ప్రకృతిలో మన ప్రమేయం లేకుండా శరీర భాగములు నిలబెట్టుటకు ఉపయోగపడే ఆహార పదార్థములను స్వీకరించుటలో తీరే ఆకలి గురించి కాక, ఎక్కువమంది కోరుకొనని, మనసుకు బలం ఇచ్చే దైవాన్వేషణ అనే ఆకలి గూర్చి చెప్పుకుందాం.
శరీర అవయవములకు శక్తినిచ్చుటకు బయటపడే ఆకలి దాని అవసరాలు తీర్చనప్పుడు ఎంతటి నేరమునకు అయినా పాల్పడేట్టు చేస్తుంది. ఈ ఆకలి తీరుటకు అన్ని వర్గాలకు చెందినవారు చేసే కృషి వలన మానవునికి కావలసిన ఆహార పదార్థాలు అన్ని మార్గముల ద్వారా అందునని అందరికీ తెలిసినదే. ఈ ఆకలి తీరుటకు దానిలో పాలుపంచుకుంటున్న అనేక వర్గములు, వృత్తులకు సంబంధించిన ప్రజల కృషి ద్వారా దేశసంపద పెరిగి అందరూ సుఖముగా ఉండుటకు తోడ్పడుతుంది.
దైవాన్వేషణకులకు కలిగే దైవసాక్షాత్కార కోరిక లేక ఆకలి తీవ్రమై, అన్వేషణలో అది తీరుటకు ఒంటరిగా ప్రయత్నాలు చేస్తారు. జీవితకాలమంతా చెయ్యాల్సిన ప్రయత్నము ఎప్పుడు ఫలిస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉంటారు. అప్పుడే మనకు గురువు సహాయం అవసరమవుతుంది. సరైన మార్గదర్శకము జరిగి, గురువు లభించినప్పుడు వారి మార్గంలో ఆటంకం లేకుండా ముందుకు సాగుతారు. గురు మార్గదర్శకత్వంలో వారి ప్రయాణం ఆకలి తీరుటకై చేసే విజయ సాధన నల్లేరుపై నడకలా సాగుతుంది.
పర్వతారోహకులు పర్వతములు ఎక్కడానికి ఎంత కఠోర పరిశ్రమ చేస్తారో ఊహించి మీ కృషిని పెంచి ఫలితం అందుకోండి. వెనుకటి రోజులలో పిల్లల అభివృద్ధికి అనేక గురుకులములు ఉండి వారి ఆలనా పాలనా గురుకులములవారే చూసుకునేవారు. ఈ కాలంలో పిల్లల చదువులు నిముష, నిముషములకు తల్లిదండ్రుల పర్యవేక్షణలో జరుగుట తప్పనిసరి. పిల్లల బాధ్యత గురుకులముల వారి పర్యవేక్షణలో ఉండగా, గృహస్తులు వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యత చూచుకుంటూ కుటుంబ పోషణ జరుపుకునేవారు. ఎక్కువగా కులవృత్తులు వ్యవసాయ జీవనాధారంగా జరిగేవి. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల బాధ్యత తప్పక పోయినా ఉమ్మడి కుటుంబాలు తగ్గిన సందర్భంలో వెలిసిన అనేక వృద్ధాశ్రమాలు వృద్ధుల బాధ్యతలు కొంతవరకు పరిష్కరిస్తున్నాయి. ఈ సమస్యలు తీరిన తరువాత ఒంటరిగా దైవాన్వేషణ చేయాలంటే వానప్రస్థాశ్రమ స్వీకారము మనసులో ఉంటే కొన్ని ఆశ్రమములు రుసుములతో అవకాశం కలిగిస్తున్నాయి. అక్కడ మనకు అనుకూలంగా ఉంటే సరి లేదా అక్కడ కూడా మన పూర్వ జీవితంలో పడిన సమాజ పరమైన ఇబ్బందులు తిరిగి మనకు తటస్థపడితే మన శక్తియుక్తులు దాని తీవ్రత తగ్గుటకు వినియోగించి, దానిపై విజయం సాధించాలి. కొన్ని మానవ స్వభావములు అదుపులో ఉంచుటకు చేయు ప్రయత్నాలు కూడా దైవసాధనలో భాగంగా అనుకోవాలి.
ఇది చదివిన తరువాత ఎవరైనా ఇంత కష్టపడి చేసేది దైవాన్వేషణా అని అనుకుంటే అవునని చెప్పాలి. మనకు ఉపయోగపడని, ఏమాత్రం మేలు చేయని స్వభావములను అదుపులో ఉంచుట, మరియు తోటివారి స్వభావం వల్ల పడిన ఇబ్బందులపై శత్రుత్వం పెంచుకోక సహనము, ఓర్పుతో సర్దుకుపోయేవారికి దైవాన్వేషణలో ఇది కూడా ఒక మెట్టు అని దానిని ఎక్కిన తర్వాత అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. దైవాన్వేషణ ఇంత కష్టమా అని అనుకునేవారికి చిన్న మాట. ప్రయత్నం చేయండి, ఫలితం పొందండి.
వెనుకటి రోజుల్లో కాశీ ప్రయాణం చేసినవారు తమ జీవిత యాత్రలో అదే చివరి మజిలీ అని భావించి, అనేక కష్టనష్టములు భరించి,
కఠినమైన కాలినడకతో అనేక మజిలీలు చేసి, కాశీ చేరేవారు. ఈ ప్రయాణములో రోగముల బారినపడి,
దొంగలు కొట్టి, చేతిలోని డబ్బు పోగొట్టుకున్నవారు, చనిపోయినవారు కొందరున్నారు.
ఏమాత్రం ధనము చేతిలో లేనివారు కూడా ఉదార స్వభావులైన ధనవంతులు నిర్మించిన సత్రములలో
బస చేసి ఎక్కడికక్కడ ఏర్పడిన పేదరాశి పెద్దమ్మ ఇంట భోజనము స్వీకరించి తమ కాశీయాత్ర
కల సఫలం చేసుకున్నారు. బ్రిటిష్ వారు దేశంలోకి వచ్చిన తరువాత, రైలు మార్గం ఏర్పడి
రైలు ద్వారా కాశీయాత్ర తొందరగా చేసేవారు. మారిన పరిస్థితులలో సూపర్ ఫాస్ట్ రైలు
విమానాల ద్వారా కాశీయాత్ర చాలా సులభం
అయినది. దుర్లభమైన కాశీ యాత్ర మీద ఒక సామెత ఉన్నది - "కాశీకి పోయినవాడు, కాటికి
పోయినవాడు ఒకటే".
కాశీయాత్ర కష్టములు పోల్చుకొని భారతీయ శిక్షాస్మృతిలో ఒక భాగమైన విషయము - ఇంటిని విడిచి పారిపోయిన వారిని 7ఏళ్లు దాటితే చనిపోయినట్లుగా నిర్ధారించే చట్టం వచ్చి ఉండడానికి కారణం కఠినమైన కాశీయాత్ర అని కొందరు భావిస్తారు. బనారస్ చీరలకు ప్రసిద్ధి. కాశీలో వెలసిన అనేక అన్నసత్రములు యాత్రికులకు అన్నదానం చేస్తాయి. కాశీ గురించి చెప్పాలంటే భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే అనేక విద్యలకు నేర్పే స్థానముగా దానికి గుర్తింపు ఉంది. అందుకనే అక్కడికి చాలామంది విద్యాభ్యాసమునకు వెళ్లి సుమారు 7ఏళ్లు చదువుకొని, పాండిత్యము సంపాదించి, తమ ఊర్లకు తిరిగివచ్చి, జీవనం చేసేవారు. కాశీలో శివుని కంటే గంగాస్నానమునకు ప్రాముఖ్యం ఇస్తారు. భారతీయలలో హిందూ మత విశ్వాసములు బలంగా నమ్మేవారు కాశీలో మరణము మోక్షం కలిగిస్తుందని నమ్ముతారు. ఈ నమ్మకం ఎంత బలమైనది అంటే కాశీకి చుట్టుపక్కల 150 కిలోమీటర్ల దూరములో ఉన్న ఊర్ల నుండి అనేక శవములు లయహరుడైన శివుని సన్నిధానములో దహనమునకు వచ్చుట అనునది ప్రత్యేక విశేషముగా భావిస్తారు. జ్ఞానసిద్ధికి సరస్వతీదేవిని అనుగ్రహ మాతగా భావిస్తే, కాశీలో కొలువైన శివుని భార్య అయిన అన్నపూర్ణ మాతను మానవ శరీరమునకు అత్యవసరమైన ఆకలి తీర్చు తల్లిగా భక్తులు స్మరిస్తారు. కాశీయాత్ర దైవాన్వేషణలో భాగముగా భావించి వ్రాయుట జరిగింది.
దైవాన్వేషణ మనిషి జీవితంలో భాగము కావాలి. దైవాన్వేషణ లేక దైవ అనుభూతి పొందాలనే కోరిక అతి చిన్న బిందువై, క్రమముగా విస్తరించి, బలమైన పెద్ద బిందువుగా మారి, దృఢ సంకల్పం అయినప్పుడు విజయం సాధించవచ్చు. ఇందుకు పూర్వజన్మ సంస్కారం, ఈజన్మలో చేసిన మంచి పనులు సహకరిస్తాయనే అభిప్రాయం ఉంది. తమ న్యాయమైన కుటుంబ బాధ్యతలు తీర్చిన తర్వాత, ప్రాపంచిక వ్యవహారములకు తక్కువగా స్పందిస్తూ, సన్యాసం స్వీకరించని వైరాగ్య భావనతో మీకు నచ్చిన దైవ మార్గంలో ముందుకు సాగితే, విజయం సాధించవచ్చు. సన్యాసి జీవితం సంతోషం కాదు. సన్యాసి తన దైనందిన అవసరములను గృహస్తుల ద్వారానే తీర్చుకోవాలని గమనించండి. ఎన్నో సంవత్సరములు తపస్సు చేసి విజయం సాధించలేనివారితో పోల్చుకోక, తక్కువ సమయములో శివదర్శనము మరియు అనుగ్రహం పొందిన మార్కండేయుని ఆదర్శంగా పెట్టుకొని విజయం సాధిద్దాం.
కాశీ సందర్శన మనోవాంఛాఫల సిద్ధిరస్తు - అన్నపూర్ణా మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు - సకల పుణ్య ప్రాప్తిరస్తు.
No comments:
Post a Comment