, మర్యాదలు దొరకలేదని దురుసుగా ప్రవర్తిస్తే దానిని అహంకార మర్యాదగా అనుకోవచ్చు. దాని వల్ల జరిగే మేలు వారి అదృష్టంపై ఆధారపడి ఉంటుంది.

3. గృహస్తు మర్యాద: ప్రముఖ యాత్రాస్థలములు, దేవాలయములు ఉన్నచోట నివసించేవారికి అతిథుల తాకిడి ఎక్కువ. వీరికి భోజనఏర్పాట్లతో పాటు మధ్య, మధ్య కొంత డబ్బు సర్దుబాటు చేయాల్సి వస్తుంది. కొన్ని ఏళ్ళ క్రితం, ఒక ప్రముఖ దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళినప్పుడు, డబ్బు పోగొట్టుకుని తిరుగు ఛార్జీల నిమిత్తము డబ్బు కొరకు దూరపు బంధువుల ఇంటికి వెళ్లి వారిదగ్గర చేబదులుగా తీసుకున్న మొత్తం మనీ ఆర్డర్ ద్వారా పంపి ఊపిరి  పీల్చుకున్నాను. వారు డబ్బు ఇచ్చేటప్పుడు తిరిగి వస్తుందో, రాదో అని సంశయము పడ్డారని నేను భావించి వారి డబ్బులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తిరిగి పంపినాను. యాత్రాప్రదేశములలో ఉండేవారు సంతోషంగా ఉండరు. ఏసమయంలో ఏ బంధువు, పరిచయస్తుడు వారి తలుపు తడతాడో తెలియని పరిస్థితి. నెలమొత్తంలో ఎవరో వస్తారని, తారీఖులతో సంబంధం లేకుండా దిగే అతిథుల సౌకర్యంలో భాగమైన కిరాణా సరుకుల ఏర్పాటుతో సిద్ధంగా ఉండి, ఇంటిలోని వారందరూ అతిథులకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా చూసుకొనుట గృహస్థులకు నిత్య పరీక్షగా అనుకోవాలి. గృహస్థుగాని, ఇంట్లోవారు గాని ఏమాత్రం విసుక్కున్నా బంధుత్వాలు చెడిపోతాయి.

ఈ సందర్భంలో దుర్వాసముని, అంబరీషుని కథ జ్ఞాపకం చేసుకుందాం. అంబరీషుడు అనే రాజు వద్దకు దుర్వాసముని వచ్చి ఆతిథ్యం స్వీకరించే సందర్భంలో తమకు అతిథి మర్యాదలలో లోపం జరిగిందని ముని రాజుకు శాపమిచ్చు సందర్భము భక్తులను రక్షించుటలో భగవంతుని కరుణ మనకు తెలియజేస్తుంది. ఆతర్వాత క్రమంలో గజేంద్రమోక్షం అనే ఆధ్యాత్మిక పరిణామంతో అనేక సందేహములు తొలగుతాయి.

మానవుడు సంఘజీవి, బంధుజీవి, పరిచయజీవి. మనకు ఉన్న లోక సంబంధముల దృష్ట్యా ఇంటికి వచ్చినవారిని ఆదరించుట గృహస్థు ధర్మంగా చెప్పాలి. ఈ కరువు కాలంలో ద్రవ్యోల్పణం వలన ధరలు పెరిగినప్పటికీ, ఇంటికి వచ్చిన వారికి మర్యాదలు చేయుట మన బాధ్యత. పనిలో పనిగా సన్యాసులను ఆదరించుట గృహస్థు ధర్మములో ఒకటిగా చెప్పబడింది. గృహస్థు మర్యాదలలో భాగముగా ఈ క్రింది పద్ధతులు ఉన్నాయి.

మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, వారిని ఆహ్వానిస్తూ కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు ఇచ్చి,  కాళ్ళు, చేతులు తుడుచుకోవడానికి శుభ్రమైన వస్త్రం ఇచ్చి, కూర్చొనుటకు ఆసనం చూపించి, గాలి కొరకు ఫ్యాన్ వేసి, వచ్చిన సమయమును బట్టి కాఫీ, టిఫిన్, అన్నవసతి మొదలైనవి ప్రతివారు పాటిస్తారు. కరోనా జాగ్రత్తలో భాగముగా చేతులకు హ్యాండ్ వాష్, డిస్ ఇన్ఫెక్టెంట్ కొత్తగా జత కలిశాయి. ఆతిథ్యమునకు మర్యాదలో శిక్షణ కూడా ఉంది. కరోనా సమయములో పాటించిన జాగ్రత్తల వల్ల అతిథులు తగ్గి, కొంతమందికి అతిథి మర్యాదలలో విరామం వచ్చింది.

4. ఇంకొక మర్యాదగా పర్యాటక శాఖవారితో జత కలిసిన మర్యాద. దాని పేరు పర్యాటక మర్యాద. వారివద్ద రిజిస్టర్ చేసుకున్న గృహస్థులకు పర్యాటక శాఖవారిచే కొన్ని యాత్రాప్రదేశములలో వారికి కావలసిన సౌకర్యములు ఏర్పాటు చేయయ్బడతాయి. వారి ఇంటివద్దనే చెల్లింపులతో కూడిన అతిథి మర్యాద రుసుములు ఉంటాయి, కనుక ఆర్థిక ప్రయోజనం ఉంది.

పర్యాటక రంగము గూర్చి చెప్పుకుందాము. పర్యాటక రంగంలో ఆశించినంత అభివృద్ధి జరగలేదని, ఇంకా సౌకర్యములు పెరగాలని కోరుకునేవారు చాలామంది ఉంటారు. వారి ఆశలు నిజము చేస్తూ అభివృద్ధి జరగాలని, దానిద్వారా మరింత మందికి జీవనోపాధి కలగాలని కోరుకుందాము. ఈ రంగంలో కల హోటళ్లు కూడా పర్యాటకరంగ అభివృద్ధితో వృద్ధిచెంది, నిరుద్యోగులకు మేలు జరగాలని అశిద్దాం.

అతిధి మర్యాదలు భారతీయ సంస్కృతిలో భాగమని అనుకుని, వాటిని పాటిద్దాం.

              అతిథి దేవోభవ

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.