Wednesday, February 17, 2021

దైవమును ఎందుకు చూడాలంటే - 2

పనిలోపనిగా కొన్ని స్వయంభువు క్షేత్రములను గూర్చి తెలుసుకుందాము. స్వయంభూదేవాలయములు శివ, వైష్ణవ, ఇతర దేవాలయములు స్వయంగా వెలసిగాని, మనకి ఊహ తెలియని కాలంలో మహర్షులచే ప్రతిష్ఠింపబడినవానిగా చెప్పుకోవచ్చు. 

వీటి దర్శనము, పూజల ద్వారా ఫలితము తొందరగా లభిస్తుందనే నమ్మకం బలంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోగల ర్యాలీ వద్ద గల శివాలయం, మధిర దగ్గర జమలాపురం వెంకటేశ్వరస్వామి ఆలయం, గుంటూరు జిల్లా తెనాలి దగ్గర గల వైకుంఠపురం వెంకటేశ్వర ఆలయం,  జగ్గయ్యపేట వద్దగల తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి గుడి. ఇలాంటి కొన్నింటిని స్వయంభువుగా జనం భావిస్తారు. ఇంకా చాలా ఉండవచ్చు.

పురాణకథల ద్వారా మనకు తెలిసిన యయాతి రాజు కథను జ్ఞాపకం చేసుకుందాం. యయాతి అనే రాజు వృద్ధాప్యంలో వచ్చినా కూడా, శృంగార సౌఖ్యంపై తనకు గల ఆశ తీరక తన కొడుకులలో ఒకరి వద్ద నుండి యవ్వనం స్వీకరించి,  కొంతకాలము తరువాత తృప్తిపడి, యవ్వనం కొడుకుకి తిరిగి ఇచ్చిన వైనం మానవ జీవితంలో అనేక విషయములలో తృప్తి పడుట అను దానిని సమతుల్య జీవన విధానములో భాగంగా భావించినా, తృప్తి దైవాన్వేషణకు పనికిరాదు. జ్ఞానవంతులు తాము చేసేపనులలో కనిపించే అహంకార ప్రవర్తన కన్నా, భక్తిపరులు తాము చేయు పనులలో ఫలితము భగవదర్పణ  చేసిన విధము వారిని దోష రహితులనుగా చేసి, వారిని ఒకప్పుడు దైవానుభూతి మార్గములో ముందుంచవచ్చు.

చావుపుట్టుకలు అనంతమైన జీవితచక్ర పరిభ్రమణములో ఒక రహస్యము. దానిని కనుగొనుటకు ప్రయత్నించినప్పుడు, చావుపుట్టుకలు మన చేతిలో లేవని గ్రహించినప్పుడు పూర్తి వైరాగ్య భావము కలిగి ఆమార్గంలో కొంతమంది ప్రయత్నించవచ్చు. నమ్మకము, విశ్వాసముతో నడిచే సంకల్ప యాత్రలో మధ్య మధ్య మనకు లభించే అవకాశములను సద్వినియోగం చేసుకున్నప్పుడే మన కృషి విజయవంతం అవుతుందని నమ్మాలి. పాపపుణ్యములపై లోకములో ఇచ్చే విషయ విచారణ కన్నా, మరణానంతర జీవితంపై జరిగిన సైంటిఫిక్ విశ్లేషణలు పూర్తిగా మనకు తెలియవు. జన్మ పరంపర రహస్యములు తెలుసుకునే విధానంలో భగవంతుని గూర్చి తెలుసుకొని, ఆయన అనుగ్రహం పొందుదాము.

మనకున్న కోరికలకు సంబంధించి, అందుతున్న సౌఖ్యములకు తృప్తిపడి, అత్యాశకు పోక మానవ జీవిత సార్థకతకు దైవరహస్యములు, సృష్టి విధానముపై సరైన అవగాహన కొరకు, ఈవిశ్వమును నడిపించే రహస్యములు తెలుసుకొనుటకు, దానికి మూల కారణమైన దైవాన్వేషణకు సఫల ప్రయత్నం చేద్దాము.

దేవుని ఎందుకు చూడాలనో, చూడకపోతే ఏమిటి నష్టం అని అనుకునేవారికి చిన్నమాట. కొందరు ఈభూమ్మీద అన్ని సౌకర్యములు అనుభవించుతూ, మరికొన్ని సౌకర్యములు కావాలంటే, తమకు గల ఆర్థిక వనరుల ద్వారా ఏర్పరచుకోవచ్చని అహంకారంతో కూడిన భ్రమలో ఉంటారు. 

ఈ ప్రపంచంలో ఎవరి జీవితమూ వడ్డించిన విస్తరి కాదు. జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి. ఈ సందర్భంగా వందల ఎకరాలు గల సంపన్నుడైన భూస్వామి ప్రకృతి వైపరీత్యం వల్ల పొలము మేటవేసి పొలముపై ఏమీ ఆదాయం రాని విషయం చెప్పుకోవాలి. కలిమి లేములు కావడి కుండలు అని నమ్మే మనము విధి బలీయం అని, దానికి తరతమ భేదాలు ఉండవని గ్రహించాలి. ఎవరికి ఏ కష్టం, సుఖం ఎప్పుడు వస్తాయో లేదా అనుకోని ఉపద్రవం, సంతోషం కలుగుతుందో తెలియని విధము అంతుపట్టని సృష్టి రహస్యం. దానిని మాయ లేక మహామాయగా అనుకోవచ్చు. 

మనతో పాటు జీవించే క్రిమి, కీటకాలు ప్రాణశక్తి ఉన్నప్పటికీ, పుట్టిన వెంటనే మరణించటం చూస్తాము. వానికి లేని జ్ఞానము మానవులకు కలదని భావించే మనము దానిని భగవంతుని అనుగ్రహంతో అనేక రహస్యములు తెలుసుకొని, తరువాతి తరాలకు ఈసృష్టి రహస్యం అందిద్దాం. ఇదే మన భవిష్యత్ తరాల వారికి మనం ఇవ్వగల అత్యుత్తమ కానుక. సృష్టి రహస్యం  తెలుసుకోవడం అంటే అవగాహన స్పష్టంగా లేని అనేక విషయములపై అవగాహన కొరకు చేయు ప్రయత్నమే.

భగవంతుని నమ్మేవారికి, నమ్మనివారికి చివరిగా ఒక మాట. కేవలము నమ్మకముతో సాగే ఈప్రయాణంలో అనేక వాద, ప్రతివాదములకు అవకాశం ఉన్నందున, అనవసరమైన వాదములతో మీ పరిమిత జీవిత కాలం వృధా చేసుకోకండి. ఎవరి సంతోషములు, ఆలోచనలు వారివి. ప్రతి వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా, అందుబాటులో గల సుఖ, సౌఖ్యములు అనుభవించండి. ఎవరి మార్గం ఏదైనా, సరిహద్దులు ఎవరూ మూయలేదు. పరిస్థితుల ప్రభావంతో నాస్తికులు ఆస్తికులుగా, ఆస్తికులు నాస్తికులుగా మారవచ్చు. ఇందుకు ఉదాహరణగా ప్రయాణములో ఇబ్బంది వచ్చినప్పుడు ప్రయాణం, మార్గము మార్చుకొనుట చెప్పుకోవచ్చు. ఆస్తికులు గమనించవలసిన ముఖ్య విషయం దైవము ఎప్పుడు ఎవరిని అనుగ్రహించునో తెలియని విధమే సృష్టిలో అతి పెద్ద రహస్యం లేక మాయగా తెలుసుకోవాలి.

శుభమస్తు. ఇష్ట దేవతానుగ్రహ ప్రాప్తిరస్తు. విజయోస్తు.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.