Monday, February 15, 2021

దైవమును ఎందుకు చూడాలి?

దైవమును చూసినవారికి చివరిగా మోక్షప్రాప్తి, లేనివారికి నరకలోక దర్శనం అని విశ్వాసములు మనకు తెలియజేస్తున్నాయి. 

స్వర్గలోక ప్రాప్తిలో భాగంగా అక్కడి సుఖం నోరూరిస్తే, పాపఫలితంగా లభించిన నరకలోక శిక్షలు భయమును కలిగిస్తాయి. అప్సరసల నాట్యం, స్వర్గలోక జీవన విధానము, ఆకలి దప్పులు లేకుండా అమృతపానము స్వర్గలోక ఆకర్షణలు కాగా, విధించబడే సకల పాపములకు శిక్షలు నరక లోక భయమును పెంచి, పుణ్యం వైపు మానవులు కోరుకునే విధంగా ఉంటాయి. పాపకర్మల ఆచరణకు నరకలోక భయము బ్రేక్ గా పనిచేస్తుంది. చాలామంది దైవానుభూతిని పొందగోరేవారు మానవసేవను, మాధవసేవను ఎన్నుకుంటారు. ఏది చేసినా భక్తిభావం, అంకితభావం ముఖ్యం. పూర్తిగా దైవసేవలో లీనమై, భగవంతుని అనుగ్రహము పొందినవారు కొందరైతే, మానవసేవలో  ఆకలిగా ఉన్నవారి సేవలు దరిద్ర నారాయణ సేవగా భావించి జీవిస్తారు. ఇందుకు రామకృష్ణ మిషన్ వారి అన్నదానము, అక్షయపాత్ర వారిసేవను చెప్పుకోవచ్చు. గుంటూరు జిల్లా బాపట్లకు 28 కిలోమీటర్ల దూరంలోగల జిల్లెళ్ళమూడి గ్రామంలోని జిల్లెళ్ళమూడి ఆశ్రమంనందు చేయు ధాన్యాభిషేకము అను కార్యక్రమము ద్వారా అక్కడ చేయు పూజాభిషేకాలు మాధవసేవగానూ, తదుపరి ఆ ధాన్య వినియోగము సంవత్సరం పొడుగునా అన్నార్తులకు వినియోగించే విధానము మానవసేవగాను పోల్చుకోవచ్చు. మాతాపితరుల సేవలో తరించిన పుండరీకుడు, భక్తిభావంతో పరమాత్ముని అనుగ్రహం పొందిన సక్కుబాయి, మీరాబాయి చరిత్ర తెలుగువారికి పరిచయమే. ప్రపంచమాయకు లోబడి పతనమైన విశ్వామిత్రుడు, బిల్వ మంగళ చరిత్రలు కూడా మనకు జాగ్రత్తలు చెబుతాయి.

నేను కాశీలో ఉంటాను, కాశీకి వెళ్తాను అని స్మరణ మాత్రముననే కాశీయాత్ర ఫలం వస్తుందనే భారతీయ విశ్వాసము తప్పక మనని మోక్షమార్గం వైపు నిలబెడుతుంది. అలానే కొందరి వాదన ప్రకారము సకల పాపములు కాశీలోనే ఉన్నాయని, అక్కడి జంతువులకు కేవలం అక్కడ ఉన్నంత మాత్రమే మోక్షం వస్తుందా అని. విమర్శలకు మన నమ్మకము సడలక మనదైన భావనతో ముందుకి పోదాము. మన ఇతిహాసముల ప్రకారము కాశీ నగరము సప్త మోక్ష పురములలో ఒకటిగా చెప్పబడింది.

ఈసందర్భంలో శ్రీపాద శ్రీ వల్లభ పారాయణ గ్రంథము ద్వారా మనకు తెలిసిన శ్రీపాద శ్రీవల్లభస్వామి కురువపురం, కర్ణాటకలో ఉన్నప్పుడు జరిగిన విషయము తెలుసుకుందాము. స్వామి దర్శనమునకు వచ్చే పండితునికి, అతని పడవవానికి జరిగిన సంభాషణ తెలుసుకోదగినది. ఈమాటల సందర్భంలో స్వామివారిపై అచంచల భక్తి కలిగిన పడవ నడుపువాడిని ప్రశ్నించిన పండితుడు, అతనికి దైవ జ్ఞాన పరిచయము లేదని తెలుసుకొని, అతని జీవితంలోని నాలుగు వంతుల్లో మూడు వంతులు వృధా అయినదని అహంకారంతో చెప్పగా, ఈలోపు నదీ ప్రవాహం పెరిగి పడవకు చిల్లి పడి  పడవ మునిగే సందర్భములో పడవ నడిపేవాడు మీకు ఈత వచ్చా అని ప్రశ్నించగా, అతనికి రాదని తెలుసుకొని పండితుని జీవితము నూటికి నూరుపాళ్ళు వృధా అని చెప్పిన వైనము అహంకార జ్ఞానమునకు, అచంచల భక్తికి తేడాను తెలియజేస్తుంది. గమ్యస్థానము చేరిన తరువాత స్వామి పండితుని తప్పుల్ని గుర్తుచేస్తూ, అతని ఆయుర్దాయం తీరిందని, మూడేళ్ల ఆయుర్దాయమును ప్రసాదించే వరమును పండితునికి, పడవ నడిపేవానికి మరుజన్మలో రాజు అయ్యే అనుగ్రహం కలగజేయుట కొసమెరుపు.

శంకరభట్టు అనే వ్యక్తి ఏపాండిత్య అనుభవం లేకుండా శ్రీపాద శ్రీవల్లభునికి సమకాలీనులై స్వామివారి అనుగ్రహంతో స్వామివారి పారాయణ గ్రంథము అనేక దైవరహస్యములతో వ్రాసి, దాని పారాయణం వలన ఎంతో మంది భక్తులకు దైవ మార్గంలో వెళ్ళుటకు తోడ్పడి  స్వామివారి అనుగ్రహం పొందినాడు. మనకున్న విచక్షణ జ్ఞానం పెంచుకొనుటకు పిఠాపురంలోగల శ్రీపాద వల్లభ సంస్థానము శ్రీగోపాల్ బాబావారి ఆశ్రమములలో లభించే స్వామివారి పారాయణ గ్రంథము స్వయంగా లేక పోస్టు ద్వారా సంపాదించి, చదివి మీ ఆధ్యాత్మిక సంపదను పెంచుకోమని ఆస్తికులకు మనవి చేస్తున్నాను. త్వరపడి పరిమితమైన జీవితకాలమందు ఆధ్యాత్మిక అనుభూతిని మనసులో పొందండి. ఆధ్యాత్మిక అనుభూతి కలిగించే ఈపుస్తక జ్ఞానము మిమ్మల్ని దైవ మార్గంలో నడిపిస్తుందని మరిచిపోవద్దు. అదేవిధంగా భగవంతునికి గల సమదృష్టి వలన ఆయనను నమ్మినవారు, నమ్మనివారు సమానముగా చూడబడతారు. 

పంచభూతములకు ప్రతీకలుగా వెలిసిన అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశములకు గుర్తుగా తమిళనాడులోని అరుణాచల లింగం, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గల శ్రీకాళహస్తీశ్వరుడు, తమిళనాడు తిరుచినాపల్లి వద్ద గల జంబుకేశ్వరలింగము, తమిళనాడు కంచిలో శివకంచినందు గల ఏకాంబరేశ్వరుడు, అదే తమిళనాడులో చిదంబరంలోగల చిదంబరేశ్వరులను, మీ ఆర్ధిక స్తోమతను బట్టి దర్శించి, పంచభూత తత్వమును అర్ధం చేసుకొనుటకు ప్రయత్నించండి. ఈప్రయాణంలో అప్పుచేయక, ఆడంబరములకుపోక, గట్టికోరికతో, దర్శించిన ఫలితం పొందండి. 

పంచభూతాలలో గాలికి నిదర్శనంగా నిలచిన శ్రీకాళహస్తీశ్వర జ్ఞానప్రసూనాంబల దర్శనము మోక్షదాయకంగా భావిస్తారు. నవగ్రహ దోషములలో రాహు, కేతు గ్రహ పరిహారములకు చేయబడే కాలసర్ప దోషనివారణ పూజకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. పరస్పర విరుద్ధ స్వభావము కలిగిన ఏనుగు, సాలెపురుగు, సర్పముల భక్తిని తెలిపే నిదర్శనంగా ఈక్షేత్రమునకు గుర్తింపు ఉంది. తన అమాయకపు భక్తితో తిన్నడు లేక కన్నప్ప అని పిలవబడే ఆటవికుడు స్వామివారికి కళ్ళు ఇచ్చి, దైవానుగ్రహము పొందిన పుణ్యక్షేత్రం ఇదే. నాదృష్టికి వచ్చిన చిన్నప్పటి పొరుగింటి బ్రహ్మచారి కథ ఈ సందర్భంలో చెప్పుకుందాము. ఒక బ్రహ్మచారి గాయత్రీమాత దర్శనం నిమిత్తం మండుతున్న గుడ్డను నుదుటి మీద వేసుకుని దర్శనం లభించని విధము విఫల ప్రయత్నంగా నిలిచింది.                                                                                                                              (సశేషం) 

                                                                                                                                  


No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.