Sunday, January 31, 2021

ప్రకృతి శక్తులు - కనబడే, కనబడని శత్రు, మిత్రులు

మనకు ఏ రూపంలో అయినా అవతల వారి చర్య వలన నష్టము జరిగి బాధపడితే దానికి కారణమైన వారిని శత్రువుగాను, ఉపకారం జరగకపోయినా అపకారం జరగనంత కాలం వారిని మిత్రునిగా  భావిస్తాము. 

ఈ విభజన సమాజమునకు, దేశమునకు కూడా వర్తిస్తుంది. దొంగదెబ్బ తీసే శత్రువు మనకు కనపడడు. మిత్రులు అందరికీ కనబడరు. శత్రువులు అందరూ కనపడకుండా ఉండరు. దేశాల మధ్య కూడా మిత్ర, శత్రుత్వము ఉంటాయి. నమ్మకముతో పొరుగు దేశాల ఆర్థిక మూలములపై దెబ్బతీసే చర్యలతో పాటు రోగములు కలగజేసే సూక్ష్మ క్రిముల విడుదల కూడా  శత్రుత్వములో ఒక భాగమే. కొన్ని దేశములు తమ ఆర్థిక ఒప్పందం ద్వారా ఇతర దేశములకు అందజేసే స్నేహ హస్త సాయం ద్వారా వారి సహాయం అందుకున్న దేశములలో మిత్రునిగా భావించబడతారు. ఈక్రమములో అంతర్జాతీయ క్రీడాకారులు, కళాకారులు వారి దేశపు సాంస్కృతిక రాయబారిగా గుర్తింపబడతారు.

కనపడని శత్రువుగా మనలోని దుర్గుణాలు అయిన కోపము, పగ, అసూయ మొదలైనవి చెప్పుకోవచ్చు. అవి కూడా అదుపు తప్పినప్పుడు కొంత హాని జరుగుతుంది. శత్రుభావంలో  యుద్ధంగా భావిస్తే  కనపడని శత్రువుగా మానవ రహిత ఆయుధ ప్రయోగమును పోల్చుకోవచ్చు. కనబడని కనబడే మిత్రులు - శత్రువులుగా పంచభూతములు అయిన గాలి, నీరు, ఆకాశం, భూమి, అగ్ని కూడా అనుకోవచ్చు. అవి ఆగ్రహించినప్పుడు జరిగే హాని భయంకరము. దానిని ఎవరూ ఆపలేరు. ఆటవిక సంపదలో భాగమైన అడవులు, జంతువులు, ఇతరమైన వాటిని విచక్షణ రహితముగా విధ్వంసము చేయటం వల్ల ప్రకృతి సమతుల్యం లోపించి భావితరాల వారికి కనీసము పరిశుద్ధమైన గాలి దొరుకుతుందో, లేదో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాంక్రీట్ కట్టడములువెలసిన జనారణ్యాలవల్ల వాతావరణమునకు హాని జరుగుతుందని కొందరు భావిస్తారు. అందువలన పర్యావరణ శాస్త్రవేత్తల సూచనలు పాటించడం మేలు.

సూక్ష్మముగా ఆలోచిస్తే ఎవరు మిత్రులు, ఎవరు శత్రువు అని జ్ఞాన సంపన్నులు భావిస్తారు. షిరిడి సాయిబాబా మాటల్లో అవతల వ్యక్తి పంచే ప్రసాదము అందుకోని ఒక భక్తుడు అతనితో  అభిప్రాయ భేదం ఉన్నదని చెప్పగా, అతనిని శత్రువుగా భావించవద్దని, ఇచ్చేది, పుచ్చుకునేది, తినేది ఎవరని చెప్పారు. భగవంతుడు ఉన్నాడని నమ్మేవారు ఆయన లీలల ప్రకారమే అన్ని విషయములలో శత్రు, మిత్ర ప్రభావ చర్యలు జరుగుతాయని అనుకుంటారు.
శత్రుత్వ, మిత్ర భావములు ఎదుటి వారి మనసులో ప్రతిబింబించిన భావవ్యక్తీకరణ ద్వారా బయటకు వచ్చినప్పుడు మాత్రమే మనము వారిని మిత్రులు లేక శత్రువులుగా భావిస్తాము. ఎదుటి వారి మనసులో మాటలను గ్రహించే శక్తి సగటు మనిషికి ఉండదు. నిజముగా ఎదుటి వారి మనసులో ఏముందో తెలుసుకోగల శక్తి  ఉంటే లేదా ఏదైనా ఆధ్యాత్మిక సాధన ద్వారా అది లభించిన వారిని మన కంటే గొప్పవారిగా చూస్తాము. వారి జీవితంలో ఏ లోటు ఉండదని, సంతోషంగా ఉంటారని అనుకుంటాము. ఇది నిజము కాదు. ఆ శక్తి అతని దగ్గర ఉన్నంత కాలము అతను సంతోషముగా ఉండలేడు సరి కదా నరకప్రాయం అయిన మనశ్శాంతి లేని జీవితం అతని సొంతమవుతుంది.
శత్రుత్వ , మిత్ర భావములు జీవితకాలంలో ఒకటిగా ఉండవు. పరిస్థితుల ప్రభావంతో ఈరోజు మిత్రుడు రేపు శత్రువుగా, శత్రువు మిత్రునిగా మారవచ్చు. అలాంటి సందర్భంలో మనకి కనపడే మిత్రుడు కనబడని శత్రువుగా, కనబడని శత్రువు కనిపించే మిత్రుడిగా రూపాంతరం చెంది ముందు వర్గీకరించిన నిర్వచనం మారుతుంది. కరోనా కష్టకాలములో స్పందించిన మనసుతో బాధితులకు సహాయం అందించినవారు బాధితుల దృష్టిలో కనబడే మిత్రుడిగా భావించబడతారు.

రోడ్డు మీద ప్రయాణంలో ప్రమాదం చేసినవారు మనలను ఇబ్బంది పెట్టి కష్టాలపాలు చేస్తే వారిని తాత్కాలిక శత్రువులుగా భావిస్తాం. ఇలాంటి ప్రమాదములు కలగజేసే వారితో మనకు పూర్వ పరిచయము లేక వారిని మనం ఎప్పుడూ చూడకపోయినా, కనబడే, కనబడని శత్రువుగా అనుకోవచ్చు. ఇంకొందరు వారి మంచిపని వలన మనకు సహాయం లభించినప్పుడు వారిని మిత్రులుగా గౌరవిస్తాము. ఉదాహరణకు మనము దైవదర్శనం యాత్రలో గుడిలోగాని, సత్రంలో గాని అన్నదానం స్వీకరించినప్పుడు గుప్త దాత ద్వారా మనము చూడని తెలియని వ్యక్తి సహాయం అంది, ఆకలి తీరినప్పుడు కనబడే, కనబడని మిత్రునిగా గౌరవిస్తాం.

ఈ క్రమములో 50 ఏళ్ల క్రితం నా సొంత ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో ఉండి ఉద్యోగం చేయుచుండగా నా కుటుంబంలో వచ్చిన ఇబ్బందులకు స్పందించిన నా పొరుగు వ్యక్తి నేను కానీ, నా కుటుంబ సభ్యులు గానీ నోరు తెరిచి అడగకనే  తన సొంత ఖర్చులతో 300 కిలోమీటర్ల దూరంలో గల హైదరాబాద్ వెళ్లి తనకు తెలిసిన వారి ద్వారా నా కుటుంబం గల ఊరికి 12 కిలోమీటర్ల దూరంలో గల ప్రదేశమునకు బదిలీకి చేసిన సఫల ప్రయత్నం ఆ మిత్రుని మంచి మనస్సును గాని, సహాయమును గాని మర్చి పోలేని అనుభూతిని మిగిల్చింది.

పర్యావరణ రక్షణలో భాగంగా కొన్ని ఏళ్ళ క్రితం నేను చదివిన  పేపర్ వార్త. పొలములలో ఉండే నత్తలు పొలములో ఉండే పంటను నాశనం చేసే క్రిమి కీటకములను నిర్మూలిస్తాయి అని, నత్తలను విచక్షణ రహితంగా చంపడం పర్యావరణముకు హాని అని తెలుసుకున్నాను. శత్రు, మిత్ర భావములు పోషించే ప్రకృతి శక్తులను రక్షించుకుందాం. అవే మనకు కనపడే, కనబడని శత్రు, మిత్రులని మర్చిపోరాదు. పర్యావరణ నాశన చర్యలు ఆపుదాం. విచక్షణారహిత అటవీ సంపద నాశనమును తగ్గిద్దాం.

సహాయం చేసే స్నేహ హస్తం అందించిన వారిని మిత్రునిగా గుర్తిస్తూ మిత్రులకు శుభము, శత్రువులకు వారి శత్రు భావ నాశనం జరగాలని కోరుకుందాం. ఈ వ్యాసం చదివి శత్రు, మిత్రుల గురించి బాహ్య దృష్టిలో తెలుసుకున్నాము కానీ అంతర్దృష్టి లో వేరు భావమై అంతర్గత గుణములైన మంచి, చెడు గుణములను విశ్లేషించుకుని మనలోని భగవంతుని దర్శించుటకై మిత్రుల సాయము, శత్రువుల అదుపు ద్వారా ప్రయత్నిద్దాం. అదే మానవజన్మకు సార్ధకత అని నమ్ముదాం.

        సర్వేజనా సుఖినోభవంతు

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...